ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వృద్ధి మందగించినా భారత్ మెరుగైన పనితీరు సాధించిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి చెందిన బడ్జెట్‌ను నిర్మలమ్మ శనివారం పార్లమెంట్ ముందు ఉంచారు. ఉదయం 11 గంటలకు సమావేశాలు ప్రారంభం కాగానే లోక్‌సభలో బడ్జెట్‌పై ప్రసంగం ప్రారంభించారు. పేదలు, యువత, రైతులు, మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యంతో ఈ బడ్జెట్‌ను రూపకల్పన చేసినట్లు చెప్పారు. గత పదేళ్లలో సాధించిన అభివృద్ధే తమ స్ఫూర్తి, మార్గదర్శి అని తెలిపారు. ఇక ఈ బడ్జెట్‌లో వేతన జీవులకు భారీ ఊరట కల్పించారు. రూ.12 లక్షల వరకు ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు కల్పించారు. రూ.12 లక్షలకు మించిన ఆదాయం ఉన్నవారికి శ్లాబులవారీగా పన్నులను నిర్ణయించారు. రూ.20లక్షల నుంచి రూ.24 లక్షల వరకు 25 శాతం పన్నుగా నిర్ణయించారు. రూ.16 లక్షల నుంచి 20లక్షల్లోపు ఆదాయంపై 20 శాతం పన్నుగా నిర్ణయించారు. ఇక కేంద్రంలో ప్రధాన మిత్రపక్ష రాష్ట్రమైన బీహార్‌కు వరాల జల్లు కురిపించారు.
బడ్జెట్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..
వేతన జీవులకు భారీ ఊరట.. 12 లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు. రూ.12 లక్షలకు మించిన ఆదాయం ఉన్నవారికి శ్లాబులవారీగా పన్నులను నిర్ణయించారు. రూ.20లక్షల నుంచి రూ.24 లక్షల వరకు 25 శాతం పన్నుగా నిర్ణయించారు. రూ.16 లక్షల నుంచి 20లక్షల్లోపు ఆదాయంపై 20 శాతం పన్నుగా నిర్ణయించారు.
బీహార్‌కు బడ్జెట్ గిఫ్ట్.. రాష్ట్రంలో ప్రత్యేక మఖానా బోర్డు ఏర్పాటు
బీహార్‌లోని మిథిలాంచల్ ప్రాంతంలో 50,000 హెక్టార్లకు ప్రయోజనం చేకూర్చే వెస్టర్న్ కోసి కెనాల్‌కు ఆర్థిక సాయం
ఐఐటీ పట్నా సామర్థ్యాన్ని మరింత పెంచుతాం
బీహార్‌లో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, ఎంటర్ ప్రెన్యూర్‌షిప్ అండ్ మేనేజ్‌మెంట్ ఏర్పాటు.
వృద్ధులకు వడ్డీపై టీసీఎస్ ఊరట.. వడ్డీపై వచ్చే ఆదాయంపై రూ.50 వేల నుంచి రూ.లక్షకు పెంపు. అద్దె ద్వారా వచ్చే ఆదాయంపై 2.4 లక్షల నుంచి రూ.6 లక్షలకు పెంపు
వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత.. రైతుల ఆదాయాన్ని పెంచడానికి చర్యలు
వంద జిల్లాలను ఎంపిక చేసి వ్యవసాయంలో అధునూతన పద్ధతులను అమలుచేస్తాం
గ్రామీణ ప్రాంతాల్లో సంపద సృష్టికి ప్రత్యేక చర్యలు
పప్పు ధాన్యాల ఉత్పత్తికి స్వయం సమృద్ధి పథకం. రైతుల నుంచి నేరుగా పప్పు ధాన్యలు సేకరణ
కంది, మినుములు, మసూర్‌లను కొనుగోలు చేయనున్న కేంద్రం
పండ్లు, కూరగాయల ఉత్పత్తికి నూతన పథకం
కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంపు. దీని ద్వారా 7.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం.
ఎంఎస్‌ఎంఈలకు ఇచ్చే రుణాలు రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్లకు పెంపు
స్టార్టప్‌లకు రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్లకు పెంపు
బొమ్మల తయారీ రంగాన్ని ప్రోత్సహిస్తాం.. ఇందుకోసం ప్రత్యేక పథకాన్ని తీసుకొస్తాం.
విద్యారంగంలో సంస్కరణలు.. వచ్చే ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 75 వేల కొత్త మెడికల్ సీట్లు
గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా.. ఈ-శ్రమ్ పోర్టల్ కింద గుర్తింపు కార్డులు, పీఎం జన్ ఆరోగ్య యోజన కింద ఆరోగ్య బీమా
జల్ జీవన్ మిషన్‌కు మరిన్ని నిధులు.. ఈ పథకం కింద 15 కోట్ల మందికి రక్షిత మంచినీరు అందించాం
రూ.30 వేల పరిమితితో పట్టణ పేదల కోసం యూపీఐ లింక్డ్ క్రెడిట్ కార్డులు
రాష్ట్రాలకు రూ.1.5 లక్షల కోట్ల రుణాలు. 50 ఏళ్లకు వడ్డీ రహిత రుణాలు
వచ్చే వారం ఇన్‌కమ్ ట్యాక్స్ బిల్లు
దేశ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో డే కేర్ క్యాన్సర్ సెంటర్లు
బీమా రంగంలో ప్రస్తుతం 74 శాతంగా ఉన్న ఎఫ్‌డీఐ 100 శాతానికి పెంపు
కృత్రిమ మేధ అభివృద్ధికి రూ.500 కోట్లతో మూడు ప్రత్యేక కేంద్రాలు
చిన్న స్థాయి అణు రియాక్టర్ల కోసం జాతీయ అణుశక్తి మిషన్. రూ.20 వేల కోట్లతో నేషనల్ న్యూక్లియర్ ఎనర్జీ మిషన్. 2030 నాటికి నాలుగు చిన్న, మధ్యస్థాయి రియాక్టర్ల ఏర్పాటు. 2047 నాటికి 100 గిగావాట్ల అణువిద్యుత్ ఉత్పత్తి లక్ష్యం.
36 ఔషధాలకు బేసిక్ కస్టమ్స్ డ్యూటీ తొలగింపు
త్వరలో జనవిశ్వాస్ 2.0 బిల్లు
పర్యాటక ప్రాంతాలకు మెరుగైన రవాణా సదుపాయాలు. రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి 22 పర్యాటక ప్రాంతాల అభివృద్ధి
దేశ వ్యాప్తంగా పెట్టుబడుల ఉపసంహరణ, ఆస్తుల విక్రయానికి రెండో ప్రణాళిక