ఈ మధ్య కాలంలో సెలబ్రెటీలు ఏది మాట్లాడినా అది ఒక పెద్ద సెన్సేషన్ అయిపోతుంది. అందుకే ఆచి తూచి మాట్లాడాలి అంటున్నారు. అందులోనూ మెగా కాంపౌండ్‌లో అయితే ఈ ధోరణి మరి కాస్త ఎక్కువగానే కనబడుతుంది. టాలీవుడ్ సీనియర్ నిర్మాత అల్లు అరవింద్ మీడియా ముందుకు వచ్చారు. ఓ ఈవెంట్ లో తాను రామ్ చరణ్ స్థాయి తగ్గించేలా మాట్లాడానని తనను ట్రోల్ చేస్తున్నారని తెలిపారు. రామ్ చరణ్ ను ఉద్దేశపూర్వకంగా తాను ఏమీ అనలేదని స్పష్టం చేశారు. దిల్ రాజు పరిస్థితిని వివరించే క్రమంలో తాను మాట్లాడిన మాటలు మరోలా అర్థం చేసుకున్నారని అల్లు అరవింద్ వివరణ ఇచ్చారు.
“రామ్ చరణ్ స్థాయిని తగ్గించేలా మాట్లాడానంటూ నన్ను ట్రోల్ చేస్తున్నారు… ఇది మీ అందరికీ తెలుసు. ఇదే అంశంపై ఇటీవల ఓ సీనియర్ జర్నలిస్టు ప్రశ్నిస్తే… ఇప్పుడు తగిన సమయం కాదు, తర్వాత మాట్లాడతాను అని చెప్పాను. ఇవాళ పబ్లిక్ కు నేను చెప్పాలనుకుంటుంది ఏమిటంటే… ఆ రోజు దిల్ రాజును వేదికపై ఆహ్వానిస్తూ… ఆయన వారం రోజులుగా ఇన్ కమ్ ట్యాక్సు వ్యవహారాలు, కష్టాలు, నష్టాలు అనుభవించారు అని పరిచయం చేయడానికి యథాలాపంగా ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది. అవి ఉద్దేశపూర్వకంగా చేసిన వ్యాఖ్యలు కాదు. దానికి మెగా అభిమానులు చాలా ఫీలయ్యారు… నన్ను ట్రోల్ చేశారు. చరణ్ నా కొడుకులాంటివాడు… నాకున్న ఏకైక మేనల్లుడు…. అతడికున్న ఏకైక మేనమామని…. అందుకే ఎంతో భావోద్వేగంతో చెబుతున్నాను… ప్లీజ్, ఇక ఆ విషయం వదిలేయండి. చరణ్, నాకు మధ్య ఒక అద్భుతమైన అనుబంధం ఉంది.