ఈసీ నుంచి ఇంకా రాని క్లారిటీ
టీఎస్, న్యూస్ : రాష్ట్ర కేబినెట్ సమావేశం ఏర్పాటుపై ఇంకా స్పష్టత రాలేదు. ఎన్నికల కోడ్ దృష్ట్యా కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి కోరారు. కేబినెట్ భేటీ నిర్వహించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఈసీకి లేఖ రాశారు. ఎన్నికల కమిషన్ అనుమతి కోసం సీఎం రేవంత్ సహా కేబినెట్ మంత్రులు అందరూ వేచి ఉన్నారు. ఈసీ అనుమతి ఇస్తే సాయంత్రం 4 గంటలకు కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఒక వేళ అనుమతి నిరాకరిస్తే కేవలం మంత్రులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణలో లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో దాదాపు మూడు నెలల పాటు కేబినెట్ సమావేశం నిర్వహించలేదు.
దీంతో పాలనపై తీసుకోవల్సిన కొన్ని నిర్ణయాలు పెండింగ్ లో ఉన్నాయి. మే 18న కేబినెట్ సమావేశం నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి భావించారు. దీనిపై సీఎస్ శాంతి కుమారి ఈసీని అనుమతి కోరారు. అనుమతి వస్తే ఈరోజు కేబినెట్ లో రైతు రుణమాఫీ, ఆదాయం పెంపు అంశాలపై చర్చ ఉన్నతస్థాయి సమావేశం జరిగే అవకాశం ఉంది. దీంతో పాటు వర్షాకాల సీజన్‌లో చేపట్టాల్సిన చర్యలపై కూడా సుదీర్ఘంగా చర్చించనున్నారు.
పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌తో పాటు తెలుగు రాష్ట్రాల మధ్య దశాబ్ద కాలంగా అపరిష్కృతంగా ఉన్న అంశాలపై కూడా సలహాలు, సూచనలు ఉన్నతాధికారులను అడిగి తెలుసుకోనున్నారు. అందుకే మూడు నెలల తరువాత నిర్వహించే ఈ సమావేశంపై అందరిలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.