వైసీపీ ప్రభుత్వం తప్పు చేస్తే విమర్శించకూడదా?
ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపితే జైలులో పెడుతున్నారు
టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు
గుంటూరు : 45 ఏళ్లుగా తాను ఒక్క తప్పు కూడా చేయలేదు.. ఏ తప్పు చేయకున్నా తనను జైలులో పెట్టి క్షోభకు గురిచేశారని టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం తప్పు చేస్తే విమర్శించకూడదా?. ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపితే జైలులో పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించి అన్నదాతలకు భరోసా ఇవ్వడానికి టీడీపీ అధినేత చంద్రబాబు గుంటూరు, బాపట్ల, పాత ప్రకాశం జిల్లాల్లో శుక్ర, శనివారాలు పర్యటించనున్నారు. ఇందులో భాగంగా చంద్రబాబు శుక్రవారం గుంటూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిచాంగ్ తుపానుతో రైతులకు తీవ్ర నష్టం వచ్చిందని, చేతికి పంట వచ్చే సమయంలో తుపాను వచ్చి నష్టం మిగిల్చిందని అన్నారు. ప్రభుత్వం ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టలేదని చంద్రబాబు విమర్శించారు. ముందు జాగ్రత్త చర్యలు లేకనే రైతులకు తీవ్రంగా నష్టం జరిగిందన్నారు. డ్రైనేజీల్లో పూడిక తీయకపోవడంతోనే పొలాల్లోకి మురికి నీరు చేరిందని, ప్రభుత్వ అధికారులు ఎవరూ ఇంకా రాలేదని దుయ్యబట్టారు. తుపానుతో నష్టపోయిన ప్రాంతాల్లో కాకుండా సీఎం ఎక్కడో పర్యటిస్తున్నారని విమర్శించారు. ఇప్పటివరకూ ఒక్క రూపాయి కూడా పరిహారం అందలేదని, తుపాను వల్ల రైతులకు ఎకరాకు సుమారు రూ.50 వేలు నష్టపోయారని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ క్రమంలో కొంతమంది ‘జగన్ పోవాలి.. బాబు రావాలి’ అంటూ నినాదాలు చేశారు.