ఈ ఏడాది ఏసీబీ కేసుల్లో వారే టాప్!
కోరుకున్న చోట పోస్టింగ్ కోసం లక్షలకు లక్షలు ఖర్చు పెట్టుకోవడం.. అదే స్టేషన్‌లో వాటిని రికవరీ చేసుకునేందుకు లక్షలకు లక్షలు వసూళ్లు.. పోలీస్ శాఖలో కింది స్థాయి నుంచి పైస్థాయి వరకు ఇదే నడుస్తుంది. ఫలితంగా పోలీస్ శాఖలో లంచగొండి అధికారులు, సిబ్బంది పెరిగిపోతున్నారు. ఉన్నతాధికారుల చేతి వాటం ఆ శాఖను ఆయోమయంలో పడేస్తోంది. కొంతమంది చేస్తున్న తప్పులకు, ఇతర అధికారులు తలదించుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఇటీవల కాలంలో తరచూ కొందరు కానిస్టేబుళ్ల నుంచి డీఎస్పీ స్థాయి వరకు లంచాలు తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు చిక్కుతున్నారు. ఈ సంవత్సరం ఏసీబీ అధికారులు నమోదు చేసిన 70 కేసుల్లో 14 పోలీస్ శాఖవే కావడం విశేషం. ఆయా కేసులో కలిపి మొత్తం 19 మంది పోలీసులు అరెస్టయ్యారు. వారిలో హోంగార్డు నుంచి డీఎస్పీ స్థాయి అధికారి వరకు ఉండటం కలకలం రేపుతోంది. రూ.5 వేల నుంచి రూ.25 లక్షల వరకు లంచం డిమాండ్ చేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించవచ్చు.
పలు సమస్యలతో ఠాణా మెట్లు ఎక్కుతున్న బాధితులకు అండగా నిలిచి, వారి సమస్యలు తీర్చే పోలీసులు లంచాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే వారి నుంచి ఫిర్యాదులు స్వీకరించి పరిష్కార భావంతో పని చేయాల్సిన పోలీసులు లంచాల మత్తులో జోగుతున్నారు. కొందరు కానిస్టేబుళ్ల నుంచి డీఎస్పీ స్థాయి అధికారుల వరకు బాధితుల నుంచి లంచాలు వసూలు చేస్తున్నారు. బాధితులతో ముక్కు పిండి మరీ లంచాలు వసూలు చేస్తూ ఏసీబీ అధికారులకు పట్టుబడుతున్నారు. ఈ లంచాల వ్యవహారం రూ.5 వేల నుంచి రూ.25 లక్షల వరకు సాగుతుంది.
పోస్టింగ్ కోసం పోటీ
కొందరు పోలీసులు కావాల్సిన ప్రాంతాల్లో పోస్టింగ్‌ల కోసం పోటీ పడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే దీనికోసం గతంలో రాజకీయ నేతలు సిఫార్సు లేఖలు అందజేసేవారు. పోస్టింగుల కోసం ఎంత ఖర్చు పెట్టయినా సరే ఆ పోస్టింగ్ సాధించేవారని విమర్శలు ఉన్నాయి. ఆ తర్వాత కోరుకున్న చోట అధికారం వచ్చాక లంచాల బాట పడుతున్నారని తెలుస్తోంది. ఎలాగైనా కోరుకున్న చోట పోస్టింగ్ తెచ్చుకునేందుకు లక్షలు ముట్టజెప్పుతూ.. ఆ తర్వాత అసలు ప్రతాపం చూపిస్తున్నారు.
ఇటీవల ఏసీబీకి దొరికిపోయిన పోలీసులు :
ఇటీవల కాలంలో పలువురు పోలీసులు లంచాలు పుచ్చుకుంటూ ఏసీబీకి దొరికిపోతున్నారు. స్కానింగ్ కేంద్రంపై నమోదయిన కేసులో అరెస్టు చేయకుండా నోటీసు తో సరిపెట్టేందుకు సూర్యాపేట డీఎస్పీ పార్థసారథి, సీఐ వీరరాఘవులు రూ.25 లక్షలు డిమాండ్ చేసి రూ.16 లక్షలు తీసుకుంటూ దొరికిపోవడం పోలీసు శాఖలో దుమారం రేపింది. మిర్‌దొడ్డి ఠాణాలో పని చేసే హోంగార్డు సంతోశ్ కుమార్ రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వాహనాన్ని వదిలేసేందుకు రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ పట్టుకుంది.
కోరుట్ల పోలీస్‌స్టేషన్‌లో పనిచేసే ఎస్సై శంకర్ ఓ కేసులో నిందితుడికి నోటీసు ఇవ్వడంతో సరిపెట్టేందుకు రూ.5 వేలు లంచం స్వీకరిస్తూ అనిశాకు పట్టుబడ్డారు.
పోలీసులు పట్టుకున్న మట్టి లారీని వదిలేసేందుకు భద్రాచలం సీఐ రమేష్, కానిస్టేబుల్ రామారావు రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయారు.
కేసు దర్యాప్తు పూర్తయిన తర్వాత న్యాయస్థానంలో దాఖలు చేసే అభియోగ పత్రంలో అభియోగాల తీవ్రత తగ్గించేందుకు రూ.40 వేలు లంచం తీసుకుంటూ మక్తల్ ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్, కానిస్టేబుల్‌లు శివ, రమేష్ ఏసీబీకి పట్టుబడ్డారు.