కేబినెట్ సబ్ కమిటీ 317 జిఓపై శుక్రవారం సాయంత్రం 4 గంటలకు భేటీ కానుంది. ఈ భేటీకి మంత్రులు దామోదర రాజ నర్సింహ, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ హాజరు కానున్నారు. 317 జిఓ ప్రభావిత ఉద్యోగుల అభ్యర్థనలపై ఈ కమిటీ చర్చించనుంది. ఇప్పటికే స్పౌజ్, మెడికల్, మ్యూచువల్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల భార్య, భర్త చేసుకున్న దరఖాస్తులపై కమిటీ సానుకూలంగా నిర్ణయం తీసుకుంది. మిగతా దరఖాస్తులపై శాఖల వారీగా నివేదికలను సిద్ధం చేశారు.
వాటిపై కూడా సబ్ కమిటీలో చర్చించనున్నారు. 2008 డిఎస్సీ బాధితలకు ఉద్యోగాలు ఇచ్చే అంశంలో విధి విధానాలపైనా సబ్ కమిటీ చర్చించే అవకాశం ఉంది. బాధితులకు ఆంధ్రప్రదేశ్ తరహాలో ఉద్యోగాలు ఇవ్వాలని మార్చి 14వ తేదీన జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. విధి విధానాల బాధ్యతలను కేబినెట్ సబ్ కమిటీకి ప్రభుత్వం అప్పగించింది.
ఇప్పటికే ఉమ్మడి జిల్లాల వారీగా నష్టపోయిన అభ్యర్ధుల వివరాలను విద్యా శాఖ సేకరించింది. బాధితులకు ఆరువారాల్గో ఉద్యోగాలు ఇస్తామని జూన్ 27న హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. ఆగస్టు 8వ తేదీన కోర్టు విచారణ జరపనుంది. ఈ నేపధ్యంలో శుక్రవారం జరిగే సమావేశంలో డిఎస్సీ 2008 బాధితులకు ఉద్యోగాలు కల్పించే అంశంపై కూడా విధి విధానాలను ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.