ఆయనో ఎమ్మెల్యే.. అంతేకాదు కోట్ల విలువ చేసే కాలేజీలు.. ఇతర వ్యాపారాలు భారీగానే ఉన్నాయి. విలాసవంతమైన ఇల్లు కూడా ఉంది. కానీ, రెండు రోజుల నుంచి ఆ ఎమ్మెల్యే చెత్త కుప్పలోనే జీవనం సాగిస్తున్నాడు. చెత్త కుప్పల మధ్య కూర్చుని తింటున్నాడు. మచ్చబోల్లారం డివిజన్ పరిధిలోని స్మశానవాటికలోని అక్రమ డంపింగ్ యార్డును తొలగించి అక్రమ నిర్మాణాలను నిలిపివేయాలని కోరుతూ డంపింగ్ యార్డులోని చెత్తలోనే కూర్చొని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆందోళన చేస్తున్నారు. “స్టాప్ ఇల్లీగల్ డంపింగ్ ఇన్ హిందూ గ్రేవ్ యార్డ్” అనే నినాదంతో దాదాపు నలభై కాలనీల ప్రజలతో కలిసి ధర్నా చేస్తున్నారు. ఆదివారం ఉదయం నుంచి సోమవారం వరకు చెత్తకుప్పల మధ్య నిరసన సాగిస్తున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజారోగ్యాన్ని, హిందూ సాంప్రదాయాలను మనోభావాలను లెక్క చేయకుండా ఇష్టానుసారం అధికారులు వ్యవహించడం సమంజసం కాదని, డంపింగ్ యార్డులో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన భయంకరమైన చెత్త వల్ల ప్రజాజీవనం కాలుష్యభరితమై, చిన్న పిల్లలు, వృద్ధుల ఆరోగ్యాలు ప్రశ్నార్థకంగా మారాయని ఆరోపించారు. భూగర్భ జలాలు కాలుష్యమవుతున్నాయని, పర్యావరణం పూర్తిగా కాలుష్య భరితంగా మారిందని, అధికారులు కార్పొరేట్ సంస్థలకు తొత్తులుగా పనిచేయడం మానుకోవాలని హెచ్చరించారు. ఈ సమస్య పరిష్కారం అయ్యేంతే వరకు ప్రతి రోజూ ధర్నా నిర్వహిస్తామని, అవసరమైతే అల్వాల్ బల్దియా కార్యాలయాన్ని ముట్టడిస్తామని, ముఖ్యమంత్రి దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకెల్లి అవినీతి అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.