భారతీయ జనతా పార్టీకి చెందిన గోషామహల్ ఎమ్మెల్యే టి.రాజాసింగ్ కార్యాలయం వద్ద పాకిస్థాన్ జెండా స్టిక్కర్లు దర్శనమివ్వడం కలకలం రేపింది. జమ్మూకశ్మీర్ పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ గోషామహల్ ఎమ్మెల్యే టి.రాజాసింగ్ వినూత్న నిరసనకు తెర తీశారు. తన కార్యాలయానికి వచ్చిన సందర్శకులు చెప్పులు విడిచే స్థలంలో పాకిస్థాన్ జెండా స్టిక్కర్లను అతికించారు. సమాచారమందుకున్న మంగళ్‌హాట్ పోలీసులు వాటిని తొలగించారు. దీంతో ఎమ్మెల్యే రాజాసింగ్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్థాన్‌లో భారత్ జెండాలను తగులబెడుతున్నారని, మన దేశంలో మాత్రం పోలీసులు ఇలా వ్యవహరించడం తగదన్నారు. కాగా.. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాజాసింగ్ తిరుపతిలో జెండా వివాదంపై స్పందించారు. ‘మా ఆఫీసులోకి వచ్చివెళ్లే వారు పాకిస్థాన్ జెండాను తొక్కాలని గడపలో అతికించాం. మా తెలంగాణ పోలీసులు వచ్చి ఆ జెండాను తీసేసి వెళ్లారని మా కార్యకర్తలు నాకు సమాచారం ఇచ్చారు. నేను పోలీసులను అడిగితే అది పాకిస్థాన్ జెండా కాదు.. ఒక మతానికి చెందిన జెండా అంటున్నారు. నేను పాకిస్థాన్ జెండాకు, మతానికి సంబంధించిన జెండాకు తేడా చెప్పాను. తెలంగాణ పోలీసులకు అది కూడా అవగాహన లేదు. ఢిల్లీలో ప్రధాని మోదీ మంచి సమావేశం నిర్వహించి ఉగ్రవాదులకు తగిన గుణపాఠం చెప్పనున్నారు’ అని రాజాసింగ్ వివరించారు.