చిరంజీవి టాలీవుడ్ టాప్ హీరో ఈ పేరు వినగానే ముందుగా అందరికీ గుర్తు వచ్చేది. కష్టం..స్వయంకృషి.. ఇవే కనుక లేకపోతే ఆయేన ఈ రోజు ఆ రేంజ్‌లో ఉండేవారు కాదు. ఇక ఈ విషయం తెలియనివారు లేరు. ప్రస్తుతం తన జీవితంలో స్థిరపడిపోయి ఎంతో సంపాదించారు. అయినప్పటికీ… ఆయన ఎంతో పొదుపుగానే వ్యవహరిస్తుంటారు. మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన ఆయన… తన మూలాలను మరిచిపోకుండా తన జీవితాన్ని గడుపుతున్నారు. తాజాగా నిన్న హైదరాబాద్ లో జరిగిన తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ కార్యక్రమంలో చిరంజీవి, విజయ్ దేవరకొండ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరంజీవిని విజయ్ ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.
పొదుపు చేయడం చాలా అవసరం అని ఈ సందర్భంగా చిరంజీవి తెలిపారు. తన కుటుంబ సభ్యులు ఇంట్లో లైట్లన్నీ ఆన్ లోనే ఉంచి వెళ్లిపోతుంటారని… వాటిని తాను ఆఫ్ చేస్తానని చెప్పారు. బాత్రూమ్ లో గీజర్ ఆన్ లో ఉంచి మర్చిపోతుంటారని తెలిపారు. చరణ్ ఉదయాన్నే బ్యాంకాక్ వెళ్లాడని… తన ఫ్లోర్ లో లైట్స్ అన్నీ ఆన్ లోనే ఉన్నాయని, వాటిని తాను ఆఫ్ చేశానని చెప్పారు. సబ్బు అరిగిపోయాక చిన్నచిన్న ముక్కలను అతికించి వాడుతుంటానని తెలిపారు. షాంపూ అయిపోతే ఆ బాటిల్ లో నీళ్లు పోసి వాడుతుంటానని చెప్పారు.
తాను కామిక్ చిత్రాలు, జాకీ చాన్ చిత్రాలు, మనసుకు ఆహ్లాదాన్ని అనిపించే చిత్రాలనే చూస్తానని చిరంజీవి తెలిపారు. జీవితం ఎప్పుడూ సులభంగా ఉండదని చెప్పారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు, కష్టనష్టాలు ఉంటాయని తెలిపారు. తాను కూడా అన్నింటినీ తట్టుకుని ఇక్కడి వరకు వచ్చానని చెప్పారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఎదిగానని తెలిపారు. అలా కష్టపడ్డారు కాబట్టే ఈరోజు నెం1 స్థానంలో ఆయన నిలిచారని చాలా మంది చిరంజీవిని ఇన్స్‌పిరేషన్‌గా తీసుకుని సినిమాల్లోకి వచ్చిన వారు ఉన్నారు.