Wednesday, December 25, 2024

పార్లమెంట్‌ ప్రాంగణంలో గందరగోళం

  •  పరస్పర ఆందోళనలకు దిగిన కాంగ్రెస్‌, బిజెపి పక్షాలు
  •  తోపులాటలో ఇద్దరు బిజెపి ఎంపిలకు గాయాలు
  •  చికిత్స కోసం హాస్పిటల్‌కి తరలింపు
  •  తమను కావాలనే అడ్డుకున్నారన్న  రాహుల్‌

పార్లమెంట్‌ ప్రాంగణంలో గురువారం గందరగోళ వాతావరణం నెలకొంది. పరస్పర తోపులాటల్లో ఇద్దరు బిజెపి ఎంపిలకు గాయాలయ్యాయి. వారిని హుటాహుటిని హాస్పిటల్‌కి తరలించారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌పై అమిత్‌ షా వ్యాఖ్యలకు నిరసనగా ప్రతిపక్ష ఎంపీలు ఆందోళన చేపట్టారు. అటు అంబేడ్కర్‌ను కాంగ్రెస్‌ అవమానించిందని ఆరోపిస్తూ అధికార పక్షం కూడా నిరసన చేపట్టారు. ఇరువర్గాల ఆందోళనలతో పార్లమెంట్‌ ప్రాంగణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇందులో బిజెపికి చెందిన ఇద్దరు ఎంపీలు తీవ్రంగా గాయపడ్డారు. కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ  తోయడం వల్లే వీరు గాయపడ్డారని బీజేపీ ఆరోపిస్తోంది. పార్లమెంట్‌లోని  ముఖ ద్వారం వద్ద ఉన్న గోడ ఎక్కి ప్రతిపక్ష ఇండియా కూటమి ఎంపీలు ప్లకార్డులు చూపిస్తూ ఆందోళన చేపట్టారు. అదే సమయంలో అక్కడకు ఎన్డీయే కూటమి ఎంపీలు వొచ్చారు. వీరిని లోపలికి వెళ్లకుండా విపక్ష నేతలు అడ్డుకున్నారని బీజేపీ ఆరోపించింది. ఈ క్రమంలోనే కొంత గందరగోళం చోటుచేసుకుని బీజేపీ ఎంపీలు ముకేశ్‌ రాజ్‌పుత్‌, ప్రతాప్‌ చంద్ర సారంగి కిందపడి గాయపడ్డారు.

వీరిని హుటాహుటిన హాస్పిటల్‌కి తరలించారు.ప్రస్తుతం ఎంపీ ముకేశ్‌ రాజ్‌పుత్‌కు ఐసీయూలో చికిత్స అందించారు. మరో ఎంపీ ప్రతాప్‌ చంద్ర సారంగి తలకు గాయమైంది. వీరి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు స్పందించారు. ‘ఇద్దరు ఎంపీల తలలకు దెబ్బలు తగిలాయి. సారంగి తలకు లోత్కెన గాయం కావడంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. తలకు కుట్లు వేశాం. ముకేశ్‌ రాజ్‌పుత్‌ స్పృహ కోల్పోయిన స్థితిలో వొచ్చారు. వైద్యం అందించాక ఆయన కోలుకుని స్పృహలోకి వొచ్చారు‘ అని వైద్యులు వెల్లడిరచారు. వీరిని పలువురు కేంద్ర మంత్రులు, టిడిపి ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తదితరులు హాస్పిటల్‌కు వెళ్లి పరామర్శించారు. ప్రధాని మోదీ ఫోన్‌ లో పరామర్శించారు.

వారి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. దవాఖానకు తీసుకెళ్లే సమయంలో ఎంపీ ప్రతాప్‌ సారంగి మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను మెట్ల వద్ద నిల్చొని ఉండగా.. రాహుల్‌ గాంధీ ఓ ఎంపీని నెట్టేశారు. ఆయన వొచ్చి నాపై పడటంతో నేను కిందపడ్డాను‘ అని ఆరోపించారు. ఈ ఘటన నేపథ్యంలో రాహుల్‌ గాంధీపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని బిజెపి యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కాంగ్రెస్‌ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ  స్పందించారు. ‘జరిగిందంతా మీ కెమెరాల్లో కనబడి ఉండొచ్చు.

నేను పార్లమెంట్‌ లోపలికి వెళ్తుండగా బిజెపి ఎంపీలు నన్ను అడ్డుకొనే ప్రయత్నం చేశారు. తోసేశారు. బెదిరించారు. మల్లికార్జున్‌ ఖర్గేను కూడా నెట్టేశారు. మాకు లోపలికి వెళ్లే హక్కు ఉంది. కానీ, వారు అడ్డుకుంటున్నారు. ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే.. రాజ్యాంగంపై వారు దాడి చేస్తున్నారు. అంబేడ్కర్‌ను అవమానించారు‘ అని రాహుల్‌ దుయ్యబట్టారు. బిజెపి ఎంపీలే తమను అడ్డుకున్నారని ఆరోపిస్తూ అందుకు సంబంధించిన వీడియోను కాంగెస్‌ ’ఎక్స్‌’లో షేర్‌ చేసింది.

ప్ర‌దాన వార్త‌లు

దురుద్దేశంతోనే తనపై కేసు పెట్టారన్న కేటీఆర్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com