తక్షణమే మెస్ బిల్లులు, కాస్మోటిక్ బిల్లులు విడుదల చేయాలి
సస్పెండ్ చేయాల్సి వొస్తే సిఎంనే ముందు చేయాలి
31దావత్‌లు బంద్‌జేసి హాస్టల్స్‌ను దత్తత తీసుకోవాలి
యువతకు ఎమ్మెల్యే హరీష్‌రావు పిలుపు
సిద్ధిపేట`నాసరపుర రెసిడెన్షియల్ బ్రిడ్జ్ స్కూల్ విద్యార్థులకు సాయం
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా అసెంబ్లీలో చెప్పిన మాటలు అమలు కాకపోతే ఎలా అని మాజీమంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో చెప్పినట్లుగా వెంటనే మెస్ బిల్లులు, కాస్మోటిక్ బిల్లులను విడుదల చేయాని హరీష్‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం సిద్ధిపేటలోని నాసరపుర కేంద్రంలోని రెసిడెన్షియల్ బ్రిడ్జ్ స్కూల్ విద్యార్థులకు స్వెటర్లు, దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో హరీష్‌రావు మాట్లాడుతూ..గత 4 నెలల నుంచి మెస్ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. అసెంబ్లీలో సిఎం రేవంత్ రెడ్డి గ్రీన్ ఛానల్‌తో రాష్ట్రంలో ఒక్క రూపాయి బిల్లు పెండింగ్ లేదని శాసన సభ సాక్షిగా చెప్పారని, ఉద్యోగులకు జీతం ఆగొచ్చు కానీ, మెస్ బిల్లులు మాత్రం అగవు అన్న సిఎం రేవంత్‌రెడ్డి మాట ఏమైందని నిలదీశారు. నెలల తరబడిగా మెస్ బిల్లులు పెండింగ్‌లో ఉండటమేనా గ్రీన్ చాలెంజ్ అని అన్నారు. ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నా… చేతలు గడప దాటడం లేదని మండిపడ్డారు.
రేవంత్‌రెడ్డి మాటల ముఖ్యమంత్రి తప్ప చేతల ముఖ్యమంత్రి కాదన్నారు. రేవంత్‌రెడ్డి పరిపాలన మీద పూర్తిగా పట్టు కోల్పోయాడనీ, ఈ ప్రభుత్వం అన్నింటిలోనూ ఫెయిల్ అయినట్లు అనిపిస్తుందన్నారు. చలికాలంలో విద్యార్థుల (ఆడపిల్లలు, మగపిల్లలు)కు వేడి నీళ్లు రాక, దుప్పట్లు లేక ఇబ్బంది పడుతున్నారని.. ఈసారి ప్రభుత్వం దుప్పట్లు ఇవ్వలేదనీ, ఎన్నికల్లో చెప్పిన ఆరు గ్యారెంటీలనూ ఈ ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు. మహాలక్ష్మీ, తులం బంగారం ఎటు పొయాయనీ నిలదీశారు. ముఖ్యమంత్రి మాటలు అధికారులు వినడం లేదా? లేక ముఖ్యమంత్రి ఉత్త మాటలు చెప్పానని అధికారులకు చెబుతున్నారా? ముఖ్యమంత్రి అంటే అధికారులకు భయం లేదా? విలువ లేదా? గౌరవం లేదా? తక్షణమే అన్నిచోట్ల మెస్ ఛార్జీలు వెంటనే విడుదల చేయాలని హరీష్‌రావు ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. అన్ని శాఖలు మీ దగ్గర పెట్టుకొని ఎందుకు రివ్యూ చేయడం లేదనీ, దిల్లీ పైసలు ఇచ్చినా గల్లీ విడుదల చేయడం లేదనీ ఆగ్రహం వ్యక్తం చేశారు. 1300రూపాయలు పెంచిన మెస్ ఛార్జీలు ఇప్పటికీ అమలు కాలేదనీ, అర్బన్ రెసిడెన్షియల్‌లో 1050రూపాయలు మెస్ ఛార్జీలు ఇస్తున్నారన్నారు. 1 నుండి 7 తరగతి వరకు 1300, 8వ తరగతికి 1500రూపాయల మెస్ ఛార్జీలు ఇవ్వాలన్నారు.
కాస్మోటిక్ ఛార్జీలు ఇంకా 100 రూపాయలు ఇస్తున్నారనీ, 150 రూపాయలు ఇవ్వాలనీ ఇవీ గత 4నెలల నుండి పెండిరగ్‌లో ఉన్నాయన్నారు. తల్లిదండ్రులు లేని రెసిడెన్షియల్ స్కూల్స్‌లో ప్రభుత్వం మరింత బాధ్యత ఉండాలన్నారు. విద్యా శాఖ మంత్రి లేడనీ, విద్యా శాఖ సిఎం రేవంత్‌రెడ్డి దగ్గరనే ఉందనీ, సాంఘిక, గిరిజన, మైనారిటీ అన్ని శాఖలు సిఎం దగ్గరనే ఉన్నాయన్నారు. ఈ అర్బన్ రెసిడెన్షియల్ సిఎం దగ్గర ఉన్న విద్యా శాఖకు వొస్తుందనీ, సర్వ శిక్ష అభియాన్ కింద వొస్తుందన్నారు. ఏ విషయంలో కుడా సిఎం రేవంత్‌రెడ్డి మాట నిలుపుకోలేదనీ, చెప్పిన మాటకు క్షేత్ర స్థాయిలో పొంతన లేదనీ, అసెంబ్లీలో చెప్పిన మాటకు తక్షణమే మెస్ బిల్లులు, కాస్మోటిక్ బిల్లులు విడుదల చేయాలన్నారు.
1వ తేదీన జీతాలు అని గొప్పలు చెప్పిన సిఎం రేవంత్‌రెడ్డి… 10వ తారీకు వరకు జీతాలు వేయడం లేదనీ, సస్పెండ్ చేయాల్సి వొస్తే సిఎంనే సస్పెండ్ చేయాలన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో యువత ముందుకొచ్చి హాస్టళ్లను దత్తత చేసుకుని పిల్లలకు సేవ చేయాలన్నారు. పిల్లలకు సేవ చేస్తే భగవంతునికి సేవ చేసినట్టేననీ, మానవ సేవయే మాదవసేవ అని, యువత 31దావత్‌లు బంద్‌జేసి హాస్టల్స్‌ను దత్తత తీసుకోవాలని రాష్ట్రంలోని యూత్‌కు, యువజన సంఘాలకు హరీష్‌రావు పిలుపునిచ్చారు. నాసరపుర కేంద్రంలోని బ్రిడ్జ్ స్కూల్‌లో ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పవనసుత యూత్‌ను అభినందిస్తూ..ఇదే స్ఫూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా యువత ముందుకు రావాలని ఎమ్మెల్యే హరీష్‌రావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు జంగిటి కనకరాజు, కడవేర్గు రాజనర్సు, పాల సాయిరాం, గుండు భూపేష్, కాముని నగేష్ పవనసుత యూత్ ప్రతినిధులు పాల్గొన్నారు.