-
తెలంగాణలో గ్రూప్-2 పరీక్ష వాయిదా పడే ఛాన్స్?
-
ఒకట్రెండు రోజుల్లో ప్రభుత్వం నుంచి ప్రకటన
తెలంగాణలో డీఎస్సీ, గ్రూప్ 2 పరీక్షల వివాదం రోజు రోజుకు పెద్దదవుతోంది. ఐతే వివాదాల మధ్యే డీఎస్సీ పరీక్షలు జులై 18 నుంచి ప్రారంభమయ్యాయి. ఐనప్పటికీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు తగిన సమయం ఇవ్వనందుకు పరీక్షను రద్దు చేయాలని కొందరు నిరుద్యోగులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ప్రస్తుతం ఈ కేసుపై కోర్టులో విచారణ జరుగుతోంది. ఇక డీఎస్సీ పరీక్షకు, గ్రూప్ 2 పరీక్షకు మధ్య కేవలం వారం రోజుల వ్యవధి మాత్రమే ఉండటంతో అభ్యర్ధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే అభ్యర్థుల కోరిక మేరకు గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయాలనే నిర్ణయానికి తెలంగాణ ప్రభుత్వం వచ్చినట్లు తెలుస్తోంది.
గురువారం హైదరాబాద్ లో నిరుద్యోగులతో ఎంపీ చామల కిరణ్
కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌లు సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా నిరుద్యోగులు తమ గోడును వెల్లబోసుకున్నారు. డీఎస్సీ, గ్రూప్ 2 పరీక్షలకు మధ్య చాలా తక్కువ వ్యవధి ఉందని, అందుకని గ్రూప్ 2 పరీక్షను కొంత కాలం వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లిన ప్రజా ప్రతినిధులు గ్రూప్ 2 వాయిదా వేసేలా కృషి చేస్తున్నారు. ప్రభుత్వం సైతం గ్రూప్ 2 పరీక్షను నెల రోజుల పాటు వాయిదా చేసేలా చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. నేడో రేపో దీనిపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
టీజీపీఎస్సీ మొత్తం 18 విభాగాల్లో 783 పోస్టులతో గత సంవత్సరం 2023లో గ్రూప్ 2 ఉద్యోగ ప్రకటన జారీచేసింది. ఇందుకు సంబంధించి 2023 జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16 వరకు దరఖాస్తులు స్వీకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5,51,943 మంది అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. ఐతే పలు కారణాలతో ఇప్పటికే మూడు సార్లు గ్రూప్ 2 వాయిదా పడింది. మళ్లీ ఇప్పుడు డీఎస్సీకి, గ్రూప్ 2 కు మధ్య వారం రోడులే సమయం ఉందని ఆవేధన చెందుతున్న అభ్యర్ధుల వినతి మేరకు మరోసారి వాయిదా పడే ఛాన్స్ కనిపిస్తోంది.