-
అవసరాలకు అనుగుణంగా నూతన బస్సుల కొనుగోలు
-
సంస్థ రుణ భారం తగ్గింపునకు ప్రయత్నించాలి
-
ఆర్టీసి సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
-
ఉచిత ప్రయాణం చేసిన 83.42 కోట్ల మహిళా ప్రయాణికులు
రాష్ట్రవ్యాప్తంగా ప్రజా అవసరాలకు అనుగుణంగా నూతన బస్సుల కొనుగోలుకు రంగం సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. పెరిగిన అవసరాలు, నూతన మార్గాలను ఇందుకు ప్రతిపాదిక చేసుకోవాలని ఆయన సూచించారు. టిజి ఆర్టీసిపై రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు. మహాలక్ష్మి పథకం మహిళలు వినియోగించుకుంటున్న తీరుపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. మహాలక్ష్మి పథకం అద్భుతంగా ఉందని, ఇప్పటివరకు 83.42 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారని, ఇందుకు సంబంధించి మహిళా ప్రయాణికులకు రూ.2,840.71 కోట్లు ఆదా అయ్యాయని మంత్రి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
ఆర్టీసిలో 7,292 బస్సుల్లో మహాలక్ష్మి పథకం వర్తిస్తోందని ఆయన వివరించారు. మహాలక్ష్మి పథకం ప్రారంభమైన తర్వాత వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్‌లోని ఆసుపత్రులకు వస్తున్న మహిళల సంఖ్య పెరుగుతోందని, అందుకు సంబంధించి పత్రికల్లో వచ్చిన కథనాలను ముఖ్యమంత్రికి అధికారులు పవర్‌పాయింట్ ప్రజేంటేషన్‌లో చూపించారు. అనంతరం వివిధ బ్యాంకులు, ఉద్యోగుల భవిష్యత్ నిధి ఖాతా నుంచి వాడుకున్న నిధులు, విశ్రాంత ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు తదితరాలకు కలిపి రూ.6,322 కోట్ల రుణాలు ఉన్నట్లు అధికారులు వివరించారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలకు చెల్లిస్తున్న వడ్డీ రేటు ఎక్కువగా ఉందని, వడ్డీ రేట్ల తగ్గింపు, అప్పుల రీకన్‌స్ట్రక్షన్‌పై అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
సంస్థపై క్రమంగా రుణభారం తగ్గించాలని ఆయన సూచించారు. మహాలక్ష్మి పథకంతో ఆక్యుపెన్సీ రేటు పెరగడంతో పాటు ప్రభుత్వం చెల్లిస్తున్న రీయింబర్స్‌మెంట్‌తో సంస్థ లాభాల్లోకి వస్తోందని అధికారులు తెలిపారు. ఈ సమీక్షలో రాష్ట్ర ప్రభుత్వ ప్ర ధాన కార్యదర్శి శాంతికుమారి, ముఖ్యమంత్రి కార్యదర్శులు చంద్రశేఖర్ రెడ్డి, షానవాజ్ ఖాసీం, రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, టిజిఎస్ ఆర్టీసి ఎండి సజ్జనార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.