అది రాజ్యాంగంపై దాడి చేయడమే అవుతుంది.
యూనివర్సిటీలపై ఆధిపత్యం చెలాయించేందుకు కుట్ర
విద్యా హక్కును దూరం చేసే హక్కు ఎవరికీ లేదు
నిర్లక్ష్యానికి గురైన విద్యా వ్యవస్థను గాడిలో పెడుతున్నాం..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
బిఆర్‌ఎఓయులో అంబేడ్కర్ విగ్రహావిష్కరణ
విద్యా హక్కును దూరం చేసే హక్కు పాలకులకు ఎవరూ ఇవ్వలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నిర్లక్ష్యానికి గురవుతున్న విద్యావ్యవస్థను గాడిన పెట్టేందుకు తమ ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటోందని సీఎం అన్నారు. ఆదివారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో అంబేడ్కర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. అలాగే విశ్వవిద్యాలయ ఆవరణలో మొక్కను నాటారు. అనంతరం స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్, డిజిటల్ రిసోర్స్ సెంటర్, సెంట్రల్ ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎసెన్షియల్ స్టాఫ్ క్వార్టర్స్ కు శంకుస్థాపన చేశారు.
ఈసందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో మళ్లీ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలనే చర్చ జరగడం దురదృష్టకరమని అన్నారు. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ కేవలం సర్టిఫికెట్ల కోసం మాత్రమే కాదని, సామాజిక బాధ్యతగా ఆనాడు పీవీ నరసింహారావు ఈ యూనివర్సిటీని ముందుకు తీసుకెళ్లారని చెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా యూనివర్సిటీలను బలోపేతం చేసేందుకు వీసీలను నియమించామని తెలిపారు. వందేళ్ల తరువాత ఉస్మానియా యూనివర్సిటీకి దళిత సామాజిక వర్గానికి చెందిన విద్యావేత్తను వీసీగా నియమించామని, యూనివర్సిటీల్లో టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టాలని వీసీలను ఆదేశించామని తెలిపారు.
తెలంగాణ సమాజానికి చికిత్స అందించాల్సిన బాధ్యత యూనివర్సిటీ వీసీలపై ఉందన్నారు.
పదేళ్లకు అవసరమైన ప్రణాళికలు సిద్దం చేయండి.. అమలు చేసే బాధ్యత మేం తీసుకుంటాం. యూనివర్సిటీలను ప్రైవేటీకరణ చేయాలన్న ఆలోచన మంచిది కాదు. రాష్ట్రంలో యూనివర్సిటీల పునర్నిర్మాణం జరగాలి. దేశానికి పీవీ నర్సింహారావు, జైపాల్ రెడ్డి లాంటి వారిని అందించిన ఘనత యూనివర్సిటీలదే.. రంగుల గోడలు అద్దాల మేడలు అభివృద్ధి కాదని బాబా సాహెబ్ అంబేడ్కర్ చెప్పారు. చిట్టచివరి పేదల వరకు సంక్షేమ ఫలాలు అందాలన్న అంబేద్కర్ ఆశయంతో మా ప్రభుత్వం పనిచేస్తుంది. యూజీసీ నిబంధనలు మార్చి రాష్ట్రాల పరిధి నుంచి యూనివర్సిటీలపై అధికారాలను తప్పించాలని కుట్రలు చేస్తున్నారు. విశ్వవిద్యాలయాలపై ఆధిపత్యం చెలాయించాలనే ఆలోచన వెనక ఒక పెద్ద కుట్ర ఉంది. యూనివర్సిటీలపై ఆధిపత్యం కేంద్రం చేతుల్లోకి వెళితే కొంతమంది చేసే విష ప్రచారానికి యూనివర్సిటీలు వేదికలు కాబోతున్నాయి.
ప్రధాని మోదీకి ఈ వేదికగా విజ్ఞప్తి చేస్తున్నా మీరు యూజీసీ నిబంధనలు మార్చా లనుకోవడం రాజ్యాంగంపై దాడి చేయడమే అవుతుంది అని అన్నారు. ఇలాంటి చర్యలు కేంద్ర ప్రభుత్వానికి మంచిది కాదని, ఇది అనవసర వివాదాలకు దారితీస్తుందని తెలిపారు. రాష్ట్రాల అధికారాన్ని కేంద్రం గుంజుకోవడం తమపై దాడిగానే భావిస్తామని, తమ హక్కులను వదులుకోవడానికి మేం సిద్ధంగా లేమని స్పష్టం చేశారు. యూజీసీ నిబంధనల మార్పు నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు. అలా చేయకపోతే అవసరమైతే నిరసనలకు వెనకాడబోమని స్పష్టం చేశారు. రాష్ట్రాల అధికారాలను ఒక్కొక్కటిగా కేంద్రం తీసుకుంటూ వెళితే..రాష్ట్రాలు కేవలం పన్నుల వసూలు చేసే సంస్థలుగా మిగలాల్సి వొస్తుందని, రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలగకుండా మేధావులు ఆలోచన చేయాలని, పద్మ అవార్డుల విషయంలోనూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేసిందని,గద్దర్, చుక్కా రామయ్య, అందెశ్రీ, గోరటి వెంకన్న, జయధీర్ తిరుమలరావు లాంటి వారిని గుర్తించకపోవడం దారుణమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. త్వరలోనే ఈ విషయంపై ప్రధానికి లేఖ రాస్తామని తెలిపారు.