అధికారులు అనుచితంగా ప్రవర్తించవద్దని తెలంగాణ సీఎస్ సర్క్యులర్ జారీ చేశారు. అచ్చంపేటలో సీఎం రేవంత్ కాళ్లను ఐఏఎస్ శరత్ మొక్కిన ఘటన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అచ్చంపేటలో పర్యటించారు. అక్కడ ఓ సభలో ప్రసంగించారు. ఆ సమయంలో ఐఏఎస్ అధికారి డా. ఎ. శరత్ ఆయన కాళ్లు మొక్కారు. ఈ ఫోటోలు వీడియోలు సోషల్మీడియాలో వైరల్ అయ్యాయి.
ఐఏఎస్ అధికారి శరత్ వ్యవహారం వివాదాస్పదం అయింది. దీంతో తెలంగాణ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు సీరియస్ అయ్యారు. ప్రభుత్వ అధికారులందరికీ కీలక సూచనలు చేస్తూ సర్క్యులర్ పంపించారు. ప్రభుత్వ సమావేశాల్లో కానీ.. ప్రజా సమావేశాల్లో కానీ అధికారులు ఎవరూ అనుచితంగా ప్రవర్తించవద్దని స్పష్టం చేశారు. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరారు. 1968 ఏఐఎస్ రూల్స్ కు అనుగుమంగా మసలుకోవాలన్నారు. అధికారుల ప్రవర్తన ప్రజల్లో నమ్మకం పెరిగేలా ఉండాలి కానీ.. తగ్గేలా ..నవ్వుల పాలయ్యేలా ఉండకూడదన్నారు.
గతంలో తెలంగాణ సీఎం కేసీఆర్ .. కలెక్టర్ల కార్యాలయాలను ప్రారంభించడానికి వెళ్లినప్పుడల్లా అక్కడి అధికారులు కేసీఆర్ కాళ్లకు మొక్కేవారు. ఐఏఎస్ అధికారులు పూర్తి స్థాయిలో గౌరవాన్ని కోల్పోతున్నారన్న విమర్శలు అప్పట్లో వచ్చేవి. అయితే ఇలా చేయవద్దని అప్పట్లో ప్రబుత్వం కానీ.. ఇంకెవరూ కానీ ఆదేశించలేదు. కానీ ఇప్పుడు మాత్రం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ఐఏఎస్ శరత్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసి.. అధికారులంతా రూల్స్ పాటించేలా చూడాలని.. సీఎస్ కు సూచించినట్లుగా తెలుస్తోంది. అందుకే సీఎస్ ప్రత్యేకంగా అధికారులకు సందేశం పంపారని అంటున్నారు.