వింత..వింత.. మనుషులు. అదేంటి అనుకుంటున్నారా… ఉత్తరప్రదేశ్‌కి చెందిన ఓ యువకుడి వింత ప్రవర్తన అందరినీ విస్తుపోయేలా చేసింది. ఒంటరిగా కనబడితే చాలు.. ప్రతి ఒక్కరి చెంపలు వాయించి పారిపోతున్నాడా యువకుడు. అయితే, ఓ బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు సదరు యువకుడిని పట్టుకున్నారు. అతనిపై బీఎన్ఎస్ సెక్షన్ 115 కింద కేసు నమోదు చేశారు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. యూపీలోని మీరట్‌కు చెందిన కపిల్ కుమార్(23) అనే యువకుడి ప్రవర్తనలో గత ఐదారు నెలల నుంచి వింత మార్పులు వచ్చాయి. రోడ్లపై ఒంటరిగా వెళ్లే వారిని లక్ష్యంగా చేసుకుని చెంపలు వాయిస్తున్నాడు. బాధితులకు ఏం జరిగిందో అర్థమయ్యేలోపే తన బైకుపై అక్కడి నుంచి జారుకుంటున్నాడు. ఇలా ఇప్పటివరకు చాలా మందిని కొట్టాడు. అయితే తాజాగా కపిల్ కుమార్.. రిటైర్డ్ పీసీఎస్ అధికారి చెంప పగులగొట్టాడు. అతను రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా బైకుపై వెనుక నుంచి వచ్చి.. ఎడమ చేతితో గట్టిగా చెంపపై కొట్టాడు. బాధితుడు వృద్ధుడు కావడంతో కపిల్ కుమార్ బలంగా కొట్టిన దెబ్బకు కిందపడిపోయాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాంతో వృద్ధుడు పోలీసులను ఆశ్రయించాడు.
కపిల్ దాడిలో స్వల్పంగా గాయపడ్డ వృద్ధుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వృద్ధుడి ఫిర్యాదు మేరకు పోలీసులు వెంటనే ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించారు. అక్కడున్న సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా నిందితుడు కపిల్ కుమార్ అని గుర్తించారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకున్నారు.
మీరట్ నగరం ఎస్‌పీ ఆయుశ్ విక్రమ్ సింగ్ మాట్లాడుతూ.. “కుమార్‌పై ఇలా ఇతరులను చెంపదెబ్బలు కొట్టడం విషయమై మూడు కేసులు ఉన్నాయి. అతనిపై బీఎన్ఎస్ సెక్షన్ 115 కింద కేసు నమోదు చేయడం జరిగింది. అతను ఐదు సంవత్సరాల క్రితం తన తండ్రిని కోల్పోయాడు. కపిల్ మానసిక పరిస్థితిని పరిశీలించిన వైద్యులు అతను ప్రస్తుతం ‘డోపమైన్ రష్’ అనే మానసిక రుగ్మతతో బాధపడుతున్నట్లు గుర్తించారు. అతడికి చికిత్స చాలా అవసరమని చెప్పారు.