ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు భీబత్సం సృష్టించాయి. ఎడతెరపిలేని వానలు ఏపీని చిగురుటాకులా వణికించాయి. మరీ ముఖ్యంగా విజయవాడను వరదలు ముంచెత్తాయి. గత వారం రోజులుగా పోటెత్తిన వరదల నేపధ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు క్షేత్రస్థాయిలో ఉంటూ స్వయంగా సహాయక కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో బుడమేరు వరద తీవ్రతను చూసి చంద్రబాబు చలించిపోయారు. వరద బాధితులు, అక్కడి రైతుల కష్టాల్ని వింటున్నప్పుడు చంద్రబాబు కళ్లు చెమ్మగిల్లాయి. విజయవాడతో పాటు గన్నవరం నియోజకవర్గం పరిధిలోని బుడమేరు ముంపు ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు సుడిగాలి పర్యటన చేశారు. భవిష్యత్తులో ఇంతకంటే ఎక్కువ వరద వచ్చినా విజయవాడలోకి నీరు రాకుండా ఆధునికీకరణ పనులు చేపడతామని ఈ సందర్బంగా చంద్రబాబు చెప్పారు. ఆక్రమణల తొలగింపునకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. వరద సహాయచర్యల్లో మరింత వేగం పెంచాలని, గండ్లను వేగంగా పూడ్చాలని అధికారుల్ని ఆదేశించారు. పనుల్లో అలసత్వం వహిస్తే సహించేది లేదని అధికారులను హెచ్చరించారు.
రైతులతో మాట్లాడి దెబ్బతిన్న పంటల వివరాల్ని తెలుసుకున్నారు చంద్రబాబు. విజయవాడ గ్రామీణ ప్రాంతమైన ఎనికేపాడు చేరుకున్నారు. అక్కడి నుంచి చిన్న మట్టిరోడ్డుపై ప్రయాణించి పొలాల్ని ముంచెత్తిన రైవస్ కాలువ, ఏలూరు కాలువల్ని పంటుపై దాటారు. అవతలి వైపునకు చేరుకొని బుడమేరు ముంపు ప్రాంతాన్ని, గండ్లను పరిశీలించారు. గండ్లు పూడ్చే పనులపై అధికారులతో పంటు మీదే సమీక్షించారు. బుడమేరు నీరు నగరంలోకి రాకుండా కృష్ణా, కొల్లేరులో కలిసేలా చూస్తామని, కొల్లేరు ఆక్రమణలపైనా దృష్టిసారిస్తామని చంద్రబాబు వెల్లడించారు. శివారు ప్రాంతాల్లో నిర్వహణ సక్రమంగా ఉంటే నగరంలో ఇంత పెద్దస్థాయిలో నీరు నిలిచేది కాదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఎప్పుడూ ఈ స్థాయిలో వరద రాలేదని, సర్వం కోల్పోయామని చంద్రబాబు ముందు పలువురు రైతులు, మహిళలు, వృద్ధులు కన్నీరుమున్నీరుగా విలపించారు. వారికి ధైర్యం చెప్పిన చంద్రబాబు అందరిని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.