- విభజన చట్టం అమలు, కేంద్రం నుంచి రెండు రాష్ట్రాలకు
- రావాల్సిన నిధుల కోసం కృషి చేయాలని సిఎం పిలుపు
తెలంగాణ, ఎపి నుంచి కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన నేతలకు సిఎం రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలోనే విభజన చట్టం అమలు, కేంద్రం నుంచి రెండు రాష్ట్రాలకు రావాల్సిన నిధుల కోసం కృషి చేయాలని వారిని కోరారు. కేంద్రంలో మూడోసారి ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం కొలువు దీరింది. తెలంగాణ తరఫున కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లు, ఆంధ్రప్రదేశ్ నుంచి రాంమ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాసవర్మలకు మోడీ మంత్రివర్గంలో చోటు దక్కింది. ఈ క్రమంలోనే వారికి సిఎం రేవంత్ రెడ్డి, పలువురు రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.
కేంద్ర మంత్రులు రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలి: మంత్రి పొన్నం
రాష్ట్రం నుంచి కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన కేంద్ర మంత్రులు విభజన చట్టంలోని అన్ని హామీలను నెరవేర్చి అభివృద్ధి కోసం కృషి చేయాలని బిసి, సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు. కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. గత తెలంగాణ ప్రభుత్వం కేంద్రంతో సఖ్యత లేకపోవడంతో రాష్ట్రం అభివృద్ధికి నోచుకోలేదని ఆయన ఆరోపించారు. ప్రస్తుత కేంద్ర మంత్రులు అన్ని రకాల నిధులు రాబడుతూ తెలంగాణ ప్రభుత్వానికి సహకరించాలని పొన్నం ప్రభాకర్ కోరారు.