Tuesday, May 13, 2025

వద్దంటే.. అవే హాస్టల్‌ విద్యార్థులకు క్యాన్సర్‌ కారక ఆహార పదార్థాలు

రాష్ట్రంలోని రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ కు ఆహార పదార్థాలు సరఫరా చేసేందుకు ‘ది హైదరాబాద్‌ అగ్రికల్చర్‌ కో ఆపరేటివ్‌ అసోసియేషన్‌ (హాకా) లిమిటెడ్‌ ఈనెల 23న టెండర్ నోటిఫికేషన్‌ ఇచ్చింది. మొత్తంగా 79 రకాల పదార్థాల సరఫరాకు హాకా టెండర్‌ నోటిఫికేషన్‌ ఇచ్చింది. అనుభవం, అర్హత ఉన్న సంస్థలు ఆయా పదార్థాలు నేరుగా కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు, రెసిడెన్షియల్‌ స్కూళ్లు, మోడ్రన్‌ స్కూళ్లకు సరఫరా చేయాలని నోటిఫికేషన్‌ లో వెల్లడించింది. టెండర్లు దాఖలు చేసేందుకు మంగళవారం మధ్యాహ్నం 12 గంటల వరకు అవకాశం ఇచ్చింది.

అయితే, విద్యార్థులకు ఫలానా కంపెనీల ఆహార పదార్థాలనే సరఫరా చేయాలని టెండర్‌ నిబంధనల్లో చేర్చారు. అందులో నిషేధిత సంస్థలు కూడా ఉన్నాయని ఆందోళన వ్యక్తమవుతున్నది. పలు దేశాలు ఆయా ఆహార పదార్థాలను బ్యాన్‌ చేసిన తర్వాత మన దేశంలోనూ వాటి ఆహార నాణ్యతను పరిశీలిస్తే వాటిలో క్యాన్సర్‌ కారక పెస్టిసైడ్స్‌ అవశేషాలు ఉన్నట్టుగా తేలింది.

ఇవీ బ్యాన్​
భారత్ కు చెందిన ఎండీహెచ్‌, ఎవరెస్ట్‌ బ్రాండ్‌ స్పైసెస్‌ ను హాంగ్‌ కాంగ్‌ సహా పలు దేశాలు ఇటీవల బ్యాన్‌ చేశారు. ఆయా సంస్థలు ఉత్పత్తి చేస్తున్న పదార్థాలకు క్వాలిటీ కంట్రోల్‌ టెస్టులు నిర్వహించగా వాటిలో క్యాన్సర్‌ కారక పెస్టిసైడ్స్‌ వాడినట్టుగా నిర్దారణ అయ్యిందని రాయిటర్స్‌ తమ కథనంలో వెల్లడించింది. ఆయా ఆహార పదార్థాల్లో ఇథలిన్‌ ఆక్సైడ్‌ ఆనే హానికార పెస్టిసైడ్‌ గుర్తించామని, అది దీర్ఘకాలంలో మనుషులపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని.. వాళ్లు క్యాన్సర్‌ బారిన పడటానికి కారణమవుతుందని ఆ కథనంలో వెల్లడించింది. ఎండీహెచ్‌, ఎవరెస్ట్‌ బ్రాండ్‌ స్పైసెస్‌ భారతదేశంలో విస్తృతంగా వినియోగిస్తున్నారు, అమెరికా, యూరోప్‌, మిడిల్‌ ఈస్ట్‌, యూకే దేశాలకు తమ పదార్థాలను సరఫరా చేస్తున్నారు. ఏప్రిల్‌ 5న ఈ బ్రాండ్ల స్పైసెస్‌ పై హాంకాంగ్‌ నిషేధం విధించింది.

ఎవరెస్ట్‌ కర్రీ మసాలాను రీ కాల్‌ చేయాలని సింగపూర్‌ ఫుడ్‌ ఏజెన్సీ ఏప్రిల్‌ 18న ఆదేశాలు ఇచ్చింది. 2023లోనే ఎవరెస్ట్‌ కు చెందిన రెండు స్పైసెస్‌ ను అమెరికా రీకాల్‌ చేసింది. ఈనేపథ్యంలో సీఎఫ్‌ఎస్‌ ఎండీహెచ్‌కు చెందిన మద్రాస్‌ కర్రీ పౌడర్‌, సాంబార్‌ మసాలా పౌడర్‌, కర్రీ పౌడర్‌, ఎవరెస్ట్‌ కు చెందిన ఫిష్‌ మసాలాలను పరీక్షించి వాటిలో క్యాన్సర్‌ కారక పెస్టిసైడ్స్‌ ఉపయోగించినట్టుగా గుర్తించింది. ఈ విషయాన్ని సీఎఫ్‌ఎస్‌ కు చెందిన సీనియర్‌ అధికారే నిర్దారించారని రాయిటర్స్‌ వెల్లడించింది.

హాకా జారీ చేసిన టెండర్‌ నోటిఫికేషన్‌ లో గరం మసాలా, చికెన్‌ మసాలా, మటన్‌ మసాలా, బోజ్వర్‌ మసాలాల్లో ఎవరెస్ట్‌ బ్రాండ్‌ కూడా సరఫరా చేయవచ్చని నిర్దేశించారని, వెంటనే ఆ బ్రాండ్‌ ను జాబితా నుంచి తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నారు. టెండర్‌ నోటిఫికేషన్‌ లో మరో రెండు సంస్థల బ్రాండ్ల పేర్లు ఉన్నా.. ఎవరెస్ట్‌ మసాలాలు సరఫరా చేసేలా ప్రభుత్వ పెద్దలు ఇప్పటికే ఒక ఏజెన్సీతో ఒప్పందం కుదుర్చుకున్నారని అనుమానిస్తున్నారు. టెండర్‌ తో సంబంధం లేకుండా ఆ ఏజెన్సీకే మసాలాలు సరఫరా చేసే పనులు అప్పగించేలా తెరచాటు వ్యవహారాలు సాగాయని.. ఇందులో ప్రభుత్వంలోని ప్రముఖుల ప్రమేయం కూడా ఉందని ఆరోపిస్తున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com