- ‘కమర్షియల్’ ట్యాక్స్ శాఖను ప్రక్షాళన చేయండి
- ప్రధాని, కేంద్ర హోంమంత్రికి, సిఎం రేవంత్‌లకు ఫిర్యాదు
- ఫిర్యాదులపై ఆరా సిఎంఓ, కేంద్రం
కమర్షియల్ ట్యాక్స్‌లోని పనిచేసే పలువురు అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపిస్తూ కొందరు ప్రధాని మోడీకి, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, సిఎం రేవంత్‌రెడ్డికి, తెలంగాణ విజిలెన్స్ కమిషన్‌కు, ఏసిబి డిజికి, ఇన్‌కంట్యాక్స్ డిపార్ట్‌మెంట్ హెడ్‌కు, సిఎంఓ అధికారులకు, డిజిపికి, కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్‌కు ‘తెలంగాణజిఎస్టీ7@జిమెయిల్ ’తో ఫిర్యాదు చేశారు. సుమారుగా 10 నుంచి 15 మంది అధికారులపై వారు ఫిర్యాదు చేయడం విశేషం. గతంలో ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా, సిఎస్‌గా పనిచేసిన సోమేష్‌కుమార్‌కు చెందిన అనూనుయులే ఇంకా ఈ శాఖలో చక్రం తిప్పుతున్నారని, వారి వల్ల భారీగా ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోందని, ప్రస్తుతం వారి మాటలనే ఆ శాఖ ఉన్నతాధికారులు అమలు చేస్తున్నారని ఈ ఫిర్యాదులో వారు పేర్కొన్నారు.
ఇలా కొన్నేళ్లుగా ఆ శాఖలో ఎలా ఆదాయానికి గండికొడుతున్నారో ఈ ఫిర్యాదులో వారు పేర్కొనడం విశేషం. దీంతోపాటు ఆ శాఖ ఉన్నతాధికారులు కనీసం ఉద్యోగులను పిలిచి వారి బాధలను తెలుసుకోవడం లేదని, కొందరికి మాత్రమే ఆదాయం వచ్చే బాధ్యతలను అప్పగించి వారు చెప్పిన విధంగానే నడుచుకుంటున్నారని గతంలో వీరంతా సోమేష్‌కుమార్ హయాంలో ఆ శాఖ ఆదాయానికి కోట్లలో భారీగా గండికొట్టారని ఈ ఫిర్యాదులో వారు పేర్కొన్నారు. ఇప్పటికైనా ఉద్యోగుల బాధలను ఆ శాఖ ఉన్నతాధికారులు వినాలని ఉద్యోగులు ఈ ఫిర్యాదులో విన్నవించారు.
ఈ నెల 16న ఒకసారి, 18వ తేదీన ప్రధానికి
అవినీతి అధికారులంటూ కొందరి పేర్లను ఈ ఫిర్యాదులో ప్రస్తావించడంతో పాటు వారు చేసిన ఘనకార్యాలను కూడా ఇందులో వారు ప్రస్తావించడం విశేషం. ఈ నెల 16వ తేదీన ఒకసారి, 18వ తేదీన మరోసారి ప్రధాని, కేంద్రహోంమంత్రి, సిఎం రేవంత్‌కు మెయిల్ ద్వారా ఈ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు కాపీని ఆ శాఖ ఉద్యోగులకు, ఉన్నతాధికారులకు సైతం మెయిల్ ద్వారా పంపించారు. ఈ మెయిల్ అందగానే దీనిపై స్పందించిన ఆ శాఖ ఉన్నతాధికారులు కమర్షియల్ ట్యాక్స్‌లో జరిగిన ఇన్‌ఫుట్ సబ్సిడీ కుంభకోణానికి సంబంధించి సిసిఎస్ స్టేషన్‌లో ఈనెల 19వ తేదీన కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ రవి కానూరి ఫిర్యాదు మేరకు అప్పటి సిఎస్ సోమేష్‌కుమార్‌తో పాటు వాణిజ్య పన్నుల శాఖ అడిషనల్ కమిషనర్ కాశీ విశ్వేశ్వర్ రావు, డిప్యూటీ కమిషనర్ ఎ.శివరామ ప్రసాద్, అసిస్టెంట్ ప్రొఫెసర్ శోభన్ బాబు, జిఎస్టీ సాఫ్ట్‌వేర్‌ను తయారు చేసిన ప్లింటో టెక్నాలజీలపై కేసు నమోదు చేశారు.
ఐటీ కంపెనీలు ఉన్నా మాదాపూర్ డివిజన్ ఆదాయం తగ్గుదల
ఈ ఫిర్యాదులో భాగంగా మాదాపూర్ డివిజన్ గురించి ఎక్కువగా ప్రస్తావించారు. ఇక్కడ పనిచేసిన వారిలో ఎక్కువ మంది అరెస్టు అయ్యారని అందులో పేర్కొన్నారు. దీంతోపాటు ఇక్కడ ఎక్కువగా సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఉండగా ఆదాయం మాత్రం చాలా తక్కువగా వస్తుందని దీనిపై విచారణ చేపట్టాలని ఆ ఫిర్యాదులో సూచించారు. కొందరు అధికారుల ఆడిట్‌లను మరోసారి పునః పరిశీలించాలని వారు పేర్కొన్నారు. కొందరు ఎపికి చెందిన వారే ఇప్పటికి ఉన్నతాధికారులుగా వ్యవహారిస్తున్నారని వారే ఈ శాఖను శాసిస్తున్నారని, ఇంకా వారు ఎపి జిఎస్టీ యాక్ట్ ఆఫ్ 1956 ఆధారంగా పన్నులను వసూలు చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొడుతున్నారని వారు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
జిల్లాలో విధులు కేటాయించినా ప్రధాన కార్యాలయం చుట్టే….
దీంతోపాటు కొందరు జాయింట్ కమిషనర్‌లకు జిల్లాలో విధులు కేటాయించినా వారు మాత్రం ఎప్పుడూ హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారని వారికి కేటాయించిన సిబ్బందిని, వాహనాలను దుర్వినియోగం చేస్తూ ప్రభుత్వానికి నష్టం తీసుకువస్తున్నారని, అలాంటప్పుడు వారిని హైదరాబాద్‌కు కేటాయించి అక్కడి వారికి ఆయా జిల్లాల బాధ్యతలను అప్పగిస్తే రెవెన్యూ మరింత పెరిగే అవకాశం ఉందని ఈ ఫిర్యాదులో వారు సూచించారు.
దీంతోపాటు కొన్ని పరికరాల కొనుగోళ్లలోనూ భారీగా అవినీతి జరిగిందని దీనిపై విచారణ జరపాలని వారు విజ్ఞప్తి చేశారు. దీంతోపాటు ఆదాయం వచ్చే సర్కిళ్లు, డివిజన్‌లలో ఆడిట్‌లను పునః పరిశీలిస్తే భారీగా ఆదాయం పెరుగుతుందని, ఒకరిద్దరూ అధికారుల మాటలనే ఆ శాఖ ఉన్నతాధికారులు పరిగణలోకి తీసుకోకుండా మిగతా ఉద్యోగుల సూచనలు, సలహాలను పాటిస్తే ఆ శాఖ నెంబర్‌వన్‌గా తీర్చిదిద్దవచ్చని ఆ దిశగా ఉన్నతాధికారులు ఆలోచించాలని ఆ ఫిర్యాదులో సూచించారు.
ఇలా సుమారుగా 10 నుంచి 15 మంది అధికారులపై ఈ ఫిర్యాదు చేయడం విశేషం. ఇప్పటికే దీనిపై సిఎంఓ అధికారులు ఆరా తీసినట్టుగా సమాచారం. త్వరలోనే ఈ శాఖను ప్రక్షాళన చేసే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. ఇప్పటికే పలువురు ఉన్నతాధికారులపై అవినీతి ఆరోపణలు వస్తుండడం, కొందరు అధికారులు చెప్పిన మాటలనే ఆ శాఖ ఉన్నతాధికారులు పాటిస్తుండడంతో ఆదాయానికి గండిపడుతున్నట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతోపాటు ఆ శాఖలో ఒకరిద్దరూ షాడో కమిషనర్‌లుగా వ్యవహారిస్తుండడం వారి మాటలనే ఆశాఖ ఉన్నతాధికారులు అమలు చేస్తుండడంతో ఆ శాఖ ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు.