Monday, November 18, 2024

ఏపీలో ప్రజలకు సేవ చేయలేరా?

న్యూదిల్లీ, అక్టోబర్ 15: ఏపీలో ప్రజలకు సేవ చేసేందుకు మీకు ఇబ్బంది ఏమిటని ఐఏఎస్‌ అధికారులను క్యాట్‌ ప్రశ్నించినట్లు సమాచారం. రాష్ట్ర పునర్విభజన సందర్భంగా జరిగిన కేటాయింపుల ప్రకారం ఆయా రాష్టాల్రకు వెళ్లాలంటూ ఈ నెల 9న కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ ఐఏఎస్‌ అధికారులు వాకాటి కరుణ, కె.ఆమ్రపాలి, ఎ.వాణీప్రసాద్‌, డి.రొనాల్డ్‌రాస్‌, జి.సృజనలు కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్‌)ను ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై మంగళవారం విచారణ చేపట్టిన క్యాట్‌ కీలక వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం. ఏపీలో ప్రజలు వరదలతో ఇబ్బంది పడుతున్నారు. అలాంటి చోటుకు వెళ్లి వారికి సేవ చేయాలని మీకు లేదా? ఐఏఎస్‌ల కేటాయింపులపై డీవోపీటీకి పూర్తి అధికారాలు ఉన్నాయి.

స్థానికత ఉన్నప్పటికీ స్వాపింగ్‌ చేసుకునే అవకాశం గైడ్‌లైన్స్‌లో ఉందా? అని క్యాట్‌ ప్రశ్నించింది. వన్‌ మ్యాన్‌ కమిటీ సిఫారసులను డీవోపీటీ పట్టించుకోవడం లేదని ఐఏఎస్‌ అధికారుల తరఫు న్యాయవాది క్యాట్‌ దృష్టికి తెచ్చారు. సింగిల్‌మెన్‌ కమిటీ సిఫార్సుల ఆధారంగా కేంద్రం ఉత్తర్వులు జారీ చేసే ముందు కమిటీ నివేదికను ఇవ్వలేదన్నారు. ఇది సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని పేర్కొన్నారు. డీవోపీటీ ఉత్తర్వులను రద్దు చేయడంతో పాటు ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న రాష్టాల్ల్రో నే కొనసాగేలా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ప్రస్తుతం తెలంగాణలో పనిచేస్తున్న వాకాటి కరుణ, ఆమ్రపాలి, వాణీప్రసాద్‌, రొనాల్డ్‌రాస్‌లు కేంద్రం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఏపీకి వెళ్లాల్సి ఉంది. ప్రస్తుతం ఏపీలో పనిచేస్తున్న సృజన తెలంగాణకు రావాల్సి ఉంది. ప్రస్తుతం తాము పనిచేస్తున్న రాష్ట్రంలోనే కొనసాగించేలా ఉత్తర్వులు జారీ చేయాలని, కేంద్రం జారీ చేసిన కేటాయింపు ఉత్తర్వులను రద్దు చేయాలని పిటిషన్‌లో కోరారు. కేటాయింపుల సమయంలో కేంద్రం తమ అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకోలేదని తెలిపారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular