గద్దర్ అవార్డుల జ్యూరీ సమావేశంలో డిప్యూటీ సీఎం
గద్దర్ సినిమా అవార్డుల ఫంక్షన్ కార్యక్రమాన్ని నభూతో నా భవిష్యత్తు అన్నట్టుగా జరపాలని, అందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భరోసా ఇచ్చారు. మంగళవారం ఎల్వీ ప్రసాద్ సినీ ల్యాబ్ లో నిర్వహించిన గద్దర్ అవార్డుల జ్యూరీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రపంచ స్థాయిలో సినిమా అవార్డుల ఫంక్షన్ ఏ విధంగా నిర్వహిస్తారో అందుకు ఏమాత్రం తగ్గకుండా గద్దర్ సినిమా అవార్డుల కార్యక్రమం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. హైదరాబాదులో నిర్వహించబోయే గద్దర్ చలనచిత్ర అవార్డుల ఫంక్షన్ గురించి ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుకునేలా కార్యక్రమాన్ని నిర్వహించాలని కమిటీ సభ్యులు, అధికారులకు డిప్యూటీ సీఎం సూచించారు. గత పది సంవత్సరాలు రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ నిరాదరణకు గురైందని, 2011లో చలనచిత్ర అవార్డుల పంపిణీ కార్యక్రమం నిలిచిపోయి ప్రోత్సాహం కరువైందని అన్నారు. కాగా, తెలంగాణ రాష్ట్రంలో గద్దర్ పుట్టడం మన అదృష్టం అని, దశాబ్దానికి ఒకరు అలాంటి మహానుభావులు పుడతారు అని కీర్తించారు. తెలంగాణ సంస్కృతి, గుండె చప్పుడును విశ్వవ్యాప్తం చేసిన మహానుభావుడు గద్దర్ అని కొనియాడారు. తెలంగాణ సంస్కృతి భావజాలాన్ని రాష్ట్రానికి దేశానికి ప్రపంచానికి స్పష్టమైన మార్గంలో గద్దర్ ప్రచారం చేశారని వివరించారు. ఆయన బానిని చిన్నపిల్లలు నుంచి ముసలి వాడి వరకు అనుకరించారని తెలిపారు. సింగరేణి ప్రాంతంలో తెలంగాణ రాష్ట్ర సాధన డిమాండ్‌తో గద్దర్ పాదయాత్ర చేసి ప్రత్యేక రాష్ట్రానికి నాంది పలికారని వివరించారు. ఎక్కడో ఉన్న చిత్ర పరిశ్రమను కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్‌కు తరలించి ప్రోత్సహించిందని అన్నారు. చిత్ర పరిశ్రమను తరలించి ప్రోత్సాహకాలు అందించడమే కాదు, సినీ పరిశ్రమ లో పనిచేసే వారికి ఇళ్ల స్థలాలను సైతం కేటాయించామని అన్నారు. సమాజంలో అభివృద్ధి, విలువలను ప్రోత్సహించేది మీడియానే, మీడియాను కాపాడుకునే బాధ్యత పాలకులపై ఉంది అన్నారు. ప్రజల జీవన ప్రమాణాల పెరుగుదలకు బాధ్యత గల ప్రభుత్వాలు బలమైన సినిమా రంగం ద్వారానే సమాజానికి సందేశం ఇవ్వాలని, ముఖ్యమంత్రితో పాటు యావత్ క్యాబినెట్ నిర్ణయించి దశబ్ద కాలంగా ప్రోత్సాహకానికి నోచుకోని సినీ రంగానికి చేయూతనివ్వాలని సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.