కొంతకాలంగా ఫిర్యాదుల స్వీకరణ, గోడలు పడగొట్టడం, చెరువులను పరిశీలించే పనిలో ఉన్న హైడ్రా.. చాలా గ్యాప్ తర్వాత కూల్చివేతలకు దిగింది. శేరిలింగంపల్లి మండలంలో అక్రమ నిర్మాణాల పేరుతో కూల్చివేతలు చేపట్టింది. గచ్చిబౌలి పోలీసు స్టేషన్‌కు ఎదురుగా ఉన్న సంధ్యా కన్వెన్షన్ మినీ హాల్, ఫుడ్‌కోర్ట్‌లను హైడ్రా కూల్చివేసింది. ఇతర ఆక్రమణల కూల్చివేతలు కొనసాగిస్తుంది. గచ్చిబౌలి సర్వే నెంబర్ 124, 127లలోని సుమారు 20 ఎకరాలలో గతంలో ఫర్టిలైజర్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లేఅవుట్ వేసింది. ఈ లే అవుట్‌లో 162 మంది ప్లాట్స్ కొనుగోలు చేశారు. సంధ్యా కన్‌స్ట్రక్షన్ అక్రమంగా సొసైటీ లేఅవుట్‌లో అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారని ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయిస్ కోఆపరేటివ్ సొసైటీలో ప్లాట్లు కొనుగోలు చేసినవారు ఇటీవల హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేశారు. ఎఫ్‌సీఐ ఎంప్లాయిస్ కోఆపరేటివ్ సొసైటీలో గతంలో వేసిన లేఅవుట్ ను నామరూపాలు లేకుండా చేసిన సంధ్యా కన్‌స్ట్రక్షన్ రోడ్స్, పార్క్స్ ను కలుపుతూ పలు ఆక్రమణలు చేపట్టిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
దీనిపై స్పందించిన హైడ్రా విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా అనుమతులు లేకుండా ఆ నిర్మాణాలు చేసినట్లు గుర్తించింది. దీంతో మంగళవారం ఉదయం నుండి అనుమతులు లేని కట్టడాలను కూల్చివేత పనులను చేపట్టింది. సంధ్య కన్వెన్షన్ మినీ హాల్ తో పాటు నిర్మించిన వంటగదులు, రెస్ట్ రూమ్ లను కూడా తొలగించారు. లేఅవుట్ ను ఆక్రమించి నిర్మించిన రేకుల ఫెన్సింగ్, జీ ప్లస్ 2గా నిర్మించిన 3 ఐరన్ షడ్ లను సైతం తొలగించారు. ఇంకా పలు నిర్మాణాలను కూల్చివేయనున్నట్టు హైడ్రా అధికారులు తెలిపారు. మరోవైపు హైడ్రా కేవలం కూల్చివేతలకు మాత్రమే పరిమితం కాకుండా నగరంలో ఆక్రమణలకు పాల్పడే వారిని కటకటాల్లో కి పంపేందుకు సిద్దమైంది. దానికోసం ప్రత్యేక పోలీస్ స్టేషన్‌ను కూడా ఏర్పాటు చేశారు. హైదరాబాద్ బుద్ధభవన్ సమీపంలోని రెండతస్తుల్లో హైడ్రా పోలీస్ స్టేషన్ ను నిర్మిస్తున్నారు. మే 8న సీఎం రేవంత్ రెడ్డి ఈ పోలీస్ స్టేషన్‌ను ప్రారంభిస్తారు.