Thursday, November 28, 2024

రాష్ట్రవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించాలి

* ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యే వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేయాలి
* సీఎం హాజరయ్యే వేడుకలకు అన్ని చర్చిల అధిపతులను ఆహ్వానించండి
* 95 అసెంబ్లీ నియోజకవర్గాలు, జిహెచ్‌ఎంసి పరిధిలో 200 ప్రాంతాల్లో క్రిస్మస్ వేడుకల నిర్వహణ
* క్రిస్మస్ సెలబ్రేషన్ కమిటీ సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ప్రజా ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అధికారులను ఆదేశించారు. క్రిస్మస్ వేడుకల నిర్వహణపై బుధవారం ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సెలెబ్రేషన్ కమిటీ సభ్యులు, ఉన్నత అధికారులతో సమీక్షించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రెండు వందల ప్రాంతాలు, 95 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిర్వహించే క్రిస్మస్ వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. క్రిస్మస్ వేడుకలు నిర్వహణ సందర్భంగా జిహెచ్‌ఎంసి తో పాటు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కమిటీలు వేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎల్ బి స్టేడియంలో జరిగే క్రిస్మస్ వేడుకలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని అధికారులను ఆదేశించారు. సీఎం హాజరవుతున్న వేడుకలకు రాష్ట్రంలో ఉన్న అన్ని చర్చిల అధిపతులు పాల్గొనే విధంగా చూడాలన్నారు. అన్ని చర్చిల అధిపతులకు, క్రైస్తవ మత పెద్దలకు క్రిస్మస్ వేడుకల ఆహ్వానాలను అందజేయాలని క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్ కు సూచించారు.

సోషల్ వర్క్, మెడికల్, ఎడ్యుకేషన్, లిటరరీ, స్పోర్ట్, ఫైన్ ఆర్ట్ రంగాల్లో అవార్డులకు ఎంపికైన వారికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చేతుల మీదుగా లక్ష రూపాయలు, అలాగే సోషల్ వర్క్, మెడికల్, ఎడ్యుకేషన్ అవార్డులకు ఎంపికైన సంస్థలకు రెండు లక్షల రూపాయల చెక్కులను అందిస్తామన్నారు. అవార్డులకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రధాన పత్రికల్లో నోటిఫికేషన్ వేయాలని క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ సబితను ఆదేశించారు. క్రిస్మస్ వేడుకల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యే విందుకు ఎలాంటి లోటు పాట్లు లేకుండా చూడాలన్నారు. క్రిస్మస్ వేడుకలను అధికారులు సమన్వయంతో ఘనంగా నిర్వహించాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, తెలంగాణ క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సి.వి ఆనంద్, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి తఫ్సీర్ ఎక్బాల్, జీ.ఏ.డి డైరెక్టర్ ఎస్. వెంకట్రావు, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కాంతి వెస్లీ, మాజీ ఎమ్మెల్యే క్రిస్టినా లాజరస్, తెలంగాణ క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ సబిత, భువనగిరి డి.సి.పి రాజేష్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తాం అన్న కేటీఆర్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular