- దండి కుటీర్ ను సందర్శించి మహాత్మా గాంధీకి నివాళులర్పించిన ముఖ్యమంత్రి
- సీఎం చంద్రబాబుకు దండి కుటీర్ విశిష్టితను వివరించి, సందర్శించాలని సూచించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
గుజరాత్: స్వాతంత్ర్య సమరయోధులు మహాత్మా గాంధీ జీవిత చరిత్రతో ఏర్పాటు చేసిన దండి కుటీర్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందర్శించారు. రెన్యువబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ -2024లో పాల్గొనేందుకు గుజరాత్ లోని గాంధీనగర్ కు వెళ్లిన సీఎం చంద్రబాబును దండి కుటీర్ ను సందర్శించాలని ప్రధాని మోదీ సూచించారు. మహాత్మా గాంధీ జీవిత విశేషాలను అత్యాధునిక టెక్నాలజీతో, అరుదైన చిత్రాలతో ఏర్పాటు చేసిన దండి కుటీర్ గురించి ప్రధాని మోదీ ద్వారా తెలుసుకున్న సీఎం చంద్రబాబు రెన్యువబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ అనంతరం సందర్శించి కాసేపు అక్కడ గడిపారు. సందర్శకుల పుస్తకంలో తన అభిప్రాయాలను సీఎం చంద్రబాబు రాశారు.
గాంధీజీని స్మరించుకుని స్మృతికి నివాళులర్పించారు. దండి కుటీర్ సందర్శన తన జీవితంలో మరపురాని ఘటనగా గుర్తిండి పోతుందని ఈ సందర్భంగా చంద్రబాబు అన్నారు. గాంధీజీ జీవిత చరిత్రను భవిష్యత్తు తరాలు తెలుసుకునేలా దండికుటీర్ ఉందని అభిప్రాయపడ్డారు. అనంతరం సీఎం చంద్రబాబు గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ఆహ్వానం మేరకు ఆయన నివాసంలో తేనేటి విందుకు హాజరయ్యారు.
భారతదేశపు రాజకీయాల్లో విజనరీ లీడర్ గా, అభివృద్ధి పాలకుడిగా చంద్రబాబు నాయుడు తనకు ఎప్పటి నుండో స్ఫూర్తిగా ఉన్నారని గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ కొనియాడారు. భూపేంద్ర పటేల్ ఆతిధ్యానికి సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. గుజరాత్ ప్రభుత్వానికి సంబంధించి పలు ప్రభుత్వ పాలసీలపై ఆ రాష్ట్ర సీఎం భూపేంద్ర పటేల్ తో ఏపీ సీఎం చంద్రబాబు చర్చించారు. అనంతరం అమరావతికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బయలుదేరారు