బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు పథకాన్ని బొంద పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. రైతులు యాచించాలని రేవంత్ రెడ్డి అంటున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు..తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో 2014లో టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతును రాజు చేయాలని, వ్యవసాయాన్ని స్థిరికరించాలని, ఎవరూ ఆలోచించని విధంగా విప్లవాత్మకమైన పథకానికి రూపకల్పన చేశారు. రైతుల మీద ప్రేమ ఉండే నాయకుడు కాబట్టి.. కేసీఆర్ రైతుకు పెట్టుబడి ఇవ్వాలని ఆలోచన చేశారు.
దాన్ని అమలు చేశారు. ఒకసారి కాదు.. వరుసగా 11 సీజన్లకు దరఖాస్తు, దండం పెట్టే అక్కర్లేకుండా.. నేరుగా వారి ఖాతాల్లో నిధులు జమ చేశారు. రూ. 73 వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేశారు కేసీఆర్. 12వ సీజన్ వేసేందుకు పైసలు జమ చేశాం. దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీ ఈసీకి ఉత్తరం రాసి ఆపారు అని కేటీఆర్ గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వొచ్చాక ఏడాది దాటినా రైతుబంధు రూపంలో రూపాయి కూడా రైతులకు ఇవ్వలేదు.
12వ సీజన్ కింద రూ. 7500 కోట్లు మేమే వేసేటోళ్లం. మేం దాచిపెట్టిన రూ. 7500 కోట్లను వాళ్లు రైతుల ఖాతాల్లో వేశారు. కొత్తగా ఇవ్వకపోగా.. వరంగల్‌లో రైతు డిక్లరేషన్ పేరిట బిల్డప్ ఇచ్చారు. రైతులను రాజులను చేస్తాం అని రాహుల్ గాంధీ చేత ఉపన్యాసాలు ఇప్పించారు. కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తామన్నారు. ఏకకాలంలో రూ. 2 లక్షల రుణమాఫీ, బోనస్ రూ. 500, రైతు కూలీలకు రూ. 12 వేలు ఇస్తామన్నారు. ఇది రైతు డిక్లరేషన్ వాగ్దానాలు అని కేటీఆర్ గుర్తు చేశారు.