Monday, July 1, 2024

Chevella MLA Kale Yadayah బిఆర్‌ఎస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ

చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య
కాంగ్రెస్ పార్టీలో చేరిక
72కు చేరిన కాంగ్రెస్ సభ్యుల బలం
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో ఘోర పరాభవాన్ని ఎదుర్కొంటున్న బిఆర్‌ఎస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీలో చేరుతుండగా ఈ క్రమంలోనే శుక్రవారం చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య ఢిల్లీలో సిఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పటివరకు కాంగ్రెస్‌లో ఆరుగురు బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు చేరడంతో శాసనసభలో సభ్యుల బలం 72కు చేరింది.

ఈ మేరకు ఏఐసిసి ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ, యాదయ్యకు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. కొందరు తమ రాజకీయ భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని పార్టీ మారితే మరికొందరు తాము అధికారంలో ఉండగా కూడబెట్టిన ఆస్తులను కాపాడుకునేందుకు మళ్లీ అధికార పార్టీలోకి వెళుతున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గ్రామ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసుకునేందుకు కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్‌కు తేరలేపింది. ముఖ్యంగా బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఫోకస్ పెడుతూ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా లేకుండా బిఆర్‌ఎస్ ఎల్పీని కాంగ్రెస్‌లో విలీనం చేసుకునేందుకు రేవంత్ పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు.

కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు
ముందుగా దానం నాగేందర్ బిఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్ గూటికి చేరగా ఆ తర్వాత భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత బిఆర్‌ఎస్‌లో సీనియర్ నేత స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సైతం కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని, వరంగల్ ఎంపిగా తన కుమార్తె కడియం కావ్యకు టికెట్ ఇప్పించుకుని గెలిపించుకు న్నారు. ఇప్పుడు వారం రోజుల క్రితం బాన్సువాడ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి హస్తం గూటికి చేరారు.

పోచారం పార్టీలో చేరిన రెండు రోజుల తరువాత జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లోచేరారు. ప్రస్తుతం చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కాంగ్రెస్ కండువా కప్పుకోవడం విశేషం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికలో బిఆర్‌ఎస్ అభ్యర్థి ఓడిపోయి కాంగ్రెస్ గెలవడంతో ఇప్పుడు బిఆర్‌ఎస్ బలం 32మందికి చేరుకుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ లో అడుగు పెట్టె సాహసం చేస్తాడా?
- Advertisment -

Most Popular