నగరంలోని గుల్జార్ హౌస్‌లో జరిగిన అగ్నిప్రమాదం ఘటనపై ఫైర్ అధికారులు, నాగపూర్ కు చెందిన ఫోరెన్సిక్ బృందం ప్రాథమిక నివేదిక ఇచ్చారు. ఇన్వర్టర్‌లో ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని తేల్చారు. ఇన్వర్టర్‌లో ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే గుల్జార్ హౌస్‌లో మంటలు చెలరేగినట్లు అధికారులు నిర్ధారించారు. అగ్ని ప్రమాదం జరిగిన టైంలో ఇంట్లో రెగ్యులర్ కరెంట్ ఆఫ్‌లో ఉందని.. ఇన్వర్టర్ ద్వారా సెకండరీ పవర్ సప్లై మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. ఫైర్ ఎక్స్‌పర్ట్‌లు ఘటనా స్థలాన్ని పరిశీలించి పూర్తి నివేదికను ఫైర్ డీజీకి అందించారు. అగ్ని ప్రమాదం జరిగాక పొగ ఎక్కువ రావడంతో కుటుంబ సభ్యులు బయటకి రాకుండా రూమ్‌లోనే ఉండి తలుపులు వేసుకున్నారు. దీంతో పొగను పీల్చి ఊపిరి ఆడకుండా పడిపోయారు. ఈ ప్రమాదంలో ఊపిరి ఆడక పోవడం వల్లే వారంతా చనిపోయినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. త్వరలో ఘటన స్థలానికి ఓఎన్‌జీసీ కంపెనీ బృందాలు వెళ్లనున్నాయి.
హైదరాబాద్ నగరంలోని చార్మినార్‌కు అత్యంత సమీపంలో గుల్జార్ హౌస్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 17మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. మృతుల్లో 8మంది చిన్నారులు కావడంతో ఈ ఘటన మరింత కలచివేసింది. ప్రధాని మోదీ సైతం తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. ఇంతటి ఘోర ప్రమాదంపై వాస్తవాలను తేల్చేందుకు ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. మరోవైపు జాతీయ మానవహక్కుల కమిషన్ సైతం స్పందించి, విచారణకు ఆదేశించింది. అగ్నిమాపక,విద్యుత్ శాఖల నిపుణులతో కూడిన బృందాలతో ఫోరెన్సిక్ టీమ్ ప్రమాద ప్రాంతాన్ని ఆధినంలోకి తీసుకుని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. మూడు రోజులపాటు అగ్నిప్రమాదం జరిగిన గుల్జార్ హౌస్‌లో ఆధారాలను సేకరించి, వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపడంతోపాటు, క్షేత్ర స్థాయిలో ప్రమాదానికి కారణాలపై అన్వేషించింది. ఘటనా స్దలంలో లభించిన ఆధారాలను పరిశీలించిన తరువాత ప్రమాదానికి షార్ట్ సర్క్యూటేనని తేల్చినట్లుగా సమాచారం. నాగపూర్ నుంచి వచ్చిన ఫైర్ ఎక్స్‌పర్ట్ కమిటీ ఫైర్ డీజీకి ఇచ్చిన నివేదికలో పలు కీలక అంశాలను ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది. గుల్జార్ హౌస్‌లో అంతలా పొగలు వ్యాపించడానికి, భారీగా మంటలు వ్యాపించడానికి ప్రధాన కారణం గుల్జార్ హౌస్ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న కృష్ణా పెరల్స్ షాపులోని ఇన్వర్టర్ షార్ట్ సర్య్కూటే కారణమని తెల్చినట్లుగా సమాచారం. ఇన్వర్టర్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి, ఆ మంటలు వేగంగాపైన ఉన్న గదులలోకి వ్యాపించడంతోపాటు, అస్థవ్యస్తంగా ఉన్న వైర్లు కాలిపోవడంతో విపరీతంగా పొగ చుట్టుముట్టినట్లుగా గుర్తించారు. మంటల తీవ్రత కంటే దట్టంగా వ్యాపించిన పొగను పీల్చడం వల్లనే ఊపిరాడక 17మంది ప్రాణాలు కోల్పోయినట్లుగా నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదంపై మొదటి నుంచి అనేక అనుమానాలు, ఎన్నో ప్రశ్నలు, పొంతనలేని వ్యాఖ్యలతో, ఏం జరిగుంటుందోననే ఉత్కంఠత సర్వత్రా నెలకొంది.ఈ ఘటనపై కేసునమోదు చేసిన ఫైర్ చార్మినార్ పోలీసులు , ప్రమాదానికి కారణాలు తెలపాలంటూ ఫైర్, ఓఎన్ జీసీ, జీహెచ్ ఎంసీ, విద్యుత్, ఫోరెన్సిక్ , పలు గ్యాస్ కంపెనీలకు లేఖలు రాశారు. ఇదిలా ఉంటే చార్మినార్ విద్యుత్ శాఖ అధికారులు మాత్రం ఫిర్యాదుకు ముందు ఒకలా, తరువాత మరోలా విభిన్న వ్యాఖ్యలు చేశారు. మొదట షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిన ప్రమాదం కాదని విద్యుత్ శాఖ చెప్పడంతో మరింత ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే కొందరు విద్యుత్ కేబుల్ బాక్స్ నుంచి మంటలు వ్యాపించాయని, మరికొందరు కింద నుంచి మంటలు పైకి ఎగిసిపడ్డాయని, ఏసీ షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలంటుకున్నాయని, మోతాదుకు మించి అక్రమ విద్యుత్ కనెక్షన్లు, పరిధి దాటిన విద్యుత్ వాడకం వల్ల ఇంత ప్రమాదం జరిగిందనే వాదనలు.ఇలా గత మూడు రోజులుగా అనేక సందేహాలు ,అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా నాగపూర్ ఎక్స్ పర్ట్ కమిటీ ఇచ్చిన నివేదక ఓ క్లారిటీ తీసుకొచ్చినట్లయ్యింది.
తాజాగా నాగపూర్ నిపుణుల కమిటీ చెప్పినట్లు కృష్ణా పెరల్స్, మోదీ పెరల్స్ ఈ రెండు షాపులూ, చార్మినార్ కు వెళ్లే ప్రధాన రహదారిని ఆనుకుని ఉంటాయి. ఈ షాపులకు కూతవేటు దూరంలోనే చార్ మినార్ ఉంటుంది. ఈ రెండు షాపులపైన ఉన్న గదులలో మృతుల కుటుంబం నివాసముంటోంది. ఎవరైనా ఇంటిలోపలికి వెళ్లాలన్నా, బయటకు రావాలన్నా కృష్ణాపెరల్స్ షాపును ఆనుకుని ఉన్న షెట్టర్ మాత్రమే ఏకైక మార్గం. మంటలు కృష్ణా పెరల్స్ లోని ఇన్వర్టర్ నుంచి వ్యాపించడంతో పైన చిక్కుకున్నవారు బయటకు రావడానికి మరో మార్గం లేకపోవడం, ఉన్న షెట్టర్ దారిలో మంటలు వ్యాపించడంతో ప్రమాదం తీవ్రత, మృతుల సంఖ్య పెరిగినట్లుగా క్లారిటీ వస్తోంది.