Sunday, December 29, 2024

సికింద్రాబాద్, వరంగల్ ఎంపి స్థానాలను హస్తగతం చేసుకోవాలి

  • అభ్యర్థుల గెలుపుకోసం సీనియర్‌లు కృషి చేయాలి
  • కాంగ్రెస్ ఓటు బ్యాంకును పెంచుకోవాలి
  • 14 ఎంపి సీట్లు తగ్గకుండా చూడాలి
  • రెండు నియోజకవర్గాల నేతలతో సిఎం రేవంత్ సమావేశం

సికింద్రాబాద్, వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ నాయకులతో సిఎం రేవంత్‌రెడ్డి వేర్వేరుగా సమావేశమయ్యారు. అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని ముఖ్యమంత్రి ఈ రెండు నియోజకవర్గ నాయకులకు దిశానిర్ధేశం చేశారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ బలం ఈ మూడునెలల్లో పెరిగిందని, అసెంబ్లీ ఎన్నికల కంటే ప్రస్తుతం కేడర్ బలంగా తయారయ్యిందని దీనిని నాయకులంతా సద్వినియోగం చేసుకోవాలని సిఎం రేవంత్ ఆ నియోజకవర్గ నాయకులతో పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో 14 ఎంపి స్థానాలు తగ్గకుండా మనం గెలుచుకోవాలని ఆ దిశగా కార్యకర్తలు, నాయకులను సమన్వయం చేసుకొని ముందుకు సాగాలని సిఎం రేవంత్ పిలుపునిచ్చారు. అయితే సికింద్రాబాద్ అభ్యర్థిగా ఇప్పటికే దానం నాగేందర్‌ను కాంగ్రెస్ పార్టీ ప్రకటించగా ఆయన ఖైరతాబాద్ ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేయాలన్న కండీషన్‌ను విధించినట్టుగా తెలిసింది.

అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేయడానికి సుముఖత వ్యక్తం చేయడంతో ఆయన్ను అభ్యర్థిగా మార్చుతారా లేదా అన్నది ప్రస్తుతం సస్పెన్స్‌గా మారింది. ఆదివారం జరిగిన సికింద్రాబాద్ నియోజకవర్గ సమావేశంలో దానం నాగేందర్ కూడా హాజరుకావడంతో అభ్యర్థి మార్పుపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ సమావేశంలో మాత్రం సికింద్రాబాద్ ఎంపి అభ్యర్థి మార్పు ఉండదని నియోజకవర్గ నేతలతో సిఎం రేవంత్ స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంలో ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన అభ్యర్థులు హాజరుకావడంతో ఈసారి కచ్చితంగా ఓడిపోయిన స్థానాల్లోనూ కాంగ్రెస్ ఓటు బ్యాంకు కచ్చితంగా సికింద్రాబాద్ ఎంపి అభ్యర్థికే పడేలా కృషి చేయాలని సిఎం రేవంత్ ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన అభ్యర్థులకు సూచించినట్టుగా తెలిసింది. జూబ్లీహిల్స్ నుంచి పోటీచేసిన అజారుద్దీన్, నాంపల్లి నుంచి పోటీ చేసిన ఫిరోజ్‌ఖాన్, సనత్‌నగర్ ఎమ్మెల్యే అభ్యర్థితో పాటు హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మీలు సైతం ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఈసారి వరంగల్ సీటును కచ్చితంగా గెలుచుకోవాలి
ఇక వరంగల్ పార్లమెంట్ స్థానం నుంచి కడియం కావ్య పోటీ చేస్తుండగా ఈ నియోజకవర్గ పరిధిలోని కాంగ్రెస్ నాయకులతో సిఎం రేవంత్‌రెడ్డి సమావేశమయ్యారు. మంత్రి కొండా సురేఖతో పాటు ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో భాగంగా సిఎం రేవంత్ వీరితో పలు అంశాలపై చర్చించినట్టుగా తెలిసింది. వివిధ పార్టీల నాయకులను కాంగ్రెస్‌లో చేర్చుకునేలా చూడాలని సిఎం వారికి దిశానిర్ధేశం చేసినట్టుగా సమాచారం.

గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అభ్యర్థులకు తగ్గిన ఓటింగ్‌పై ప్రధానంగా దృష్టి సారించాలని సిఎం రేవంత్ సూచించారు. ప్రస్తుతం వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో బిఆర్‌ఎస్ పార్టీకి అభ్యర్థి దొరికే అవకాశం లేకపోవడం, ఓటు బ్యాంకు కూడా కాంగ్రెస్‌కు అనుకూలంగా మారిందని, ఈ నేపథ్యంలోనే కడియం కావ్య గెలుపు సునాయాసం అయ్యే అవకాశం ఉందని దీనిని మనకు అనుకూలంగా మలుచుకోవాలని సిఎం వారితో పేర్కొన్నట్టుగా తెలిసింది. వరంగల్ సీటును ఈసారి ఎలాగైనా కాంగ్రెస్ పార్టీ గెలుచుకునేలా సీనియర్‌లందరూ సమష్టిగా పనిచేయాలని సిఎం రేవంత్ సూచించారు.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com