Monday, November 18, 2024

రాష్ట్రానికి ప్ర‌యోజ‌నం క‌లిగించేలా అలైన్‌మెంట్ ఉండాలి

  • రేడియ‌ల్ రోడ్ల‌కు భూ స‌మీక‌ర‌ణ వేగ‌వంతం చేయండి
  • డ్రై పోర్ట్.. బంద‌రు-కాకినాడ పోర్టుల అనుసంధానంపై అధ్య‌య‌నం చేయండి
  • అట‌వీ ప్రాంతాల్లో నైట్ సఫారీల‌కు కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక రూపొందించండి
  • ఆర్ఆర్ఆర్ ద‌క్షిణ భాగం స‌మీక్ష‌లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి

రీజిన‌ల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్‌) ద‌క్షిణ భాగం అలైన్‌మెంట్ తెలంగాణ రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను ప‌రిర‌క్షించే విధంగా ఉండాల‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నూత‌నంగా ఏర్ప‌డ‌నున్న ఫోర్త్ సిటీలో నెల‌కొల్ప‌నున్న ప‌రిశ్ర‌మ‌లు, వాటిలో ప‌ని చేసే అధికారులు, సిబ్బందికి వారి కుటుంబాల‌కు విద్యా, వైద్య‌, ఇత‌ర వ‌సతులు అందుబాటులో ఉండేలా అలైన్‌మెంట్ ఉండాల‌ని సూచించారు. జూబ్లీహిల్స్‌లోని త‌న నివాసంలో ఆర్ఆర్ఆర్ ద‌క్షిణ భాగం, రేడియ‌ల్ రోడ్ల నిర్మాణం, డ్రైపోర్ట్‌ను సీ పోర్ట్‌కు అనుసంధానించే గ్రీన్ ఫీల్డ్ ర‌హ‌దారిపై ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి బుధ‌వారం సాయంత్రం సుదీర్ఘ స‌మీక్ష నిర్వ‌హించారు.

గ‌త వారం జ‌రిగిన స‌మీక్ష‌లో ఆర్ఆర్ఆర్ ద‌క్షిణ భాగం అలైన్‌మెంట్‌లో ముఖ్య‌మంత్రి ప‌లు మార్పులు సూచించారు. దానికి అనుగుణంగా అధికారులు అలైన్‌మెంట్‌లో కొన్ని మార్పులు చేశారు. అందులో కొన్ని తేడాలు ఉండ‌డంతో మ‌రిన్ని మార్పుల‌ను ముఖ్య‌మంత్రి సూచించారు. ఆ మార్పుల‌కు అనుగుణంగా అలైన్‌మెంట్ మార్చాల‌ని… అది ఫైన‌ల్ అయిపోతే త‌ర్వాత కార్యాచ‌ర‌ణ వెంట‌నే చేప‌ట్టాల‌ని ముఖ్యమంత్రి అధికారుల‌ను ఆదేశించారు.

సానుభూతితో వ్య‌వ‌హ‌రించండి..

ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ వ‌ర‌కు నిర్మించ‌నున్న రేడియ‌ల్ రోడ్ల ప్ర‌గ‌తిపైనా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స‌మీక్షించారు. ప్ర‌తిపాదిత రేడియ‌ల్ రోడ్ల ప్రాంతంలో ముందుగానే భూ స‌మీక‌ర‌ణ, భూ సేక‌ర‌ణ‌ చేయాల‌ని ముఖ్య‌మంత్రి సూచించారు. ఏ ర‌హ‌దారులు, ఇత‌ర అభివృద్ధి ప‌నుల‌కు భూ సేక‌ర‌ణ చేసేట‌ప్పుడు మాన‌వీయ కోణంతో ఆలోచించాల‌ని, భూ నిర్వాసితుల‌తో సానుభూతితో వ్య‌వ‌హ‌రించాల‌ని ముఖ్య‌మంత్రి సూచించారు. సాధ్య‌మైనంత ఎక్కువ ప‌రిహారం ఇవ్వ‌డంతో పాటు ప్ర‌భుత్వ ప‌రంగా అద‌నంగా ఏవిధ‌మైన స‌హాయం చేయ‌గ‌ల‌మో చూసి అలా చేయాల‌న్నారు.

డ్రైపోర్ట్ నిర్మాణం విష‌యంలో మ‌చిలీప‌ట్నం, కాకినాడ రేవుల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల‌ని, దూరంతో పాటు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఏ మార్గానికి సుముఖంగా ఉంది, తెలంగాణ ప్ర‌యోజ‌నాల‌కు ఏరకంగా మేలు జ‌రుగుతుంద‌నే విష‌యం ప్రాధాన్య‌త‌లోకి తీసుకోవాల‌ని ముఖ్య‌మంత్రి సూచించారు. ఇవ‌న్నీ అధ్య‌య‌నం చేశాకే గ్రీన్ ఫీల్డ్ హైవేకు రూప‌క‌ల్ప‌న చేయాల‌ని ముఖ్య‌మంత్రి ఆదేశించారు. ఈ సంద‌ర్భంగా ఇన్‌ల్యాండ్ వాట‌ర్ వేస్ అంశం స‌మావేశంలో చ‌ర్చ‌కు వ‌చ్చింది. రైలు, జల మార్గంతో కూడిన ఇన్‌ల్యాండ్ వాట‌ర్ వే ల‌కు కేంద్రం ప్రాధాన్యం ఇస్తోంద‌ని అధికారులు తెల‌ప‌గా.. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో ఎక్క‌డైనా అలాంటిది ఉందా…? స‌క్సెస్ రేట్ ఎలా ఉంది.. ప్ర‌తిపాద‌న‌లేనా… వాస్త‌వ రూపం దాల్చే అవ‌కాశం ఉందా అనే దానిపై అధ్య‌య‌నం చేసి సాధ్య‌మైనంత త్వ‌ర‌గా త‌న‌కు నివేదిక స‌మ‌ర్పించాల‌ని ముఖ్య‌మంత్రి అధికారుల‌ను ఆదేశించారు.

ఓఆర్ఆర్ -ఆర్ఆర్ఆర్ మ‌ధ్య రావిర్యాల నుంచి అమ‌న్‌గ‌ల్ వ‌ర‌కు నిర్మించ‌నున్న ర‌హ‌దారిలో మూడు చోట్ల ఉన్న అట‌వీ ప్రాంతాల‌ను నైట్ స‌ఫారీలుగా మార్చే అంశంపై కార్యాచ‌ర‌ణ రూపొందించాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధికారుల‌కు సూచించారు. అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం, న‌గ‌రం, అట‌వీ ప్రాంతం స‌మీపంలోనే ఉండ‌డం అరుద‌ని, ఈ అరుదైన అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయ‌ప‌డ్డారు. బెంగ‌ళూర్‌లో జిందాల్ నేచ‌ర్ కేర్ పెట్టార‌ని, మ‌న‌కు ఉన్న అట‌వీ ప్రాంతం, అనుకూల‌త‌లు తెలియ‌జేస్తే అటువంటివి ఎన్నో వ‌స్తాయ‌ని ముఖ్య‌మంత్రి అన్నారు. ఫోర్త్ సిటీలోని ప‌రిశ్ర‌మ‌ల‌కు అట‌వీ ప్రాంతాల‌ను అనుసంధానిస్తే అభివృద్ధి చేసే అవ‌కాశం ఉంటుందంటూ అమెరికాలో యాపిల్ ప‌రిశ్ర‌మ అక్క‌డ యాపిల్ తోట‌లోనే ఉన్న అంశాన్ని ముఖ్య‌మంత్రి ప్ర‌స్తావించారు. ఈ సంద‌ర్బంగా రాచ‌కొండ ప‌రిధిలోని లోయ‌లు… ప్ర‌కృతి సౌంద‌ర్యం సినీ ప‌రిశ్ర‌మ‌ను ఆక‌ర్షించ‌డానికి ఉన్న అవ‌కాశాల‌ను ముఖ్య‌మంత్రి వివ‌రించారు.

ఆర్ఆర్ఆర్‌, రేడియ‌ల్ రోడ్లు, ఫోర్త్ సిటీలో ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుకు అవ‌స‌ర‌మైన భూ స‌మీక‌ర‌ణ‌, భూ సేక‌ర‌ణ విష‌యంలో అన్ని శాఖ‌ల అధికారులు క‌లిసి ప‌ని చేయాల‌ని, ఫ‌లితాలే ల‌క్ష్యంగా ప‌ని తీరు ఉండాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్ర‌తి స‌మీక్ష‌కు ప్ర‌గ‌తి క‌న‌ప‌డాల‌ని అలా లేకుంటే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవ‌డానికి వెనుకాడ‌న‌ని ముఖ్య‌మంత్రి హెచ్చ‌రించారు. స‌మీక్ష‌లో రాష్ట్ర ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి, ముఖ్య‌మంత్రి స‌ల‌హాదారు వేం న‌రేందర్ రెడ్డి, రాష్ట్ర ప్ర‌భుత్వ స‌ల‌హాదారు (ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్‌) శ్రీ‌నివాస‌రాజు, ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారి, ఆర్ అండ్ బీ ప్ర‌త్యేక ముఖ్య కార్య‌ద‌ర్శి వికాస్ రాజ్‌, రెవెన్యూ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ న‌వీన్ మిట్ట‌ల్‌, హెచ్ఎండీఏ మెట్రోపాలిట‌న్ క‌మిష‌న‌ర్ స‌ర్ఫ‌రాజ్ అహ్మ‌ద్‌, ఆర్ అండ్ బీ స్పెష‌ల్ సెక్ర‌ట‌రీ దాస‌రి హ‌రిచంద‌న‌, పీసీసీఎఫ్ డొబ్రియ‌ల్‌, టీజీఐసీసీ ఎండీ విష్ణువ‌ర్ద‌న్ రెడ్డి, ముఖ్య‌మంత్రి ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శి అజిత్ రెడ్డి, ముఖ్య‌మంత్రి కార్య‌ద‌ర్శి షాన‌వాజ్ ఖాసీం త‌దిత‌రులు పాల్గొన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular