వాణిజ్య కూడళ్లను అద్దెలకు ఇవ్వాలని హెచ్‌ఎండీఏ నిర్ణయం!
హైదరాబాద్ నగరంలోని హుస్సేన్‌సాగర్ పరిసరాలైన ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్డు, లుంబినీ పార్కు, ఐమాక్స్ థియేటర్ల వద్ద నిత్యం పర్యాటకుల సందడి కనిపిస్తుంటుంది. శని, ఆదివారాల్లో టూరిస్ట్‌ల సంఖ్య రెట్టింపు స్థాయిలో ఉంటోంది. పర్యాటకాన్ని ఆదాయ వనరులుగా మార్చుకునేందుకు ట్యాంక్‌బండ్ చుట్టూ హెచ్‌ఎండీఏ పలు వాణిజ్య కూడళ్లను నిర్వహిస్తోంది. చాలా కాలంగా వాటిని లీజు, అద్దెకు ఇవ్వడం ద్వారా ఆదాయాన్ని పొందుతోంది. అయితే కొంతమంది లీజుకు, అద్దెకు తీసుకొని తర్వాత చెల్లింపులు చేయకుండా ఎగవేతలకు పాల్పడుతున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే అధికారులు కొన్ని లీజులను రద్దు చేశారు. తాజాగా హుస్సేన్‌సాగర్ చుట్టూ 20 వరకు ఉన్నటువంటి వాణిజ్య కూడళ్లను గుర్తించి వాటిని తిరిగి అద్దెకు ఇచ్చేందుకు హెచ్‌ఎండీఏ కసరత్తు చేస్తోంది. త్వరలో వీటికి టెండర్లను పిలిచేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. ఎన్టీఆర్ మెమోరియల్ పార్కింగ్, ఐమాక్స్, లుంబినీ పార్కు రెస్టారెంట్, సంజీవయ్య పార్కు క్లాక్ రూంల వద్ద వాణిజ్య కార్యకలాపాలకు సంబంధించి అద్దెలకు ఇచ్చేందుకు టెండర్లు పిలవాలని నిర్ణయించారు.