రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ మంత్రి సీతక్క
ప్రాథమిక దశలోనే క్యాన్సర్‌ను గుర్తిస్తే సులువుగా నయం చేయవచ్చునని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ మంత్రి అనసూయ సీతక్క తెలిపారు. మాదాపూర్‌లోని దస్పల్లా హోటల్లో గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్యాన్సర్ మహమ్మారి ఎన్నో ప్రాణాలను బలిగొంటుందని అన్నారు. మారిన లైఫ్ స్టైల్ ఆహారపు అలవాట్లు క్యాన్సర్‌కు ఒక కారణంగా నిలుస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఎన్నో అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని అన్నారు. క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు ‘రన్ ఫర్ గ్రేస్, స్క్రీన్ ఫర్ లైఫ్’ అనే నినాదంతో 20 వేల మందితో నిర్వహిస్తున్న రన్‌ను విజయవంతం చేయాలని అన్నారు. గ్రామీణ ప్రజలకు అవగాహన కల్పించేందుకు గ్రామీణ ప్రాంతాల్లో ఉచితంగా క్యాన్సర్ పరీక్షలు నిర్వహించేందుకు ముందుకొచ్చిన గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్‌కు మంత్రి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సినీ నటుడు ఆలీతో కలిసి ‘రన్ ఫర్ గ్రేస్, స్క్రీన్ ఫర్ లైఫ్’ జెర్సీని మంత్రి ఆవిష్కరించారు.
అధికారులంతా సమన్వయంతో పని చేయాలి
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధికారులు సమన్వయంతో, అప్రమత్తంగా వ్యవహరించి శాంతియుత వాతావరణంలో భక్తి శ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు విజయవంతం అయ్యేలా చూడాలని ఆదిలాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క సూచించారు. ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా అధికారులు, డిపిఓలు, మున్సిపల్ కమిషర్లతో శుక్రవారం సచివాలయంలో మంత్రి సీతక్క టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో వినాయక చవితి ఏర్పాట్లను సమీక్షించారు.
ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు. గణేష్ ఉత్సవ కమిటీలు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, పౌర సంఘాలు, స్వచ్ఛంద సంస్థలతో సమావేశాలు నిర్వహిస్తూ ఎక్కడ ఇలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో శాంతికి విఘాతం కలిగించే చర్యలను తమ ప్రభుత్వం సహించదని, ఎంతటి వారినైనా కఠినంగా శిక్షిస్తామని మంత్రి సీతక్క హెచ్చరించారు. శాంతి భద్రత విషయంలో ఎక్కడా రాజీ పడబోమని స్పష్టం చేశారు. అన్ని మతాల విశ్వాసాలను గౌరవిస్తమన్న మంత్రి, అందరి హక్కులను ప్రభుత్వం కాపాడుతుందని చెప్పారు. తప్పుడు ప్రచారం చేసే సోషల్ మీడియా మీద నిఘా పెంచాలని ఆదేశించారు.
20న ఉమెన్ ప్రొఫెషనల్ సదస్సుకు ఆహ్వానం
ఈ నెల 20న జరిగే ఉమెన్ ప్రొఫెషనల్ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరు కావాలని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి అనసూయ సీతక్కను సిఐఐ ఇండియన్ ఉమెన్ నెట్వర్క్ (ఐడబ్లుఎన్) ప్రతినిధులు శుక్రవారం ఆహ్వానించారు. ఈ మేరకు మంత్రి సీతక్క తో సిఐఐ ఇండియన్ ఉమెన్ నెట్వర్క్ తెలంగాణ చైర్ పర్సన్ డాక్టర్ అనుపమ పండూరు, వైస్ చైర్ పర్సన్ హేమాల్ శ్రీనివాస్ భేటీ అయ్యారు. ఆహ్వాన పత్రం అందజేసి తప్పకుండా హాజరు కావాలని కోరారు. కాంగ్రెస్ నాయకుడు అద్దంకి దయాకర్ నటించిన ఇండియా ఫైల్స్ అనే చిత్రంలో ‘అన్ని బంద్ అంట‘ అనే పాటను సచివాలయంలో మంత్రి సీతక్క ఆవిష్కరించారు.
అద్దంకి దయాకర్‌కు అభినందన
రాజ్యాంగ పరిరక్షణ ఇతివృత్తంగా గొప్ప సందేశాత్మక ‘ఇండియా ఫైల్స్’ చిత్రంలో నటించిన కాంగ్రెస్ నాయకుడు అద్దంకి దయాకర్‌ను మంత్రి సీతక్క అభినందించారు. ప్రజలను చైతన్య పరుస్తూ, పోరాట పందా నేర్పిస్తూ సాగే ఇండియా ఫైల్స్ చిత్రం విజయవంతం కావడం ఖాయమని అన్నారు. ఇండియా ఫైల్స్ అనే చిత్రంలో ‘అన్ని బంద్ అంట‘ అనే పాటను సచివాలయంలో మంత్రి సీతక్క శుక్రవారం ఆవిష్కరించారు.