- సీనియర్ ఐఏఎస్‌లకు అవకాశం..?
- అదనపు బాధ్యతలు ఉన్న వారికి ఐఏఎస్‌లకు పనిభారం తగ్గించనున్న ప్రభుత్వం
త్వరలోనే సిఎంఓలో మార్పులు, చేర్పులు చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. సీనియర్ ఐఏఎస్‌ల్లో కొందరికి పదోన్నతులు కల్పించి వారిని సిఎంఓలోకి తీసుకోవాలని సిఎం రేవంత్ భావిస్తున్నట్టుగా తెలిసింది. సిఎంఓలో కొందరు ఐఏఎస్‌ల పనితీరు బాగాలేకపోవడం వారిని తప్పించి ఆ స్థానంలో వేరే వారిని తీసుకోవాలని సిఎం నిర్ణయించినట్టుగా సమాచారం. కొందరు ఐఏస్‌లకు అదనపు బాధ్యతలు ఉండడం, సిఎంఓలో పనిచేస్తున్న అధికారుల్లో కొందరు నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తుండడంతో సిఎం రేవంత్‌రెడ్డి పలువురు ఐఏఎస్‌లను మార్చాలని, అందులో భాగంగా మరో నలుగురు సీనియర్ ఐఏఎస్‌లను సిఎంఓలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించినట్టుగా సమాచారం.
ప్రస్తుతం సిఎంఓలో పనిచేస్తున్న అధికారుల వివరాలు ఇలా….
ఇప్పటికే సిఎంఓలో వి.శేషాద్రి, సిఎం పేషీ, ప్రిన్సిపాల్ సెక్రటరీగా జిఏడి, లా అండ్ ఆర్డర్ డిపార్ట్‌మెంట్ పైళ్లకు సంబంధించి బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. దీంతోపాటు హోం డిపార్ట్‌మెంట్, ఆర్థిక శాఖ, ప్లానింగ్, లా, లెజిస్లేటివ్, ల్యాండ్ రెవెన్యూ, ఓవరాల్ ఇన్‌చార్జీ సిఎంఓగా ఆయన విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక, కె.మాణిక్‌రాజ్, సిఎం పేషీ, సెక్రటరీగా విధులు నిర్వహిస్తుండగా ఆయనకు విద్యుత్ శాఖ, ఇరిగేషన్, స్కూల్, హయ్యర్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ శాఖలతో పాటు, రెవెన్యూ (కమర్షియల్ ట్యాక్స్, ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ)తో పాటు మైన్స్ అండ్ జియాలజీ శాఖల బాధ్యతలను చూస్తున్నారు. డా.జి.చంద్రశేఖర్ రెడ్డి, సిఎం పేషీలో సెక్రటరీగా (ఐఎఫ్‌ఎస్)గా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. అందులో భాగంగా ఎన్వీరాన్‌మెంట్ పారెస్ట్ సైన్స్, టెక్నాలజీ డిపార్ట్‌మెంట్, అగ్రికల్చర్, పశుసంవర్ధక శాఖ, డైరీ డెవలప్‌మెంట్, ఫుడ్ అండ్ సివిల్ సప్లయ్ అండ్ కన్జూమర్ అఫైర్స్, రోడ్లు, భవనాల శాఖతో పాటు పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (ఆర్‌డబ్లూఎస్) బాధ్యతలను ఆయన చూసుకుంటున్నారు.
సిఎం అపాయింట్‌మెంట్, సిఎంఆర్‌ఎఫ్ బాధ్యతలు అజిత్‌రెడ్డికి
షానవాజ్ ఖాసీం, సెక్రటరీ, సిఎం పేషీ (ఐపిఎస్)కు బిసి వెల్పేర్, మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్, స్పోర్ట్ అండ్ యూత్ సర్వీస్, సిఎం సెక్యూరిటీ బాధ్యతలను నిర్వర్తిస్తుండగా, బి.అజిత్‌రెడ్డి, స్పెషల్ సెక్రటరీ, సిఎం పేషీ (ఐడిఈఎస్)కు మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ అర్భన్ డెవలప్‌మెంట్, ఇండస్ట్రీ, ఇన్‌వెస్ట్‌మెంట్, ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ డిపార్ట్‌మెంట్, లేబర్, ఎంప్లాయిమెంట్, ట్రైనింగ్ అండ్ ఫ్యాక్టరీ, ఐ అండ్ పిఆర్, సిఎం అపాయింట్‌మెంట్, సిఎంఆర్‌ఎఫ్ బాధ్యతలను చూసుకుంటున్నారు. ఎస్.సంగీత సత్యనారాయణకు, సిఎం పేషీ, జాయింట్ సెక్రటరీ (ఐఏఎస్)గా వైద్య ఆరోగ్య శాఖ, ఫ్యామిలీ వెల్పేర్ డిపార్ట్‌మెంట్, ఉమెన్ డెవలప్‌మెంట్, చైల్డ్, డిజేబుల్డ్ అండ్ సీనియర్ సిటీజన్, షెడ్యూల్డ్ తెగల అభివృద్ధి, ట్రైబుల్ వెల్పేర్ డిపార్ట్‌మెంట్, సిఎంఓ అడ్మినిస్ట్రేషన్ (ప్రిన్సిపాల్ సెక్రటరీ టు సిఎం)గా బాధ్యతలను చూసుకుంటున్నారు. ఇక వారితో పాటు నాన్ ఐఏఎస్ వేముల శ్రీనివాసులు, ఓఎస్డీ టు సిఎంగా దేవాదాయ శాఖ, టూరిజం అండ్ కల్చరల్, సిఎం పిటీషన్‌లు, ప్రజావాణి, సిఎంఆర్‌ఎఫ్ (స్పెషల్ సెక్రటరీ టు సిఎం), కంప్యూటరైజేషన్ ఆఫ్ సిఎంఓ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.
ఒక్కో ఐఏఎస్‌కు రెండు, మూడు శాఖల బాధ్యతలు
ప్రస్తుతం రాష్ట్రంలోని హెచ్‌ఓడిలకు సంబంధించి ఒక్కో ఐఏఎస్ రెండు, మూడు అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తుండడంతో పాలనపై ప్రభావం పడుతుందని సిఎం భావిస్తున్నట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఖాళీగా ఉన్న ఐఏఎస్‌లకు కొన్ని హెచ్‌ఓడిల బాధ్యతలను అప్పగించి సీనియర్ ఐఏఎస్‌లను సిఎంఓలకు తీసుకునే అవకాశం ఉందని అధికారికవర్గాలు పేర్కొంటున్నాయి. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భారీగా ఐఏఎస్‌ల బదిలీలు జరిగాయి. అయితే వారిలో ఒక్కొక్కరికి రెండు, మూడు శాఖల బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. ఈ అదనపు బాధ్యతల నేపథ్యంలో ఐఏఎస్‌లు ఒకరోజు ఒక శాఖ మరో రోజు ఇంకో శాఖపై దృష్టి సారిస్తుండడం విశేషం.
వికాస్‌రాజ్‌కు హౌజింగ్, జిఎడి, ఆర్ అండ్ బి
ప్రస్తుతం స్పెషల్‌సిఎస్‌గా కొనసాగుతున్న వికాస్‌రాజ్ కు హౌజింగ్, జిఎడి, ఆర్ అండ్ బి తో పాటు కేంద్ర ప్రభుత్వంతో కో ఆర్డినేట్ చేయడం, స్మార్ట్ గవర్నెన్స్ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. మరో ఉన్నతాధికారి సందీప్ కుమార్ సుల్తానియాకు విద్యుత్ శాఖ సెక్రటరీ, ట్రాన్స్‌కో, జెన్కో సిఎండి, పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ గా విధులు నిర్వర్తిస్తున్నారు. సీనియర్ ఐఏఎస్ రఘునందన్ రావు జిఎడి ముఖ్య కార్యదర్శి, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శిగా కొనసాగుతున్నారు. మరో అధికారి రిజ్వీ కమర్షియల్ ట్యాక్స్, ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా రెండు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. బుర్రా వెంకటేశం నాలుగు పదవులతో తీరిక లేకుండా గడుపుతున్నారు. విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, బిసి వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీగా, గవర్నర్ సెక్రటరీ, జేఎన్‌టియూ విసిగా ఉన్నారు. దానకిషోర్‌కు మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీతో పాటు మూసీ రివర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌గా అదనపు బాధ్యతలు చూసుకుంటున్నారు. రామకృష్ణారావు ఆర్థిక శాఖతో పాటు కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయమై సమన్వయం చేసుకునే బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. దీంతోపాటు రవాణా శాఖ కమిషనర్‌గా, జీహెచ్‌ఎంసి కమిషనర్‌గా ఇలాంబర్తి కొనసాగుతుండగా వీరితో పాటు మరి కొంతమంది ఐఏఎస్‌లు రెండు శాఖల బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.
పోస్టింగ్ ఇవ్వని వారికి…..
డిఓపిటి ఆదేశాల మేరకు ఎపి నుంచి తెలంగాణకు వచ్చిన ఐఏఎస్‌లు సృజన, శివ శంకర్లు, హరి కిరణ్‌లు అక్టోబర్‌లో సిఎస్‌ను కలిసి జాయినింగ్ రిపోర్ట్ అందజేశారు. ఈ ముగ్గురు ఐఏఎస్‌లకు ప్రభుత్వం పోస్టింగ్స్ ఇవ్వలేదు. వారిని వెయిటింగ్ లిస్టులో ఉంచింది. వీరితో పాటు తెలంగాణ కేడర్ 2013 బ్యాచ్‌కు చెందిన చిట్టెం లక్ష్మీ, శ్రీజనకు ప్రభుత్వం పోస్టింగ్స్ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే త్వరలోనే సిఎంఓలోకి సీనియర్‌లకు అవకాశం కల్పించి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న ఐఏఎస్‌లకు పనిబాధ్యతలను తప్పించి పోస్టింగ్ రాని వారికి బాధ్యతలను అప్పగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలిసింది.