-
కేజ్రీవాల్‌కు జైలు
-
కవితకు నో బెయిల్
-
కవిత పిటిషన్‌పై విచారణ వాయిదా
టీఎస్, న్యూస్ :ఢిలీ మద్యం పాలసీ కేసులో ఈడీ కస్టడీలో ఉన్న ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కు కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. లిక్కర్‌స్కామ్‌లో 15 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ సోమవారం ఉదయం తీర్పు వెలువరించింది. ఈ కేసులో మార్చి 22న కేజ్రీవాల్‌ను అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. రౌస్ అవెన్యూ కోర్టు ఆయనకు వారం రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగించింది. ఆ గడువు మార్చి 28న ముగియడంతో కోర్టులో హాజరుపరుచగా ఢిల్లీ సీఎంకు మరో మూడు రోజులు కస్టడీ విధించింది. కోర్టు విధించి ఈడీ కస్టడీ నేటితో ముగిసింది. దీంతో అధికారులు ఆయన్ని ఇవాళ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. భారీ భద్రత మధ్య ఆయన్ను కోర్టుకు తీసుకువచ్చారు.
స్పెషల్ జడ్జి కావేరి బవేజా ముందు ఆయన్ను ప్రొడ్యూస్ చేశారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్‌కు కోర్టు రిమాండ్ విధించింది. ఏప్రిల్ 15 వరకూ జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ తీర్పు వెలువరించింది. ఢిల్లీ సీఎంను తీహార్ జైలుకు పంపాలని ఆదేశించింది. కోర్టుకు తీసుకువస్తున్న సమయంలో రిపోర్టర్లు కేజ్రీని ప్రశ్నించారు. ప్రధాని మోదీ చేస్తోంది దేశానికి మంచిది కాదు అని కేజ్రీవాల్ ఈ సందర్భంగా అన్నారు. అయితే, తనను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఇప్పటికే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్ పిటిషన్ మంగళవారం విచారణకు రానుంది.
కవితకు నో బెయిల్
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ ఏప్రిల్-4కు వాయిదా పడింది. ఏప్రిల్-04న మధ్యాహ్నం 2:30 గంటలకు రౌస్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టనున్నది. సోమవారం నాడు అటు ఈడీ .. ఇటు కవిత తరఫున లాయర్ల సుదీర్ఘ వాదనలు వినిపించారు. దీంతో ఈడీ రిప్లై రిజాయిన్డర్‌కు కవిత తరఫు లాయర్ అభిషేక్ మను సింఘ్విసమయం కోరారు. దీనికోసం ఏప్రిల్-3న సాయంత్రానికి రిజాయిన్డర్ దాఖలు చేస్తామని సింఘ్వి వెల్లడించారు.
కాగా.. కుమారుడి పరీక్షలు దృష్ట్యా బెయిల్ ఇవ్వాలని కోర్టును కవిత విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఏప్రిల్-16 వరకు కవిత మధ్యంతర బెయిల్ కోరారు. మధ్యంతర బెయిల్‌తో పాటు రెగ్యులర్ బెయిల్ కూడా ఇవ్వాలని మను సింఘ్వి కోర్టును కోరారు. దీనిపై ఇవాళ సుదీర్ఘ విచారణ అనంతరం వాయిదా వేయడం జరిగింది. దీంతో ఏప్రిల్ -03, 04 తారీఖుల్లో ఏం జరుగుతుందా..? అనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.