Friday, December 27, 2024

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ‘ఇండియా టీవీ’ చీఫ్ ఎడిటర్ రజత్‌ శర్మ నిర్వహించే ‘ఆప్‌ కీ అదాలత్‌’ షో దేశమంతటా సంచలనం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ‘ఇండియా టీవీ’ చీఫ్ ఎడిటర్ రజత్‌ శర్మ నిర్వహించే ‘ఆప్‌ కీ అదాలత్‌’ షో దేశమంతటా సంచలనం రేపింది. ‘రేవంత్‌ రెడ్డి రోర్స్‌ (ఆర్‌ఆర్‌ఆర్‌)’ పేరుతో ఇండియా టీవీ శనివారం రాత్రి ప్రసారం చేసిన ఈ కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. రజత్ శర్మ అడిగిన సూటి ప్రశ్నలకు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన చురుకైన సమాధానాలు ప్ర్రేక్షకులను అలరించాయి. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో అటు జాతీయ రాజకీయాలతో పాటు తెలంగాణలో ఉన్న పరిస్థితులు, తన రాజకీయ ప్రస్థానంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనదైన శైలిలో స్పందించారు. గంటసేపు జరిగిన ఈ షోలో ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంది.

రజత్ శర్మ; కేసీఆర్ ప్రభుత్వం మిమ్మల్ని జైలుకు పంపించింది కదా. ప్రతీకారం తీర్చుకుంటున్నట్లు కనిపిస్తుంది..?

రేవంత్ రెడ్డి; లేదు. కేసీఆర్‌పై ప్రతీకారం తీర్చుకోవడమెక్కడిది. అసలు ప్రారంభించనే లేదు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీలు అమలు చేయటం మొదలు పెట్టాను.

సింహం పడుకొని ఉంది… బయటకు వస్తుంది.. అప్పుడు చూసుకుందాం అని అంటున్నారు కదా..?

సింహం రావాలనే చూస్తున్నా. తుపాకీ సిద్ధంగా ఉంది. ఒక్క తూటా చాలు. పిల్లులు, కుక్కలను నేను కొట్టను. కొడితే సింహాన్నే కొడుతాను. ఎన్నికల్లో ఓడగొట్టి చూపించాను కదా.

రాహుల్ పప్పు హై.. రేవంత్ తెలంగాణ పప్పు అని కేటీఆర్ అంటున్నారు కదా..?

కరెక్ట్. అందులో తప్పేముంది. పప్పు. దాల్.. అందులో ప్రోటీన్ ఉంటుంది. పోషకాహారం. మేమే హెరాయిన్, గాంజా లాంటి మాదక ద్రవ్యాలు కాదు కదా.

గతంలో మీరు డ్రగ్స్ అంబాసిడర్ అని కేటీఆర్ను అన్నారు..?

వైట్ ఛాలెంజ్కు సిద్ధమా.. అని సవాలు చేస్తే వాళ్లు పారిపోయారు. తెలంగాణ సమాజం నుంచి డ్రగ్స్ నిర్మూలించాలని.. గతంలో నేను వైట్ ఛాలెంజ్కు పిలుపునిచ్చాను. బ్లడ్ అండ్ హెయిల్ శాంపిల్ పరీక్షలకు రావాలని కోరాను. వాళ్లు పారిపోయారు..?

ఫోన్ ట్యాపింగ్ కేసు ఎందాక వచ్చింది..?

ఫోన్ ట్యాపింగ్ పై కేసు దర్యాప్తులో ఉంది. గత ప్రభుత్వానికి ఖాసీం రజ్వీగా పని చేసిన ఎస్ఐబీ చీఫ్ విదేశాలకు పారిపోయారు. తీవ్రవాదులు, దేశ విద్రోహ శక్తుల ఫోన్లను ట్యాప్ చేయటం తప్పు లేదు. అనుమతి తీసుకొని చట్ట బద్ధంగానే వాటిని ట్యాప్ చేసే వీలుంది. కానీ రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బంధువులు, భార్యాభర్తల ఫోన్లను కూడా వదల్లేదు.

కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ను మీరేందుకు తిట్టారు..?
కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఒకసారి హైదరాబాద్కు వచ్చినప్పుడు కేటీఆర్ ను మెచ్చుకున్నారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు కాంగ్రెస్ నాయకులు కష్టపడి.. జైళ్ల పాలైన పోరాడుతున్న సమయమది. అప్పుడు తెలంగాణలో పార్టీని కాపాడుకునేందుకు ఆయనను తిట్టాల్సి వచ్చింది.

బీజేపీకి 240 దాటవు…తెలంగాణలో రెండే ఎక్కువ

మోదీ నేతృత్వంలోని బీజేపీకి లోక్‌సభ ఎన్నికల్లో 400 సీట్లు రావాలంటే ఒక్క భారతదేశంలో పోటీ చేస్తే సరిపోదు. పాకిస్తాన్‌లో కూడా ఆ పార్టీ పోటీ చేయాలి. గత ఎన్నికల్లో బీజేపీ యూపీ, ఢిల్లీ, బిహార్‌ తదితర రాష్ట్రాల్లో అత్యధిక సీట్లు గెలుచుకుంది. ఈసారి ఆ రాష్ట్రాల్లో అన్ని సీట్లు రావడం అసాధ్యం. కమలనాథులకు ఈసారి 200-240 సీట్లకు మించి రావు. దక్షిణాదిన ఉన్న 129 సీట్లలో కర్ణాటకలో 10, తెలంగాణలో రెండు సీట్ల కంటే ఎక్కువ రావు. అలాంటప్పుడు దేశవ్యాప్తంగా 400 సీట్లు ఎక్కణ్నుంచి వస్తాయి..? కేసీఆర్‌ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో తమకు 100 సీట్లకు పైగా వస్తాయన్నారు. కానీ 39 వచ్చాయి కదా. రాజకీయ నాయకులు గెలిచే వాతావరణం సృష్టించేందుకు వాట్సాప్‌ యూనివర్సిటీల్లో ప్రచారం కోసం గొప్పలు చెప్పుకోవడం సహజం.
మోదీ ఇంతకాలం గెలిచింది వాట్సాప్‌ యూనివర్సిటీల్లోనే. ఈసారి ప్రజలు ఆలోచిస్తున్నారు.

ఇంగ్లిష్ తక్కువ.. హిందీ ఫర్ ఫెక్ట్

జడ్పీ స్కూల్లో చదువుకొని వచ్చాను. అందుకే ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడలేను. తెలంగాణ ప్రాంతంలో నిజాం సర్కారు ఉండేది. ఉర్దూ, హిందీ ప్రభావముండేది. ఎంపీగా ఉన్నప్పుడు లోక్సభలో మాట్లాడాల్సి వచ్చేది. అందుకే హిందీలో మాట్లాడగలుగుతా.

ఢిల్లీ లిక్కర్ కేసులో కేసీఆర్ కూతురు కవితను అరెస్ట్ చేయటం వల్ల బీఆర్ఎస్కు సానుభూతి లభిస్తుందా..?

తెలంగాణలో జరిగిన అవినీతికి కవితను అరెస్టు చేయలేదు. ఢిల్లీలో జరిగిన అవినీతికి అరెస్టు చేశారు. కేసీఆర్‌ను అరెస్టు చేసి ఉంటే తెలంగాణ ఎన్నికల్లో ఏమైనా ప్రభావం ఉండేది గానీ.. కవిత అరెస్టు ఏ మాత్రం ప్రభావం చూపదు. కవిత అరెస్టుకు తెలంగాణ ఎన్నికలకు సంబంధం లేదు. ఆ అంశంపై చర్చ కూడా జరగదు.

కేసీఆర్ ప్యాంటు విప్పి, చొక్కా విప్పి నిలబెడుతామని అంటున్నారు..?

ఈంట్ కా జవాబ్ పత్తర్ సే దేనా.. (ఇటుకకు రాయితోనే సమాధానం చెప్పాలి కదా.) అంతకు ముందు రోజు కేసీఆర్ నాపై, మా మంత్రులపై ఇష్టమోచ్చినట్లు మాట్లాడితే అలా మాట్లాడాల్సి వచ్చింది.
కేసీఆర్ను జైలుకు పంపుతానని, చిప్పకూడు తినిపిస్తానని అంటున్నారు..?

జైళ్లోనే డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇస్తామని కూడా అన్నాను. కేసీఆర్‌ వయసు అయిపోయింది. ఆయన వేరే చోట.. కొడుకు మరో చోట.. కూతురు, అల్లుడు ఇంకోచోట వేర్వేరుగా ఉంటున్నారు. ఇదంతా బాధాకరంగా ఉంది. అందుకే చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్‌రూమ్‌ కట్టించి ఇస్తే.. అందరూ ఒకేచోట కలిసి ఉంటారని అన్నాను. నేను ఎంత మనసున్న మనిషినో మీరైనా అర్థం చేసుకొండి. నేను రెండుసార్లు చెర్లపల్లి జైళ్లోనే ఉన్నా. నా కూతురు ఎంగేజ్మెంట్ కూడా పోలీసు అనుమతితో ఉన్నా. అదే రోజు చెప్పిన. కేసీఆర్ నీకు ఇలాంటి పరిస్థితి వస్తే తెలుస్తుంది అని ఛాలెంజ్ చేసినా. అదే నిజమైంది. విధి బలమైంది. కవిత జైళ్లో ఉండాలని కోరుకోలేదు. నా కోపం కేవలం కేసీఆర్పై. రావణుడు ఉన్నంతకాలం రాముడు.. కేసీఆర్‌ ఉన్నంత కాలం రేవంత్‌ ఉంటాడు.

ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి కాబట్టి.. వాళ్లను వదిలిపెట్టరా..?

లేదు. అటువంటిదేమీ లేదు. కేసీఆర్‌, కేటీఆర్‌ని కొట్టాలనుకుంటే నాకు ఇవేమీ అవసరం లేదు. నేనే అసెంబ్లీకి వెళ్లి కొట్టగలను. దీని కోసమే అయితే ఈ కుర్చీ అవసరం లేదు.

దక్షిణాది నుంచి ప్రధాని

రానున్న రోజుల్లో దక్షిణాది వాళ్లే ప్రధాని అవుతారని సీఎం రేవంత్ రెడ్డి ఒక ప్రశ్నకు సమాధానం చెప్పారు. కాంగ్రెస్‌కు అఖిల భారత స్థాయిలో అధ్యక్షుడుగా ఉన్న మల్లికార్జున ఖర్గే దక్షిణాదికి చెందిన వారే. రాహుల్‌ గాంధీ కూడా దక్షిణాదిలోని వాయనాడు నుంచి పోటీ చేశారు.

కాంగ్రెస్‌ దక్షిణాదిని కట్టా చేసిందన్న ప్రశ్నకు సమాధానమిస్తూ…

గతంలో 42 మంది తెలుగు ఎంపీల్లో ఒక్కరినే కేబినెట్‌
మంత్రిని చేశారు. గుజరాత్‌లో 28 మంది ఎంపీలు
ఉంటే ఏడుగురిని, యూపీలో 62 మంది ఎంపీల్లో
ప్రధాని సహా 16 మందిని మంత్రుల్ని చేశారు. ప్రధానమంత్రి, హోంమంత్రి, స్పీకర్‌, ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్‌ అందరూ ఉత్తరాది వారే. దక్షిణాదికి ఏమిచ్చారు. దక్షిణాది దేశంలో భాగం
కాదా? హిందుస్తాన్‌లో లేదా? దేశంలో హిందీ తర్వాత ఎక్కువ మంది మాట్లాడే భాష తెలుగు. అయినా వెంకయ్య నాయుడును
ఉత్తరాది నుంచి గెంటేశారు.

తమిళనాడు, తెలంగాణలో కూడా జనం మోదీ, మోదీ అంటున్నారు కదా..?

సినిమాలో అప్పుడప్పుడూ జోకులు, కామెడీ కూడా ఉంటే బాగుంటుంది.

కాంగ్రెస్ అగ్ర నేతలెవరైనా తెలంగాణ నుంచి పోటీ చేస్తారా..?

తెలంగాణ నుంచి సోనియా, రాహుల్‌, ప్రియాంకను పోటీ చేయాల్సిందిగా కోరాం. ఇప్పటివరకైతే ఒప్పుకోలేదు. వారివల్లే తెలంగాణ వచ్చింది. వారు లేకపోతే వంద సంవత్సరాలైనా తెలంగాణ వచ్చేది కాదు. ఆ కుటుంబంపై ఉన్న గౌరవంతో వాళ్లను గెలిపించుకునేందుకు రమ్మని ఆహ్వానించాం.

మీరు ఆస్తులు అమ్మి ఎన్నికల్లో పోటీ చేశారు
కదా?

ఒకటి రావాలంటే ఒకటి కోల్పోవాలి. ఆస్తులు కోల్పోయినా తిరిగి సంపాదించుకోవచ్చు. రాజకీయాల్లో అలా ఉండదు. నా ఆలోచనలో స్పష్టత ఉంది. అందుకే సీఎంను కాగలిగాను. 2009లోనే తెలంగాణ వస్తుందని అనుకున్నా. నేను సీఎం అవుతానని అప్పుడే అనుకున్నా. నా ఆలోచనలో స్పష్టత ఉంది. అందుకే సీఎం అయ్యాను.

ప్రభుత్వ ఉద్యోగం చేసేటోణ్ని

రాజకీయాల్లోకి రాకుంటే ప్రభుత్వ ఉద్యోగం చేసేటోన్ని.. లేదా నా ఫ్రెండ్స్ కొందరు అమెరికాకు వెళ్లారు. వాళ్లలాగే నేనే వెళ్లేటోన్ని. మాది ఫ్యాక్షన్ గ్రామం. మా పెద్దన్న పోలీస్ డిపార్టుమెంట్లో పని చేసేవాడు. ఆ గొడవలకు నన్ను దూరంగా ఉంచేందుకు గ్రామం నుంచి బయటకు తీసుకువచ్చాడు. ఫుట్బాల్ ఆడట నాకిష్టం. డిగో మారోడానా నా ఫేవరేట్ ప్లేయర్.

రాహుల్ ఎవరితో ఎక్కువ సఖ్యతగా ఉండరనే పేరుంది..? మీతో ఎలా కలిశారు..?

రాహుల్ దగ్గరికి వెళ్లే నేతలందరూ ఏదో ఒక పర్సనల్ ఎజెండాతో వెళుతారు. దీంతో ఆయన ఒకటీ రెండు నిమిషాలకు మించి సమయం ఇవ్వరనే పేరుంది. ప్రజల ఎజెండా లేదా పార్టీ కార్యక్రమాలతో వెళితే ఆయన ఎప్పుడైనా వినేందుకు సిద్దంగా ఉంటారు. నేను మొదటిసారి కలిసినప్పుడు పది నిమిషాలు టైమ్ ఇచ్చారు. కానీ నేను ప్రజలు, పార్టీ గురించి మాట్లాడితే గంటన్నర సమయం నాతోనే గడిపారు.

టీడీపీని ఎందుకు వదిలేశారు..?

కేసీఆర్తో కొట్లాడేందుకే టీడీపీ నుంచి బయటకు వచ్చాను. కాంగ్రెస్లో చేరాను. నేను పదవుల కోసం రాలేదు. ప్రజల నేతగా ఉండాలని అనుకున్నాను. లీడర్గా నిలబడ్డాను.

లోక్‌సభ ఎన్నికల తర్వాత రేవంత్‌ బీజేపీలో కలుస్తారంటూ కేటీఆర్‌ అంటున్నారు..?

మహబూబ్‌ నగర్‌, చేవెళ్ల మల్కాజిగిరి భువనగిరి, జహీరాబాద్‌ సీట్లలో బీజేపీని గెలిపించేందుకు బీఆర్‌ఎస్‌ సుపారీ తీసుకుంది. బీజేపీ, బీఆర్‌ఎస్‌ మధ్య అవగాహన ఉన్నది. సుపారీ తీసుకున్న వారికి నాపై మాట్లాడే అర్హత ఏముంది. అధికార దాహంతో బీజేపీలో చేరాలనుకుంటే 2017 లోనే చేరి మంత్రినయ్యే వాడిని. ఇవాళ కాంగ్రెస్‌ ముఖ్యమంత్రిగా ఉన్న తనకు బీజేపీలో చేరాల్సిన అవసరమేమున్నది..? 17 సంవత్సరాలుగా ప్రతిపక్షంలోనే ఉన్నాను. ప్రజల మధ్యలో ఉండి రాజకీయంగా పోరాడి ముఖ్యమంత్రి అయ్యాను. ఎవరి దయాదాక్షిణ్యాలతో ఈ పదవిలోకి రాలేదని గుర్తుచేశారు. కేటీఆర్‌ది మేనేజ్‌మెంట్‌ కోటా. ఆయనతో నాకు పోలికేమిటీ..? తండ్రి పేరుతో కేటీఆర్‌కు నౌకరీ దొరికింది. .. లేకపోతే ఆయన తెలంగాణలో చప్రాసీ కూడా కాలేడు.

రేవంత్‌ రెడ్డిని కేటీఆర్‌ ‘చోటా మోదీ’ అంటున్నారు. చోటా మోదీ, బడా మోదీ, అదానీ కలిని ట్రిపుల్‌ ఇంజన్‌ సర్కారు నడుపుతున్నారని అంటున్నారు… .?

కేటీఆర్‌ సంతోషం ఎన్నాళ్లు. రెండు నెలల తర్వాత అంతా తేలిపోతుంది.

మోదీవి బూటకపు హామీలు

నిరుద్యోగం, అధిక ధరలు జనంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. యువకుల్లో 62 శాతం నిరుద్యోగులే ఉన్నారు. వారందరూ ఈసారి మోదీకి వ్యతిరేకంగా ఉన్నారని ఇటీవలి సర్వేల్లో తేలింది. నిత్యావసర వస్తువులు, గ్యాస్‌ సిలిండర్ల ధరలు పెరిగాయి. 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి 7 లక్షల మందికే ఇచ్చినట్లు పార్లమెంట్‌లో నేను అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. జన్‌ ధన్‌ ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామన్నారు. ఆ డబ్బులు వచ్చాయా..? రైతుల ఆదాయం రెట్టింపు చేస్తారని చెప్పారు. కానీ ఇవాళ ఢిల్లీలో కూడా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నెలల తరబడి రైతులు ధర్నాలు చేస్తున్నారు. పేదలకు ఇండ్లు ఇస్తామన్న వాగ్దానం ఏమైంది.. ? అయినప్పటికీ మోదీ మూడోసారి ప్రధాని అవుతానని కలలు కంటున్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 2014 వరకు 67 సంవత్సరాల్లో 14 మంది ప్రధానమంత్రులు రూ.55 లక్షల కోట్లు అప్పు చేస్తే.. మోదీ గత పదేళ్లలో రూ.113 లక్షల కోట్ల మేర అప్పులు చేశారు. ఈ రెండింతల డబ్బంతా ఎక్కడకు వెళ్లింది..? గత ప్రధానులు ఎన్నో ఆనకట్టలు కట్టారు. ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పాటు చేశారు. కానీ మోడీ ఏం చేశారో ప్రశ్నించండి.

‘‘మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చేసిన రాహుల్‌గాంధీ.. మోదీని ‘చౌకేదార్‌ చోర్‌హై’ అంటారు. మీరు మాత్రం మోదీని ‘బడే భాయ్‌’ అంటారు?

మీరు పరిస్థితిని అర్థం చేసుకోవాలి. నేను సీఎం అయ్యాక తొలిసారి ప్రధాని మోదీ మా రాష్ట్రానికి వచ్చారు. మేమిద్దరమూ ఒకే వేదికపై కూర్చున్నాము. ప్రధానిగా ఆయన దేశానికే పెద్దన్నలాంటివారు. నాకేకాదు, ఈ దేశంలో ముఖ్యమంత్రులందరికీ ఆయన బడేభాయ్‌ లాంటివారు. అందుకే.. మీరు పెద్దరికం చూపాలి. మీరు గుజరాత్‌కు గిఫ్ట్‌ సిటీ తెచ్చారు. సబర్మతీ రివర్‌ ఫ్రంట్‌ను ఏర్పాటు చేశారు. మా తెలంగాణకు కూడా మూసీ రివర్‌ ఫ్రంట్‌ ఇవ్వండి. మెట్రో రైలు ప్రాజెక్టుకు అభివృద్ధి కోసం ఎన్ని నిధులివ్వాల్సి ఉంటే అన్ని నిధులూ ఇచ్చి ‘బడే భాయ్‌’ అని నిరూపించుకోండి’ అని చెప్పాను. మోదీ ఎప్పూడూ 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడతారు. అది రావాలంటే దేశంలో ఐదు మెట్రోపాలిటన్‌ నగరాలు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్‌, కోల్‌కతా.. అన్నీ అభివృద్ధి చెందాలి. మోదీజీ, మీరు తెలంగాణకు అన్యాయం చేశారు. తెలంగాణకు రావల్సిన ప్రాజెక్టులన్నీ భయపెట్టి, బెదిరించి గుజరాత్‌ కు తీసుకువెళుతున్నారు. అందుకే బడేభాయ్‌ లాగా మాకు మద్దతివ్వాలని కోరాను. ప్రధానితో ఆ రోజు జరిగిన సమావేశం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాధినేతల మధ్య సమావేశం. రాజకీయ నేతల మధ్య భేటీ కాదు. కేంద్ర, రాష్ట్రాల మధ్య సత్సంబంధాలుండాలి. బీజేపీతో సైద్ధాంతిక పోరాటం చేస్తాను.
వ్యవస్థలతో పోరాడదల్చుకోలేదు.

‘రాహుల్‌ గాంధీ కేంద్రంతో రోజూ పోరాడుతూనే ఉంటారు కదా?’’

రాహుల్‌ కూడా బీజేపీతో సైద్ధాంతిక పోరాటమే చేస్తున్నారు. రాహుల్‌ ఒక రాజకీయ పార్టీ అధినేతగా మాట్లాడడం వేరు. నేను సీఎంగా మాట్లాడుతున్నప్పుడు రాష్ట్ర అవసరాలను దృష్టిలో ఉంచుకుంటాను.

‘రాహుల్‌ గాంధీ గౌతమ్‌ అదానీని జేబు దొంగ అన్నారు. సైలెంట్గా జేబులు కత్తిరిస్తారని విమర్శించారు. కానీ మీరు సీఎం కాగానే అదానీకి రూ.12,500 కోట్ల మేర ప్రాజెక్టులు ఇచ్చారు కదా?

ప్రభుత్వం నిర్మించిన రేవులు, విమానాశ్రయాలు, జాతీయ రహదారులు, నవరత్న సంస్థలను మోదీ అతి చౌకధరలకు అదానీకి కట్టబెట్టారు. మా ప్రభుత్వం అదానీ జేబులో ఉన్న డబ్బులతో తెలంగాణలో పెట్టుబడులు పెట్టించింది. రెంటికీ తేడా ఉంది. తెలంగాణ ఆస్తులేవీ అదానీకి కట్టబెట్టలేదు. విద్యుత్‌, అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో అదానీ పెట్టుబడులు పెడుతున్నారు. అదానీ అయినా, అంబానీ అయినా టాటా అయినా బిర్లా అయినా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ముందుకొస్తే తప్పకుండా ఆహ్వానిస్తాను. నేను సీఎంగా ఉన్న తెలంగాణలో అదానీని దోపిడీ చేయనివ్వను. పెట్టుబడిదారులకు నేను భరోసాగా నిలుస్తాను. గ్యారంటీ ఇస్తాను. కానీ, దోపిడీ మాత్రం చేయనివ్వను. పెట్టుబడికి లూటీకి తేడా ఉంది. మోదీ ప్రభుత్వం అన్నిటినీ చౌకగా అదానీకి కట్టబెడుతోందని రాహుల్‌ చేసిన వ్యాఖ్యలు సరైనవే.

కేజ్రీవాల్ అరెస్టు అక్రమం

కేజ్రీవాల్‌ను అక్రమంగా అరెస్టు చేశారు. అందువల్ల ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగడంలో తప్పేమీ లేదు. రెండేళ్లుగా కేసులు నడుస్తుంటే ఎన్నికల సమయంలో ఎందుకు అరెస్టు చేశారు…? ఈ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందనే భయంతోనే అరెస్ట్ చేశారు. రెండు నెలల తర్వాత అరెస్టు చేసి ఉంటే కొంప మునిగేది కాదు కదా? సాక్ష్యాధారాలుంటే రెండేళ్లుగా ఎందుకు మౌనంగా ఉన్నారు?’’ అని నిలదీశారు. ఆధారాలు లేకుంటే ఎన్నికల సమయంలో ఎందుకు అరెస్ట్ చేశారో మోడీజీ సమాధానం చెప్పాలి. అవినీతికి శిక్ష పడకూడదని నేను అనట్లేదు. కానీ ఎలా అరెస్టు చేశారో 140 కోట్ల మంది ప్రజలు చూస్తున్నారు. ఇది దేశానికి మంచిదా..?

‘వంద కోట్ల రూపాయలు మద్యం వ్యాపారుల నుంచి తీసుకుని గోవా, పంజాబ్‌ ఎన్నికల్లో ఉపయోగించారనేది కేజ్రీవాల్ మీద ఉన్న అభియోగం. అదే.. మద్యం వ్యాపారి ఎన్నికల బాండ్ల రూపంలో రూ.400-500 కోట్లు భారతీయ జనతా పార్టీకి అరెస్టయిన తర్వాత ఇచ్చారు కదా. బీజేపీ వైట్‌లో తీసుకుంది. వారు బ్లాక్‌లో తీసుకున్నారు.. రెండింటికీ తేడా ఏముంది..? దీని ప్రభావం ఎన్నికలపై తప్పకుండా ఉంటుంది. ఖచ్చితంగా ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏ పార్టీకి ఎవరు ఎంత డబ్బు ఇచ్చారనేది ప్రజలకు తెలిసిపోయింది. రూ.22,500 కోట్లు ఎన్నికల బాండ్ల రూపంలో పార్టీలు వసూలు చేస్తే నాలుగేండ్లలో రూ.6780 కోట్లు బీజేపీకి వచ్చాయి. బీజేపీకి నిధులిచ్చినవారంతా ఎవరు? వారంతా ఆకాశం నుంచి ఊడిపడలేదు కదా..!

బీజేపీకి, బీఆర్‌ఎ్‌సకు, టీఎంసీకి తేడా ఏమున్నది. బీజేపీ నీతి వాక్యాలు ఎందుకు పలుకుతోంది..? బీజేపీకి, ఇతర అవినీతి పార్టీలకూ తేడా లేదు. విద్యార్థి పరిషత్‌ కాలం నుంచీ బీజేపీని చూస్తున్నా. ప్రతి ఎన్నికల ముందు బీజేపీ ఒక ఎజెండాను ఖరారు చేస్తుంది. కానీ మొదటిసారి మోదీ నాయకత్వంలో బీజేపీ ఖరారు చేసిన ఎజెండా ప్రకారం ఎన్నికల్లోకి వెళ్లడం లేదు. మోదీ నాయకత్వంలో బీజేపీ పట్టాలు తప్పింది. 2024 ఎన్నికల్లో రామమందిరం పేరుతో ఎన్నికల్లోకి వెళ్లాలని నిర్ణయం జరిగింది. కానీ మందిర నిర్మాణం పూర్తికాగానే సోరేన్‌, కేజ్రీవాల్‌ను అరెస్టు చేశారు. ఇప్పుడు టీవీలన్నింటా రామమందిరం బదులు అరెస్టుల గురించి చర్చ జరుగుతోంది. అవినీతిపరులను వదిలిపెట్టబోనని, అందర్నీ జైలుకు పంపిస్తానని మోదీ అంటున్నారు. అలా అయితే హిమంత విశ్వ శర్మ, జ్యోతిరాదిత్య సింధియా, నవీన్‌ జిందాల్‌, అశోక్‌ చవాన్‌, అజిత్‌ పవార్‌పై కూడా కేసులు ఉన్నాయి కదా వారిని ఎందుకు జైలుకు పంపలేదు? ఈడీ కేసులున్నవారందరూ బీజేపీలో చేరిన వెంటనే మహాత్ములయ్యారా… ? వారందర్నీ పక్కన పెట్టుకుని తాను అవినీతికి వ్యతిరేకినని మోదీ అంటున్నారు. మోదీ అవినీతిపరుడని తాను అనడం లేదు. కానీ ఆయన పక్కన ఉన్నవారి సంగతేంటీ..? అవినీతిపరులను లోపలికి పంపిస్తానని మోదీ అంటే బీజేపీలోకి పంపించడమా..!

కాంగ్రెస్ మేనిఫెస్టో ముస్లిం లీగ్ మేనిఫెస్టోలాగా ఉంది.. అని మోడీ విమర్శిస్తున్నారు

ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు ఈ దేశంలో భాగస్వాములా కాదా.. అని మోడీని ప్రశ్నిస్తున్నా. ఇండియన్ పీనల్ కోడ్ అందరికీ వర్తిస్తుంది. కానీ.. యూనిఫామ్ సివిల్ కోడ్ ఆచరణ సాధ్యం కాదు. ఒక్కో ప్రాంతం, ఒక్కో జాతిలో ఆచార వ్యవహారాల్లో తేడాలున్నాయి.

అయోధ్య రామమందిరం

మొదటిసారి రాజీవ్గాంధీ హయాంలోనే అయోధ్యలో శిలాన్యాస్ పూజలు మొదలయ్యాయి. ఇప్పుడు మోడీజీకి అందులో ఇచ్చింది.. తెచ్చిందేంటీ ..? నేను సీఎం అయ్యాక భద్రాద్రి రామాలయానికి వెళ్లాను. అక్కడికెందుకు మోడీజీ రాలేదు. నేను హిందువునని గర్వంగా చెప్పుకుంటాను. అలాగని ముస్లింలను, సిక్కులను వ్యతిరేకించను. అన్ని మతాలను గౌరవిస్తాను. ముఖ్యమంత్రి హోదాలో లౌకికత్వానికి కట్టుబడి ఉంటాను.

‘మరి బీఆర్‌ ఎస్‌ నేతల్ని మీ పార్టీలో చేర్చుకుంటున్నారు కదా? మీరు కూడా వాషింగ్‌ మెషీన్‌ వాడుతున్నారా?’’
మేమింకా వాషింగ్‌ మెషీన్‌ కొనుక్కోలేదు.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com