అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తున్న డ్రోన్ పాలసీ దేశంలోనే అత్యుత్తమ డ్రోన్ పాలసీగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీ డ్రోన్స్ కార్పొరేషన్ సంస్థ ఐదేళ్లలో చేపట్టాల్సిన లక్ష్యాలతో రూపొందించిన ఏపీ డ్రోన్ పాలసీ-2024-2029 ముసాయిదా పాలసీపై సచివాలయంలో మంగళవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్షించారు. రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ కార్యదర్శి ఎస్. సురేష్‌కుమార్, ఏపీ డ్రోన్ కార్పొరేషన్ ఎండీ కె. దినేష్ కుమార్‌లు ఈ పాలసీ గురించి ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ మన రాష్ట్రం రూపొందిస్తున్న డ్రోన్ పాలసీ దేశంలోనే అత్యుత్తమ డ్రోన్ పాలసీగా ఉండాలని సూచించారు. దేశంలో డ్రోన్ పరిశ్రమలకు ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ కేంద్రంగా ఉండేలా చూడాలన్నారు. డ్రోన్ తయారీ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చే సంస్థలకు మంచి ప్రోత్సహకాలు ఇచ్చి ఈ రంగంలో భారీగా పెట్టుబడులు ఆకర్షించాలని చెప్పారు. కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లును డ్రోన్ తయారీ పరిశ్రమలు నెలకొల్పడానికి అనుకూలమైందిగా అభివృద్ధి చేయడానికి తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.
డ్రోన్ల రంగంలో విస్తృతంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలిగేలా పాలసీలో విధాన రూపకల్పనలుండాలన్నారు. డ్రోన్ తయారీ, సేవల రంగానికి సంబంధించి ఏపీలో ఒక మంచి వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ వీలైనన్ని చోట్ల వీలైనంత మేర డ్రోన్ సేవలను వినియోగించుకునేలా చూడాలన్నారు. ప్రభుత్వ శాఖల్లో డ్రోన్లు ఎలా ఉపయోగించుకోవాలి అనే దానిపై ఆయా శాఖల్లో అవగాహన కల్పించాలని, తద్వారా ఆ శాఖలు కూడా డ్రోన్ల వినియోగాన్ని పెంచుకోవడానికి దోహదపడాలన్నారు. రాష్ట్రంలో డ్రోన్ల రంగానికి సంబంధించి రీసెర్చి అండ్ డెవలప్మెంటు పరంగా కూడా ఏపీలో తగిన అనుకూల వాతావరణం ఉండేలా చూడాలని తెలిపారు. ఒక మంచి అనుకూల వాతావరణం ఏర్పాటు చేయడం ద్వారా డ్రోన్ తయారీ పరిశ్రమలన్నీ కూడా ఏపీవైపు చూసేలా చేయొచ్చునని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని దేశంలోనే డ్రోన్ క్యాపిటల్ సిటీగా అభివృద్ధి చేయాలని, ఆ దిశగా కూడా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో రాష్ట్ర పెట్టబడులు మౌలిక సదుపాయాల కల్పన శాఖ మంత్రి బీసీ జనార్దనరెడ్డి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.