రామోజీ రావు మృతిపై హీరో జూనియర్ ఎన్టీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన లాంటి దార్శనీకులు నూటికో కోటికో ఒక్కేరే ఉంటారు అంటూ వ్యాఖ్యానించారు. “శ్రీ రామోజీ రావు గారు లాంటి దార్శనీకులు నూటికో కోటికో ఒకరు. మీడియా సామ్రాజ్యాధినేత, భారతీయ సినిమా దిగ్గజం అయినటువంటి ఆయన లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనటువంటిది. ఆయన మన మధ్యన ఇక లేరు అనే వార్త చాలా బాధాకరం. ‘నిన్ను చూడాలని’ చిత్రంతో నన్ను తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేసినప్పటి జ్ఞాపకాలు ఎప్పటికీ మరువలేను. ఆ మహనీయుడి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అని జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.
అక్షరానికి సామాజిక బాధ్యత ఉందని నిరూపించారు: పవన్ కల్యాణ్
అక్షరయోధుడు రామోజీరావు తుదిశ్వాస విడిచారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను , ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా, ఆయన స్థాపించిన ఈనాడు పత్రిక భారతీయ పత్రికా రంగంలో పెను సంచలనమే. అక్షరానికి సామాజిక బాధ్యత ఉందని నిరూపించారు. ప్రజా పక్షం వహిస్తూ వాస్తవాలను వెల్లడిస్తూ, జన చైతన్యాన్ని కలిగించారు. ప్రజా ఉద్యమాలకు వెన్నుదన్నుగా నిలిచారు. రామోజీ ఫిల్మ్ సిటీ నిర్మాణంతో భారతీయ చిత్ర పరిశ్రమకు హైదరాబాద్ను వేదికగా చేశారు. ఆయన కుటుంబానికి నా తరఫున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని అన్నారు : పవన్ కల్యాణ్
చలనచిత్ర పరిశ్రమకు చేసిన సేవలు సువర్ణాక్షరాలతో లిఖించబడతాయి: కల్యాణ్‌రామ్
“రామోజీరావు భారతీయ మీడియా, చలనచిత్ర పరిశ్రమకు చేసిన సేవలు చరిత్రపుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించబడతాయి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా. ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి”.
రామోజీగారికి భారతరత్న ఇవ్వడమే ఘనమైన నివాళి: రాజమౌళి
“తన కృషితో లక్షలాది మందికి ఉపాధి కల్పించిన గొప్ప వ్యక్తి రామోజీరావు. 50 సంవత్సరాల నుంచి ఎంతోమందికి జీవనోపాధి కల్పిస్తున్నారు. ‘భారతరత్న’తో ఆయనను సత్కరించడమే మనమిచ్చే ఘనమైన నివాళి”.
నా గాడ్‌ఫాదర్ మృతి పరిశ్రమకు తీరని నష్టం: నరేశ్
“రామోజీ రావు గారు మరణించారనే హృదయ విదారక వార్త విని బాధపడ్డా. ఆయన నా సినీ కెరీర్‌కు పునాది వేశారు. నా గాడ్ ఫాదర్, నా స్ఫూర్తి. తెలుగు చిత్రపరిశ్రమను గొప్ప స్థాయికి తీసుకెళ్లిన మహోన్నత వ్యక్తి. ఆయన మృతి పరిశ్రమకు తీరని నష్టం. ఆయన కుటుంబానికి సానుభూతి తెలియచేస్తున్నా”
రామోజీరావు నిజమైన దార్శనికుడు: వెంకటేశ్
రామోజీరావు గారు నిజమైన దార్శనికుడు, భారతీయ మీడియాలో ఆయన విప్లవాత్మక కృషి చేశారు. జర్నలిజం, సినీ రంగంలో ఆయన చేసిన కృషి ఎంతోమందికి స్ఫూర్తి. ఆయన ఆత్మకు శాంతి కలగాలి – సినీ నటుడు వెంకటేశ్
తెలుగు పత్రికా రంగంలో రామోజీ రావు మకుటం లేని మహారాజు: నందమూరి బాలకృష్ణ
“తెలుగు పత్రికా రంగంలో రామోజీ రావు మకుటం లేని మహారాజు. తెలుగులోనే కాదు దేశ పత్రికా రంగంలో ఓ కొత్త ఒరవడిని సృష్టించారు. భావితరాల పత్రికా ప్రతినిధులకు మార్గదర్శిగా నిలిచారు. చిత్రసీమలో అదే తీరున సాగి ఉషోదయ కిరణాలను ప్రసరింపజేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద స్టూడియోగా రామోజీ ఫిలిం సిటీని తెలుగు నేలపై నెలకొల్పారు. మా తండ్రి నందమూరి తారక రామారావుతో ఆయన అనుబంధం ప్రత్యేకమైంది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను”.
రామోజీ మరణం తెలుగు జాతికి తీరని లోటు: సినీ నిర్మాత అశ్వనీదత్
“ఏ రంగంలో అయినా, ఎలాంటి నేపథ్యం లేకపోయినా కష్టపడితే చాలు విజయం దక్కుతుంది అనే స్ఫూర్తిని నాలాంటి ఎంతోమందికి పంచిపెట్టిన రామోజీరావు జన్మ ధన్యం. తెలుగు కీర్తిని, స్ఫూర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన ఆయన మరణం ఈ దేశానికి, ముఖ్యంగా తెలుగు జాతికి తీరని లోటు”.
రామోజీ నుంచి జీవిత పాఠాన్ని నేర్చుకున్నా: మంచు విష్ణు
రామోజీరావు గారి మృతి చాలా బాధాకరం. ఆయన్ని కలిసిన ప్రతిసారి ఎంతో లోతైన జీవిత పాఠాన్ని నేర్చుకున్నాను. ఆయన తెలివి, ధైర్యం, నాపై చెరగని ముద్ర వేశాయి. సినీ పరిశ్రమకు కూడా ఆయన ఎప్పుడూ అండగా నిలిచారు. జర్నలిజం, వినోద రంగంలో అసమానమైన ప్రమాణాలను నెలకొల్పి గొప్ప సామ్రాజ్యాన్ని నిర్మించారు. ఎంతో మందికి స్ఫూర్తి. ఆయన కుటుంబానికి నా హృదయపూర్వక సానుభూతి తెలియచేస్తున్నా.
నా గురువు, శ్రేయోభిలాషి రామోజీరావు అస్తమయం నన్ను బాధించింది : రజినీకాంత్
“జర్నలిజం, సినీ రంగాల్లో రామోజీరావు చరిత్ర సృష్టించారు.రాజకీయాల్లో రామోజీరావు కింగ్ మేకర్.రామోజీరావు నా జీవితంలో గొప్ప ప్రేరణ, మార్గదర్శకులు నా గురువు, శ్రేయోభిలాషి రామోజీరావు అస్తమయం నన్ను బాధించింది”
ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు పార్థివదేహానికి టాలీవుడ్ మెగాస్టార్, పద్మవిభూషణ్ చిరంజీవి నివాళులర్పించారు.
మీడియా సంస్థల అధినేత భౌతికకాయం వద్ద పుష్ఫగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. వారిని ఓదార్చి ధైర్యం చెప్పారు. అనంతరం చిరంజీవి మీడియాతో మాట్లాడారు.
రామోజీరావు మరణం తెలుగు రాష్ట్రాలకు తీరని లోటన్నారు. ఆయన మరణంతో తెలుగు జాతి ఓ పెద్దదిక్కును కోల్పోయిందన్నారు. రామోజీరావు కలలను, ఆశయాలను కుటుంబ సభ్యులు ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. ప్రజారాజ్యం స్థాపించే సమయంలో ఆయన సలహాలు, సూచనల కోసం కలిసేవాడినని గుర్తు చేసుకున్నారు.