జేఎన్‌టీయూకు అడ్డంగా దొరికిపోయిన ఇంజనీరింగ్ కాలేజీలు
తెలంగాణలో అటానమస్ కాలేజీల ఘరనా మోసం భయటపడింది. ఆ కాలేజీల్లో చదువుతున్న వందలాది మంది ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులకు వచ్చిన మార్కులు చూసి జేఎన్టీయూ ఆశ్చర్యపోయింది. అవి ఆ విద్యార్థుల ప్రతిభ ఆధారంగా వచ్చినవి కాదని భావించింది. అందుకే ఆ జవాబు పత్రాలను తిరిగి మూల్యాంకనం చేయాలని కరాఖండిగా చెప్పింది. అందుకే అటానమస్ కాలేజీలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి తప్పుడు పనులకు పాల్పడితే అటానమస్ హోదాను రద్దు చేస్తామని హెచ్చరించింది. దాదాపు 40 కాలేజీల్లో వచ్చిన గత మార్కులతో పోల్చితే.. ఈసారి అక్కడి విద్యార్థుల మార్కులు భారీగా పెరిగాయని గుర్తించింది.
ఇబ్రహీంపట్నంలోని ఓ కాలేజీలో
2022-23 బ్యాచ్ లో ఈ సమస్య తలెత్తిందని భావిస్తోంది. ఎందుకంటే వారికి 40 శాతం ఇంటర్నల్, 60 శాతం మార్కులు ఎక్స్ టర్నల్ కు ఉండడం వల్ల మార్కులను ఇలా పెంచి చూపించారని అర్థమవుతోంది. ఇబ్రహీంపట్నంలోని ఓ కాలేజ్ అయితే.. మార్కులు సరిగా రాని విద్యార్థులకు ఎక్స్ ట్రా మార్కులు వేసినట్టు గుర్తించింది. ఘట్ కేసర్ లో ఉన్న ఓ కాలేజ్ అయితే పరీక్షలు ముందు క్వశ్చన్ బ్యాంక్ రిలీజ్ చేసింది. అందులో ఉన్న ప్రశ్నలే దాదాపుగా పరీక్షల్లో వచ్చాయి. అఫిలియేటెడ్ కాలేజీల్లో పాస్ పర్సంటేజ్ 25 శాతముంటే.. అటామనస్ కాలేజీల్లో 70 శాతం ఉండడం కూడా అనుమానాలకు దారితీసింది. అందుకే అటానమస్ కాలేజీల హోదాను రద్దు చేయడానికి ఆలోచిస్తోంది. దీనికి సంబంధించి అన్న అధికారాలు తమకు ఉన్నాయని జేఎన్టీయూ స్పష్టం చేసింది. కళాశాలల స్వయంప్రతిపత్తి హోదాను రద్దు చేసే అన్ని అధికారాలు తమకు ఉన్నాయని జేఎన్‌టీయూ వైస్-ఛాన్సలర్ కిషన్ కుమార్ రెడ్డి అన్నారు. భవిష్యత్తులో వారు తమ తీరు మార్చుకోకపోతే మళ్ళీ జేఎన్‌టీయూ అనుబంధ కళాశాలలుగా మార్చే అవకాశం తమకు ఉందన్నారు.స్వయంప్రతిపత్తి కళాశాలలు తమ సొంత పాఠ్యాంశాలను నిర్ణయించుకునే, పరీక్షలు నిర్వహించే స్వేచ్ఛను కలిగి ఉంటాయి. ట్యూషన్ ఫీజులు తప్ప, వారి స్వంత ఫీజులు వసూలు సవరించుకునే స్వేచ్ఛ వారికి ఉంటుంది. అవి మళ్ళీ అనుబంధ కళాశాలలుగా మారితే అన్ని స్వేచ్ఛలు పోతాయి.
తెలంగాణలో ప్రస్తుతం 95 స్వయంప్రతిపత్తి ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి, 88 జేఎన్‌టీయూ కింద, మరో ఏడు ఉస్మానియా విశ్వవిద్యాలయం కింద ఉన్నాయి. రాష్ట్రంలో జేఎన్‌టీయూ కింద నాలుగు స్వయంప్రతిపత్తి ఫార్మసీ కళాశాలలు కూడా ఉన్నాయి. స్వయంప్రతిపత్తి ఇంజనీరింగ్ కళాశాలలు ఎక్కువ మార్కులు చూపించి విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేసే ప్రయత్నంలోనే భాగంగా అటానమస్ కాలేజీలు ఇలాంటి ట్రిక్స్ ప్లాన్ చేస్తున్నట్లుగా అర్థం అవుతోంది.