సిట్ విచారణలో ఫోన్ ట్యాపింగ్ నిందితుడు శ్రవణ్ రావు
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ లో సిట్ విచారణకు శ్రవణ్‌రావు హాజరయ్యారు. గత శనివారం శ్రవణ్‌రావును సిట్ బృందం సుదీర్ఘంగా విచారించింది. ఆరున్నరగంటల పాటు విచారించిన సిట్.. శ్రవణ్ రావు నుంచి కొంత సమాచారాన్ని రాబట్టింది. అయితే ఆ రోజు పోలీసుల విచారణకు శ్రవణ్ రావు సహకరించకపోవడం, పోలీసులు అడగిన ప్రశ్నలకు దాటవేత ధోరణి అవలంభించడంతో మరోసారి విచారించాలని సిట్ బృందం భావించింది. అందులో భాగంగానే మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో బుధవారం ఉదయం సిట్ విచారణకు శ్రవణ్ రావు హాజరయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కోసం వినియోగించిన సాంకేతిక పరికరాలను అప్పటి ప్రభుత్వ పెద్దలు ఆదేశిస్తేనే విదేశాల నుంచి తెప్పించినట్లు అంగీకరించినట్లు తెలుస్తున్నది.
కాగా.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో శ్రవణ్ రావు చాలా కీలకంగా వ్యవహరించారని సిట్ బృందం భావిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటి వరకు ఆరుగురు నిందితులు ఉండగా.. అందులో ఐదుగురు పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన వారే. కేవలం శ్రవణ్ రావు మాత్రమే ప్రైవేటు వ్యక్తి. అయితే పోలీసుశాఖ వ్యక్తులతో శ్రవణ్ రావు కుమక్కై ఏ విధంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిపించారనే దానిపై సిట్ బృందం ఫోకస్ చేసింది. కొంతమంది కాంటాక్ట్ లిస్టును శ్రవణ్ రావు సీఐబీ అధికారులకు ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఎవరు ఈ కాంటాక్ట్ నెంబర్స్‌ను సమకూర్చారు, రాజకీయ నాయకులకు సంబంధించిన కాంటాక్ట్ వివరాలతో పాటు వారి సంభాషణలు వినాలని ఎవరు శ్రవణ్‌కు సూచించారు అనే అంశాలపైనే సిట్ బృందం ప్రధానంగా దృష్టి సారించింది. శాసనసభ ఎన్నికలకు ముందు సీఎం రేవంత్ రెడ్డికి చెందిన బంధువుల ఫోన్ నెంబర్లు సేకరించి.. వారి ఫోన్లపై కూడా నిఘా ఉంచినట్లు తెలుస్తోంది.
అలాగే ఫోన్ ట్యాపింగ్ చేసేందుకు ప్రత్యేకంగా పరికరాలను తీసుకొచ్చి, వాటిని వివిధ ప్రాంతాల్లో సర్వర్ రూంలుగా ఏర్పాటు చేసి అక్కడి నుంచి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమంతా నడిపించారు. శ్రవణ్ రావుకు ఓ మీడియా సంస్థ ఉంది. ఆ మీడియా సంస్థ కార్యాలయంలోనే ప్రత్యేకంగా సర్వర్ రూంలను ఏర్పాటు చేసి.. అక్కడి నుంచే ఈ వ్యవహారాన్ని నడిపారు. ఈ వ్యవహారంలో శ్రవణ్ రావుకు ప్రణీత్ రావు సహకరించారు. ప్రణీత్ రావు నేతృత్వంలోనే శ్రవణ్‌రావుకు చెందిన కార్యాలయాల్లో ఫోన్ ట్యాపింగ్ పరికరాలను ఏర్పాటు చేసి.. అక్కడి నుంచే ఫోన్ ట్యాపింగ్‌కు తెరలేపారు. అయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని నడిపించినందుకు శ్రవణ్ రావు ఏమైనా ఆర్థికంగా లబ్ధిపొందారా.. ఇదే నిజమైతే ఎవరు ఆయనకు ఆర్థికంగా మద్దతు ఇచ్చారు.. అన్న అంశాలపై సిట్ బృందం విచారించనుంది. గత విచారణలో వీటిపై శ్రవణ్‌ను ప్రశ్నించగా.. సరైన సమాధానాలు చెప్పనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మరోసారి శ్రవణ్‌కు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిపించిన సిట్.. ఆయన నుంచి పూర్తి సమాచారాన్ని రాబట్టే పనిలో పడ్డారు.