ఫార్మా కంపెనీ ఏర్పాటుపై మండిపడ్డ జనం
ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర్, ప్రత్యేక అధికారి
దాడులకు ప్రయత్నించిన రైతులు
కలెక్టర్, ప్రత్యేక అధికారి కారు అద్దాలు ధ్వంసం
ప్రాణభయంతో పరుగులు తీసిన అధికారులు
ఫార్మా కంపెనీకి భూసేకరణ నిమిత్తం ఉన్నతాధికారులు ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణ ఉద్రిక్తతగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కోడంగల్ లో మరోసారి తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల ఫార్మా కంపెనీ ఏర్పాటు కోసం భూసేకరణకు వెళ్లిన నాయకులపై గ్రామ రైతులు దాడికి పాల్పడిన ఘటన నేపథ్యంలో ప్రజాభిప్రాయ సేకరణను వాయిదా వేసి తిరిగి సోమవారం నిర్వహించేందుకు ప్రయత్నించిన ఉన్నతాధికారులకు చేదు అనుభవం ఎదురయింది. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం బొంరాస్పేట్ మండలం లగచర్ల గ్రామంలో ఫార్మ కంపెనీ ఏర్పాటు నిమిత్తం భూసేకరణ కోసం సమావేశానికి సిద్ధమైన అధికారులపై గ్రామానికి చెందిన రైతులు ఏకంగా దాడులకు పాల్పడ్డారు. ఏకంగా జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, కొడంగల్ డెవలప్మెంట్ అథారిటీ అధికారి (కడ) వెంకటరెడ్డి వాహనాలపై రైతులు దాడులకు పాల్పడి కారు అద్దాలను ధ్వంసం చేశారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు హుటాహుటిన లగచర్ల గ్రామంలో పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు.
సోమవారం ప్రజాభిప్రాయ సేకరణ కోసం బొమ్రాస్ పేట్ మండలం లగచర్ల గ్రామానికి వెళ్ళిన కలెక్టర్ ప్రత్యేక అధికారి రెవిన్యూ అధికారులపై గ్రామ రైతులు ఏకంగా రాళ్లు కర్రలతో దాడి చేశారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సందర్భంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ రైతులను గ్రామస్తులను నిలువరించేందుకు ప్రయత్నించగా వెనుక వైపు నుంచి ఓ మహిళ దాడి చేసింది. సోమవారం ఫార్మా కంపెనీ ఏర్పాటు కోసం భూసేకరణ విషయమై రైతుల తో చర్చించేందుకు జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ప్రత్యేకంగా బొమ్రాస్పె ట్ మండల శివారులో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించే సమావేశ స్థలికి వెళ్లగా ఫార్మా కంపెనీ ఏర్పాటు చేసేందుకు స్థలం సేకరించాలని నిర్ణయించిన లగచర్ల గ్రామంలోనే ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని అక్కడికి వెళ్లిన కొందరు రైతులు కలెక్టర్ తో వాగ్వాదానికి దిగారు. దీంతో లగ్గిచర్ల గ్రామంలోనే ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిచేందుకు వెళ్లిన కలెక్టర్, కడ ప్రత్యేక అధికారి వాహనాలపై రైతులు, గ్రామస్తులు కొందరు మూకుమ్మడిగా దాడులకు తెగబడ్డారు. కలెక్టర్ అధికారులతో కలిసి గ్రామంలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న సందర్భంలో గ్రామస్తులు ఒక్కసారిగా అధికారులు గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ అధికారులపై ముకుమ్మడిగా విరుచుకుపడ్డారు. ఏకంగా జిల్లా కలెక్టర్ కారు అద్దాలను ధ్వంసం చేశారు. లగిచర్ల గ్రామంలోనే ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని డిమాండ్ చేసిన రైతులు అధికారులను నమ్మించి దాడికి తెగబడటం గమనార్హం. కడ ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి తన కారుపై దాడులకు పాల్పడడంతో పొలాల గుండా ఆత్మ రక్షణ కోసం పరుగులు తీశారు.