కొందరు రేవంత్ సైన్యంలా పనిచేస్తున్నారు
లగచర్ల బాధితులకు న్యాయం చేయాలి
లేదంటే మరోమారు ‘సుప్రీమ్’ను ఆశ్రయిస్తాం
బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కెటిఆర్ హెచ్చరిక
కొందరు పోలీసులు రేవంత్ టీమ్‌లాగా పనిచేస్తున్నారని మాజీమంత్రి, బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కెటిఆర్ అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్ వ్యవహార శైలిని, పోలీసుల తీరును ఎన్‌హెచ్‌ఆర్‌సీ తీవ్రంగా తప్పుబట్టింది. ఎన్‌హెచ్‌ఆర్‌సీ నివేదిక తర్వాతైనా రేవంత్‌రెడ్డి క్షమాపణలు చెప్పాలి. బాధ్యులైన పోలీసులను సర్వీసు నుంచి తొలగించాలి. లేదంటే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం. హైకోర్టు స్టే ఇచ్చినా భూసేకరణ చేస్తున్నారని తెలిసింది. దానిని వెంటనే నిలిపివేయాలి. మూడేళ్లలో మా పార్టీ అధికారంలోకి వొస్తుంది. అతి చేసే అధికారులపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని కేటీఆర్ అన్నారు. లగచర్ల ఘటనపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. గిరిజనుల పట్ల జరిగిన అన్యాయాన్ని, పోలీసుల ప్రవర్తనను, రాష్ట్ర ప్రభుత్వ తీరును ఆయన తీవ్రంగా విమర్శించారు.
లగచర్ల గ్రామస్తుల హక్కుల కోసం బీఆర్‌ఎస్ పోరాడుతుందంటూ ఢంకా మోగించారు. బీఆర్‌ఎస్ బహిరంగ సభ కోసం లగచర్ల గిరిజన ఆడబిడ్డలు స్వచ్ఛందంగా లక్ష రూపాయలు విరాళంగా అందించారు. ఇది రాజకీయ సభలకు సాధారణంగా లభించే విరాళం కాదు, వారి ఆత్మబలమైన సంకేతం. బీఆర్‌ఎస్ లాంటి పార్టీ మాకు అండగా ఉంది కాబట్టే మేము ఈ సహాయం చేస్తున్నాం అని ఆడబిడ్డలు పేర్కొనడం విశేషం. ప్రభుత్వం 40 మంది లగచర్ల రైతులను అరెస్టు చేసి జైళ్లలో చిత్రహింసలకు గురిచేసిందని కేటీఆర్ ఆరోపించారు. ముఖ్యంగా హీర్యా నాయక్ అనే రైతుకు గుండెనొప్పి వచ్చినప్పుడు కూడా పోలీసులు కట్టేసిన సంకెళ్లతోనే హాస్పిటల్‌కి తరలించారని, ఇది మానవత్వానికి వ్యతిరేకమని మండిపడ్డారు. లగచర్ల ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్, ఎస్సీ,ఎస్టీ కమిషన్‌లు స్పందించాయని, పోలీసులు అప్రజాస్వామికంగా ప్రవర్తించారని రిపోర్ట్‌లో పేర్కొన్నట్లు కేటీఆర్ వెల్లడించారు. పోలీసులు ప్రయివేటు సైన్యంలా, మానవ మృగాల్లా ప్రవర్తించారన్న ఆరోపణలు నిజమయ్యాయఅని వ్యాఖ్యానించారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చెట్ల నరకడం, లగచర్ల రైతులపై దాడి వంటి అంశాలపై సుప్రీంకోర్టు నియమించిన కమిటీ, జాతీయ మానవ హక్కుల సంఘం తీవ్ర విమర్శలు చేసినట్లు కేటీఆర్ పేర్కొన్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి నైతిక పరాభవంగా నిలిచిందన్నారు.రేవంత్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యేగా, హోంమంత్రిగా, ముఖ్యమంత్రిగా ఉండడానికి అర్హత కోల్పోయారు. వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసారు. కొడంగల్ ప్రాంతంలోని ఆడబిడ్డలకు జరిగిన అవమానం వల్ల రేవంత్ రెడ్డి వారికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కేటీఆర్ స్పష్టం చేశారు. లగచర్ల రైతులపై దాడి చేసిన పోలీసులను సర్వీసు నుండి తొలగించాలని డిమాండ్ చేసిన కేటీఆర్, చర్యలు తీసుకోకపోతే మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వస్తుందని హెచ్చరించారు.
ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసిన తప్పులకు పదవీ విరమణ తర్వాత కూడా వదిలిపెట్టమని అధికారులకు హెచ్చరికలు చేశారు. ప్రభుత్వం లగచర్లలో భూసేకరణ చర్యలను తక్షణమే నిలిపివేయాలని బీఆర్‌ఎస్ డిమాండ్ చేసింది. ప్రజల భూములను బలవంతంగా స్వాధీనం చేసుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించింది.ఏప్రిల్ 27న నిర్వహించనున్న బీఆర్‌ఎస్ రజతోత్సవానికి వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామానికి చెందిన మహిళలు విరాళం ఇచ్చారు. తెలంగాణ భవన్‌లో ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు ఆ మొత్తాన్ని అందజేశారు.