- రాహుల్ గాంధీ, ఖర్గే నేతృత్వంలో రైతులకు ఇచ్చిన పెద్ద గ్యారంటీని అమలు చేశాం
- కేంద్రం పేదలకు, నిరుద్యోగులకు ఏమీ చేయలేదు
- ఫుణే ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
రాష్ట్రంలో రైతు రుణమాఫీపై దమ్ముంటే కేంద్ర ప్రభుత్వం తరపున ఓ కమిటీ వేసి తెలంగాణకు పంపించాలని ప్రధాని నరేంద్ర మోడీ, బిజెపికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. రాష్ట్రానికి వచ్చేందుకు మీ దగ్గర డబ్బులు లేకపోతే తానే ప్రత్యేక విమానం ఏర్పాటు చేస్తానని సిఎం రేవంత్ చాలెంజ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బిజెపి చేస్తున్న విమర్శలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు.
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఉన్న సిఎం రేవంత్‌రెడ్డి సోమవారం పుణేలో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో తాము రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి చేసి చూపించామన్నారు. 25 రోజుల్లో రూ.18 వేల కోట్లతో 23 లక్షల మంది రైతులకు రుణవిముక్తి కల్పించామన్నారు. కేంద్ర కమిటీ రాష్ట్రానికి వస్తే దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇస్తామన్నారు. రాహుల్ గాంధీ, ఖర్గే నేతృత్వంలో రైతులకు ఇచ్చిన అతి పెద్ద గ్యారంటీ రుణమాఫీని అమలు చేశామన్నారు. బిజెపి ప్రభుత్వం రైతులు, పేదలు, నిరుద్యోగుల కోసం ఏమీ చేయలేదని, ఇన్ని వైఫల్యాలు వారి వైపు ఉన్నప్పటికీ ప్రధాని మోడీ తమ గ్యారంటీల గురించి మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు, మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణం కల్పిస్తున్నామన్నారు. సన్న రకం వరిపై ఎంఎస్పీ మీద రూ.500 బోనస్‌ను రైతులకు ఇస్తున్నామన్నారు.
11 ఏళ్లలో మోడీకి సక్సెస్ స్టోరీ లేదు
రాజకీయాల్లో నష్టం వచ్చినా వెనకడుగు వేసే ప్రసక్తే లేదని, ఆరు నూరైనా హామీలన్నీ అమలు చేసి తీరుతామన్నారు. ప్రధాని మోడీకి ఈ 11 ఏళ్లలో ఎలాంటి సక్సెస్ స్టోరీ లేదని, మహారాష్ట్రలో కోవర్ట్ అపరేషన్ పాలిటిక్స్ నడిపారని ఆయన ధ్వజమెత్తారు. మహారాష్ట్ర సిఎం ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్, అశోక్ చౌహాన్ వారి పార్టీలకు వెన్నుపోటు పొడిచి మోడీకి గులాములుగా మారి ముంబయిని లూటీ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం వేళ పిఎం మోడీ విదేశీ పర్యటనకు వెళ్లడం ఈ ఎన్నికల్లో బిజెపి ఓటమిని అంగీకరించిందని ఆయన విమర్శించారు.