బీసీలను కేవలం రాజకీయంగా ప్రలోభపెట్టేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం కుల గణనను తెరపైకి తీసుకొచ్చిందని బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్ విమర్శించారు. నెహ్రూ నుంచి మొదలు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీల విషయంలో అనే తప్పదాలు చేశారని మండిపడ్డారు. నెహ్రూ విధానాలతో ఆర్థిక, సామాజిక, విద్య, ఉద్యోగ, రాజకీయంగా వెనుకబడిన వర్గాల పట్ల తీవ్ర అన్యాయం జరిగిందని తెలిపారు. వెనుకబడిన తరగతులకు సంబంధించి ఆర్టికల్ 340 అనుగుణంగా 29 జనవరి 1953లో కాకా కాలేల్కర్ నేతృత్వంలో తొలి బీసీ కమిషన్ ఏర్పడిందన్నారు. అయితే కాకా కాలేల్కర్ కమిషన్ ప్రతిపాదనలను నెహ్రూ ప్రభుత్వం వ్యతిరేకించి, వెనుబాటుతనం అనే పదాన్నే తిరస్కరించిందని ధ్వజమెత్తారు. దేశంలో దశాబ్ధాలుగా పాలించిన కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ కుటుంబంతోనే వెనుకబడిన తరగతుల వారికి తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన చెందారు.
వెనుబడిన తరగతులు, బీసీలకు తీవ్ర అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలని డాక్టర్ కె.లక్ష్మణ్ డిమాండ్ చేశారు. బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాకా కాలేల్కర్ కమిషన్ ప్రతిపాదనలను నెహ్రూ వ్యతిరేకత కనబర్చారని, వెనుబాటుతనం అనే పదాన్ని కూడా ఒప్పుకోలేదని విమర్శించారు. కుల ఆధారిత రిజర్వేషన్ల కంటే విద్య ద్వారానే సాధికారత సాధించవొచ్చని నెహ్రూ ప్రకటించారని గుర్తుచేశారు. 1955లో నెహ్రూ ప్రభుత్వం వెనుకబడిన తరగతుల కోటాను సిఫారసు చేసిన కాకా కాలేల్కర్ నివేదికను తిరస్కరించిందన్నారు. 1961 జూన్ 27న దేశంలోని ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు. కులం పేరుతో రిజర్వేషన్లు ఉండటానికి వీల్లేదంటూ ఎస్సీ, ఎస్టీలు, బీసీలను అవమానపర్చారని తెలిపారు. కాకా కలేల్కర్ కమిషన్ పై పార్లమెంటులో చర్చకు తీసుకు రాకుండానే బుట్టదాఖలు చేశారన్నారు. .ఇందిరా గాంధీ ప్రభుత్వంలోనూ బీసీ కమిషన్ ను ఏర్పాటు చేయలేదు. వీపీ సింగ్ నేతృత్వంలో ఓబిసీలకు రిజర్వేషన్‌పై మండల్ కమిషన్ సిఫార్సులు చేసిందన్నారు. రాజీవ్ గాంధీ కూడా పార్లమెంటులో మండల్ కమిషన్ సిఫార్సులను విభేదించి, వ్యతిరేకించారన్నారు.
బీసీల పట్ల రేవంత్ ప్రభుత్వం కపట ప్రేమ
బీసీల పట్ల రేవంత్ ప్రభుత్వం కపట ప్రేమ ఒలకబోస్తున్నదని డాక్టర్ లక్ష్మణ్ విమర్శించారు. పార్లమెంట్‌కు అంబేడ్కర్ రెండుసార్లు పోటీచేస్తే కాంగ్రెస్ ఆయన్ను ఓడించిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వొచ్చాక భారత్ లో రిజర్వేషన్లను ఎత్తివేస్తామంటూ రాహుల్ గాంధీ అమెరికాలో ప్రకటించారని గుర్తుచేశారు. . కాంగ్రెస్.. దళిత నేత సీతారాం కేసరి పార్టీ అధ్యక్షుడిగా పదవీకాలం పూర్తి చేయడానికి అనుమతిం చలేదని, సర్వేల పేరుతో, కులగణన పేరుతో వందల కోట్లు ఖర్చుచేసి, చివరికి పబ్లిష్ చేయకపోవడమే కాంగ్రెస్ మోడల్ లా అనేది రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి తెలపాలి. బిజెపి-జేడీయూ ప్రభుత్వంలోనే బిహార్ లో కులగణన చేపట్టింది. 2022 సంవత్సరంలో సర్వే రిపోర్టును, ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాల వివరాలను బహిర్గతం చేశారని తెలిపారు. బిహార్‌లో వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు రిజర్వేషన్ కోటాను పెంచేలా నిర్ణయం తీసుకున్నారు. రాహుల్ గాంధీ కుటుంబంతోనే వెనుకబడిన తరగతుల వారికి తీవ్ర అన్యాయం జరిగిందని డాక్టర్ లక్ష్మణ్ విమర్శించారు.