కేటీఆర్ ఏసీబీ విచారణకు లంచ్ బ్రేక్
ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో నమోదైన ఏసీబీ కేసు విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన న్యాయవాది రామచంద్రరావుతో కలిసి హాజరైన సంగతి తెలిసిందే. మధ్యాహ్నం 1.30 గంటలకు ఏసీబీ విచారణకు అధికారులు విరామం ఇచ్చారు. లంచ్ బ్రేక్ అనంతరం తిరిగి విచారణ ప్రారంభం కానుంది. లంచ్ బ్రేక్ వరకు మూడు గంటల పాటు కేటీఆర్‌ను ఏసీబీ అధికారులు విచారించారు. కేటీఆర్‌ను ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రుతీరాజ్, అడిషనల్ ఎస్పీ శివరాం శర్మ, డీఎస్పీ మాజీద్ ఖాన్ విచారిస్తున్నారు. ఫార్ములా ఈ- కార్ రేస్‌లో జరిగిన నగదు చెల్లింపులపై కేటీఆర్‌ను మధ్యాహ్నం వరకు ఏసీబీ 15 ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. ఈ- కార్ రేస్ నిర్వహణలో మీ పాత్ర ఏంటి..? ఆర్గనైజర్స్‌కు నగదు చెల్లింపులు మీ ఆధ్వర్యంలోనే జరిగాయా..? ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో చెల్లింపులు ఎందుకు చేశారు..? నగదు చెల్లింపుల్లో క్యాబినెట్ అభిప్రాయం ఎందుకు తీసుకోలేదు..? హెచ్ఎండీఏ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌కు తెలిసే చెల్లింపులు జరిగాయా..? పౌండ్స్ రూపంలో ఇండియన్ కరెన్సీ విదేశీ అకౌంట్‌కు చెల్లించినపుడు ఆర్బీఐ అనుమతి లేదు.. అసలు అనుమతులు తీసుకోవాల్సిన బాధ్యత ఎవరిది..? మీరు సక్సెస్ ఫుల్ ఈవెంట్‌గా భావిస్తున్న ఈ కార్ రేస్‌లో ప్రమోటర్స్ ఎందుకు వెనక్కి తగ్గారు..? అని కేటీఆర్‌ను ఏసీబీ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం.