బెటాలియన్ పోలీసుల ఆందోళనలతో తెలంగాణ పోలీస్ శాఖ అప్రమత్తమైంది. జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసం వద్ద భద్రత సిబ్బందిని మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు సిఎం ఇంటివద్ద విధులు నిర్వహించిన బెటాలియన్ పోలీస్ సిబ్బందిని సిఎం సెక్యూరిటీ వింగ్‌కు మార్చింది. ఇంటిదగ్గర ఆర్మ్‌డ్ రిజర్వ్ పోలీసులను నియమించింది. ఈ మార్పులను సోమవారం నుంచే అమలు చేసింది.
కాగా, కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా బెటాలియన్ పోలీసులు ఆందోళనలు చేస్తున్నారు. కర్ణాటక, తమిళనాడు తరహాలోనే తెలంగాణలో కూడా ఒకే పోలీస్ విధానం అమలు చేయాలని ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. ఇప్పటికే సెలవుల విషయంలో వెనక్కి తగ్గినట్లు పోలీస్ శాఖ ప్రకటన విడుదల చేసినా ఆందోళనలు మాత్రం ఆగడం లేదు. దీంతో సిఎం రేవంత్ ఇంటివద్ద విధులు నిర్వహిస్తున్న బెటాలియన్ పోలీసులను మారుస్తూ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది