విశాఖ: ముఖ్యమంత్రి చంద్రబాబు ఉమ్మడి విశాఖ జిల్లా పర్యటన కొనసాగుతోంది. అనకాపల్లి జిల్లా పర్యటన అనంతరం పరవాడ నుంచి నేరుగా రుషికొండకు చేరుకున్నారు. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో కలిసి రుషికొండలో చేపట్టిన నిర్మాణాలను చంద్రబాబు పరిశీలించారు.
గత వైకాపా ప్రభుత్వ హయాంలో సుమారు రూ.500 కోట్లు ఖర్చు చేసి రుషికొండపై భవనాలు (ఏడు బ్లాక్‌లు) నిర్మించారు. గత నాలుగు నెలలుగా ఇక్కడి భవనాలు, ఉద్యానవనాల నిర్వహణ, విద్యుత్ వినియోగం కోసం పెద్దమొత్తంలో ఖర్చు చేస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని.. దీనిపై ఒక నిర్ణయానికి రావాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. అందులో భాగంగానే పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్, పర్యావరణ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇప్పటికే రుషికొండకు వచ్చి ఇక్కడి భవనాలను పరిశీలించారు. ఇప్పుడు సీఎం చంద్రబాబు సైతం ఇక్కడి భవనాలను పరిశీలిస్తున్నారు.
నిర్వహణ పరంగా చూస్తే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో.. ఈ భవనాలను ఎం చేయాలి? ఏ విధంగా ఉపయోగించాలి? అనే విషయాలపై చంద్రబాబు అధికారులతో చర్చిస్తున్నారు. అధికారులు పూర్తి సమాచారాన్ని ముఖ్యమంత్రికి వివరిస్తున్నారు. ఏ మేరకు ఇక్కడ విద్యుత్ వినియోగం జరుగుతోందనే వివరాలను ఆ శాఖ అధికారులు సీఎంకు వివరించారు. ఈ భవనాలను భవిష్యత్తులో ఏ విధంగా వినియోగించాలనే అంశంపై ప్రజాభిప్రాయం తీసుకోవడంపై ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.