కేంద్ర కేబినేట్ కీలక నిర్ణయం
సరిహద్దు ఉద్రిక్తతలో పాటు పలు అంశాలపై చర్చ
వివరాలు వెల్లడించిన మంత్రి అశ్వినీ వైష్ణవ్
పలు రాష్ట్రాల్లో సర్వే అస్పష్టతగా ఉందని వ్యాఖ్య
దేశంలో కుల గణనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వొచ్చే జనాభా లెక్కలతో పాటు కులగణన చేపట్టాలని నిర్ణయించింది. జనాభా లెక్కల్లోనే కులగణను చేర్చుతామని కేంద్రం ప్రకటించింది. కులగణన పేరుతో కాంగ్రెస్ సర్వే చేయించిందని, ఆయా రాష్ట్రాల్లో చేపడుతున్న సర్వేల్లో పారదర్శకత లేదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. బుధవారం కేంద్ర కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన వివరాలను మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీని సూపర్ కేబినెట్‌గా వ్యవహరిస్తారు. బుధవారం జరిగిన భేటీలో కులగణనకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. కుల గణన అంశం కేంద్రం పరిధిలోకి వొస్తున్నప్పటికీ.. కొన్ని రాష్ట్రాలు మాత్రం సర్వేల పేరుతో వాటిని నిర్వహించాయన్నారు. ముఖ్యంగా విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రాజకీయ కారణాల వల్ల వాటిని చేపట్టారని విమర్శించారు. ఇందులో పారదర్శకత లేదన్నారు.
కేవలం రాజకీయ కారణాలతో చేసినందున స్పష్టత లేదన్నారు. అందుకే తదుపరి దేశవ్యాప్తంగా చేపట్టే జనాభా లెక్కల ప్రక్రియలో కులగణనను చేర్చి పారదర్శకంగా చేపట్టాలన్నదే మోదీ ప్రభుత్వ సంకల్పమని చెప్పారు. దేశ రక్షణకు సంబంధించి ముఖ్యంగా దృష్టిపెట్టిన కేంద్ర మంత్రివర్గం ఈ అంశంతో పాటు, దేశ వ్యాప్తంగా, వివిధ రాష్ట్రాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు సంబంధించి కూడా నిర్ణయాలు తీసుకుంది. ఈ నిర్ణయాలను కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. జనాభా లెక్కల్లో భాగంగా కులగణన కూడా చేస్తామని కేంద్రం పేర్కొంది. పారదర్శకంగా కులగణన జరగాలని కేంద్రం భావిస్తోంది. ఇందు కోసం సర్వేలపై ఆధారపడకుండా జనాభా లెక్కలలోనే ఈ విషయం నిర్ధారణ చేసుకుంటే సామాజిక సమతుల్యతకు ఆస్కారం లభిస్తుందని కేంద్రం నిర్ణయానికి వచ్చింది.
వివిధ రాష్ట్రాల్లోని కాంగ్రెస్ సర్కార్లు తీసుకొచ్చే సర్వేలు చాలా లోపభూయిష్టంగా ఉన్నాయని, దీని వల్ల సమాజ శ్రేయస్సు దెబ్బతినే అవకాశం ఉందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. అందుకే తదుపరి జనాభా లెక్కల్లో కుల సర్వేను కూడా చేర్చాలని కేబినెట్ తీసుకున్న నిర్ణయం చారిత్రకమని అశ్విని వైష్ణవ్ అన్నారు. ఏప్రిల్ 2020లోనే జనాభా లెక్కలు చేపట్టాల్సి ఉన్నప్పటికీ.. కొవిడ్ కారణంగా వాయిదా పడిన విషయం తెలిసింది. భారత్-పాకిస్థాన్ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ.. గత రెండు రోజులుగా దిల్లీలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం ప్రధాని మోదీ నేతృత్వంలో రక్షణమంత్రి, జాతీయ భద్రతా సలహాదారు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, త్రివిధ దళాధిపతులతో సమావేశం జరిగింది. ఇదే క్రమంలో బుధవారం భద్రతపై కేబినెట్ కమిటీ, అనంతరం రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ జరిగింది.