ఒకప్పుడు టాలీవుడ్‌ని ఏలిన భామ చందమామ. సీనియర్ హీరోల నుంచి దాదాపు మెగా కాంపౌండ్‌లో ఉన్న హీరోలందరితోనూ జతకట్టింది. మరి అలాంటి కాజల్ అగర్వాల్‌కి ప్రస్తుతం టైమ్ బాలేదా.. అంటే బాలేదనే చెప్పాలి. అమ్మడికి బ్యాడ్ లక్ ఆచార్య నుంచి మొదలైంది. ఆసినిమాలో మెగాస్టార్ చిరంజీవి కి జోడీగా కొరటాల శివ ఎంపిక చేసాడు. కాజల్ పోర్షన్ షూటింగ్ కూడా చేసారు. కట్ చేస్తే సినిమాలో ఎక్కడా కాజల్ కనిపించలేదు. సినిమా రిలీజ్ అయ్యే వరకూ కాజల్ లేదు అన్న సంగతి ఎవరికీ తెలియదు. `ఆచార్య` సినిమాకి హీరోయిన్ అవసరం లేదని కొరటాల షూటింగ్ పూర్తయిన తర్వాత భావించడంతో ఎడిటింగ్ లో తీసేసారు. అలాగని కాజల్ కి ఎలాంటి నష్టం చేయలేదు. తనకు చెల్లించాల్సిన పారితోషికం మొత్తం చెల్లించారు. ఆ తర్వాత నాగార్జున హీరోగా నటించిన ఘోస్ట్ లోనూ హీరోయిన్ గా ఎంపికైంది. కానీ చివరి నిమిషంలో ఆసినిమా నుంచి తప్పించారు. అటుపై నటసింహ బాలకృష్ణ హీరోగా నటించిన `భగవంత్ కేసరి`లో నటించింది. ఇందులో పేరుకే చందమామ తెరపై కనిపిస్తుంది. కథ అంతా నడిపించింది బాలయ్య, శ్రీలీల మాత్రమే. అలా సినిమాలో ఉన్నా? కాజల్‌తో ఎలాంటి ఉపయోగం లేదనిపించాడు అనీల్ రావిపూడి. ఇక మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ గా భావించిన `ఇండియన్ -2` విషయం లోనూ `ఆచార్య` తరహా సన్నివేశమే కనిపించింది. కమల్ హీసన్ కి జోడీగా శంకర్ ఎంపిక చేసారు. షూటింగ్ కూడా చేసారు. కానీ లెంగ్త్ ఎక్కువ అవ్వడం సహా కాజల్ పాత్ర అవసరం లేదని భావించిన శంకర్ చివరి నిమిషంలో తీసేసారు. `ఇండియన్ -3` లో ఉంటుందని అప్పట్లోనే వెల్లడించారు. ఇంక `ఇండియన్ 3` ఉంటుందా? ఊడుతుందా? అన్నది ఆ పెరుమాళ్లకే తెలియాలి. ప్రస్తుతం కాజల్ కన్నప్పలో పార్వతి పాత్ర పోషిస్తుంది. ఇప్పటికే ఆమె లుక్ కూడా రిలీజ్ చేసారు. మరి ఈసినిమాతోనైనా కాజల్ కి న్యాయం జరుగుతుందేమో చూడాలి. లేదంటే కాజల్ పరిస్థితి ఇక ఇంటికే అన్నట్లు సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. కాజల్ సీనియర్ హీరోల పక్కన జోడీగా చాలా బావుంటుంది. మరి ఎందుకని దర్శకులు ఆమెను పట్టించుకోవడం లేదో అర్దం కావడం లేదు.