ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ లో చెరువులను ఆక్రమించిన కట్టిన కట్టడాలను కూల్చేస్తున్న హైడ్రా తరహాలో ఏపీలోను ఓ ప్రత్యేక వ్యవస్థను తీసుకువస్తామని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ లో రాబోయే వర్షాలు, వరదలపై కలెక్టర్లతో సమీక్ష నిర్వహించిన సందర్బంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. బుడమేరు వాగు పొంగడానికి ఆక్రమణలే ప్రధాన కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే ఏపీ లోనూ హైడ్రా తరహా చట్టం తీసుకొచ్చి బుడమేరు ఆక్రమణలు తొలగిస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. కొంత మంది ఆక్రమణల కారణంగా లక్షల మంది ఇబ్బంది పడుతుంటే చూస్తూ ఊరుకోమని ముఖ్యమంత్రి హెచ్చరించారు.
గ్రేటర్ హైదరాబాద్ లో చెరువులను ఆక్రమించిన అక్రమార్కుల గుండెల్లో వణుకు పుట్టిస్తోంది హైడ్రా. కేవలం హైదరాబాద్ లోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. హైడ్రా లాంటి చట్టం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని మిగతా జిల్లాల ప్రజలు డిమాండ్ చేస్తుండగా, ఆంధ్రప్రదేశ్ ప్రజలు సైతం హైడ్రాను స్వాగతిస్తున్నారు. హైడ్రా పై పార్టీలకు అతీతంగా ఏపీ రాజకీయ నేతలు కూడా సానుకూలంగానే స్పందిస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు హైడ్రా తరహా చట్టం తీసుకొస్తామని ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.