త్వరలోనే అందుబాటులోకి…
తుదిమెరుగులు దిద్దుతున్న అధికారులు
ప్రయాణికుల భద్రతకు పెద్ద పీట
అడుగడుగునా సిసి కెమెరాల ఏర్పాటు
చర్లపల్లి టర్మినల్ నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి. ప్రస్తుతం స్టేషన్‌కు తుదిమెరుగులు దిద్దుతున్నారు. విమానాశ్రయాన్ని తలపించే రీతిలో దీని నిర్మాణం చేపట్టారు. ప్రయాణికుల భద్రతకు పెద్ద పీటవేస్తూ ఈ స్టేషన్ నిర్మాణం చేపట్టారు. అడుగడుగునా సిసి కెమెరాలను ఏర్పాటు చేశారు. ఎత్తైన ప్రదేశంలో స్టేషన్ నిర్మాణం చేపట్టడంతో స్టేషన్‌కు దిగువన ప్లాట్ ఫాంల నిర్మాణం చేపట్టారు. ఇది అందుబాటులోకి వస్తే నాంపల్లి, సికింద్రాబాద్, కాచిగూడ్ స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ భారం తగ్గుతుందని దక్షిణమధ్య రైల్వే అధికారులు పేర్కొంటున్నారు.
హైదరాబాద్‌కు తూర్పు భాగంలో చర్లపల్లి టర్మినల్ ఉంది. దీనికి దగ్గరలోనే ఘట్‌కేసర్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డు ఉండటంతో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్లపల్లి టర్మినల్‌కు చేరుకునే వెసులుబాటు ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ టెర్మినల్‌కు ప్రైవేటు, ప్రజా రవాణా వాహనాలు సులువుగా చేరుకునే అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. చర్లపల్లి టర్మినల్ నుంచి 25 జతల ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడపాలని అధికారులు నిర్ణయించారు. 4 వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో ఆధునిక సౌకర్యాలతో ఈ చర్లపల్లి టర్మినల్ అందుబాటులోకి రాబోతుంది.
చర్లపల్లి టెర్మినల్ విశాలంగా
నార్త్ లాలాగూడ, చర్లపల్లి, మౌలాలి, ఘట్‌కేసర్ ప్రాంతాల నుంచి 500ల చెట్లను తీసుకువచ్చి ట్రాన్స్ లొకేషన్ ప్రక్రియ ద్వారా ఇక్కడ వాటిని నాటారు. కోచ్ క్లీనింగ్‌తో పాటు కోచ్ వాషింగ్ చేసిన నీటిని తిరిగి పునర్వినియోగం చేసే విధంగా ఏర్పాట్లు చేపట్టారు. భూగర్భజలాల పెంపునకు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేశారు. గ్రేటర్ హైదరాబాద్‌లో ఇప్పటి వరకు ఉన్న 3 ప్రధాన రైల్వే స్టేషన్లు స్వాతంత్య్రానికి పూర్వమే నిర్మించారు. ఇవి ప్రస్తుతం పెరిగిన జనాభాకు సరిపోవడం లేదు. కానీ, చర్లపల్లి టర్మినల్‌ను విశాలంగా ప్రయాణికుల అవసరాలకు తగ్గట్లుగా నిర్మించారు. ఐదు ప్లాట్ ఫాంలకు అదనంగా మరో నాలుగింటిని ఏర్పాటు చేస్తున్నారు.
విశాలమైన పార్కింగ్ సదుపాయం
ఈ స్టేషన్ నుంచి దూర ప్రాంతాలకు ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడపాలని అధికారులు నిర్ణయించారు. దీంతో స్థానికంగా నడిచే ఎంఎంటిఎస్ రైళ్లను చర్లపల్లి టర్మినల్‌కు అనుసంధానించడంతో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా రైల్వే స్టేషన్‌కు చేరుకునే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. ఇప్పటికే ఉన్న ఐదు ప్లాట్ ఫాంలకు అదనంగా మరో 4 ప్లాట్ ఫాంలను అందుబాటులోకి తీసుకువచ్చారు. పార్సిల్ కేంద్రాలను నిర్మించారు. అలాగే ఆర్పీఎఫ్ సిబ్బంది కోసం ప్రత్యేక నిర్మాణాలను చేపట్టారు. పాదాచారుల వంతెలు, వాహనాల కోసం విశాలమైన పార్కింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేశారు.